ఆయన దారి... ఎందరికో రహదారి | Sakshi
Sakshi News home page

ఆయన దారి... ఎందరికో రహదారి

Published Thu, Jun 12 2014 11:11 PM

ఆయన దారి... ఎందరికో రహదారి - Sakshi

ఏ రోడ్డు మీద గుంటలు కనిపించినా వెంటనే కారాపి, వాటిని పూడ్చేస్తారాయన. ఆయన కారు డిక్కీలో గోనె సంచుల నిండా తారుపెళ్లలు, పలుగు, పార ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి... రైల్వే ఉద్యోగం నుంచి రిటైరై... హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాలగంగాధర తిలక్ ఈ పనెందుకు చేస్తున్నట్లు? రోజూ చూసే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది మెరుగైన సమాజం కోసం శ్రమిస్తున్న ఓ సామాన్యుడి విచిత్ర సేవకు వెయ్యిమంది ఎలా కలిశారు?  
 
 ‘‘మొదట్లో నేను ఒక్కడినే చేసేవాడిని. నా చేతికి నీళ్లు పోయడానికి పిలిచినా కూడా ఎవరూ వచ్చేవారు కాదు.  అలాంటిది ఇప్పుడు దాదాపు వెయ్యిమంది దాకా నాతో చేతులు కలిపారు. ఇది నాకెంతో తృప్తినిస్తోంది.’’
 -  తిలక్
 
హైదరాబాద్‌లోని రోడ్ల మీద తరచూ గుంటలను పూడుస్తూ కనిపిస్తుంటారాయన. చూడడానికి బాగా చదువుకున్న వాడిలా అనిపించే ఆయనను చూస్తే, ‘కాంట్రాక్టరేమో... పిసినిగొట్టులా ఉన్నాడు... కూలీలను పెట్టకుండా తానొక్కడే చేస్తున్నాడు. పైగా తారు... కంకర వేయకుండా రాళ్లతో నింపేస్తున్నాడు...’ అనుకొంటారు. ఇంతకీ ఆయన చేస్తున్న పనేంటంటే... రోడ్డు మీద ప్రమాదాలకు కారణమవుతున్న గుంటలను స్వచ్ఛందంగా, స్వహస్తాలతో పూడ్చడం. రోడ్ల మీద గుంటలను పూడ్చే యజ్ఞంలో సమాజంలోని అనేక కోణాలను చూశానంటారు కాట్నం బాలగంగాధర తిలక్.
 
బాలగంగాధర తిలక్‌ది పశ్చిమగోదావరి జిల్లా ఎర్నగూడెం గ్రామంలో వ్యవసాయ కుటుంబం. పాలిటెక్నిక్ పూర్తి చేసి 1993లో రైల్వేలో సిగ్నల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. సాఫ్ట్‌వేర్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన తిలక్... ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ శివార్లలో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. హైదర్‌షా కోట్ గ్రామంలో నివాసం. సాధారణ వ్యక్తిగా తన జీవితమేదో తాను గడిపేస్తున్న తిలక్‌ని అసాధారణ వ్యక్తిగా మార్చిన ప్రదేశం అది.
 
ఆ రోజు ఉదయం మామూలుగానే ఆఫీసుకు బయల్దేరారాయన. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయం. గుంతల్లో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం... బురద నీరు స్కూలుకెళ్తున్న పిల్లల మీద చిందడం జరిగిపోయాయి. ఆందోళనగా కారాపారు తిలక్. స్కూలు పిల్లలతోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్లు ఏమీ మాట్లాడలేదు... కానీ ఒక చూపు చూశారు. ఆ చూపులో చాలా అర్థాలున్నాయి, అనేక భావాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు.
 
మనిషిని మార్చిన సంఘటనలు
కానీ తిలక్‌ని ఆ చూపులు ఆ రోజంతా వెంటాడుతూనే ఉన్నాయి. అదే విషయాన్ని ఆఫీసులో సహోద్యోగులతో పంచుకున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద ఇది చాలా సాధారణం అని తేలిగ్గా అనేశారు. తిలక్ మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయారు. ‘‘ఆ తర్వాత వచ్చిన శని, ఆదివారాల్లో ఆ గుంతలను పూడ్చేశాను. ఇది జరిగింది 2010 జనవరి 19వ తేదీన. ఆ రోజు ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను నింపడానికి ఐదున్నరవేలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత సోమవారం రోజు యథావిధిగా ఆఫీసుకు వెళ్తున్నప్పుడు అదే పిల్లలు కారాపి కృతజ్ఞతలు చెప్పారు’’ అంటూ తన ప్రయత్నం నిరంతర యజ్ఞంలా సాగడానికి దారి తీసిన సంఘటనను తిలక్ వివరించారు.
 
అదే వారంలో ఒకరోజు లంగర్ హౌస్ నుంచి నార్సింగి వెళ్లేదారిలో ప్రయాణిస్తున్నారు తిలక్. రోడ్డుమధ్యలో చిన్న గుంట... బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆ గుంటను తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు. వెనుకే వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి, బైక్ రైడర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో మూడు రోజులకు ఒక ఆటో డ్రైవర్ అదే గోతిని తప్పించబోయినప్పుడు ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఒకరు అక్కడే చనిపోయారు. కళ్ల ముందే ప్రాణాలు పోవడంతో తిలక్ మనసు కలిచివేసినట్లయింది.
 
ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఈ గోతిని ఎవరైనా పూడ్చేస్తే ఈ ప్రమాదాలు జరక్కపోయేవి కదా అని కూడా అనిపించింది. దీనిని ఇలాగే వదలడం ఎందుకు అనిపించి కారాపి ఫుట్‌పాత్ పక్కన ఉన్న తారుపెళ్లలతో గోతిని నింపారు. ఇక అప్పటినుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా రోడ్డు పక్కన కారాపి తారుపెళ్లలతో ఆ గోతిని పూడ్చడం ఆయన దైనందిన కార్యక్రమంగా మారింది. ఆయన కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజులు ఎప్పుడూ ఉంటాయి.
 
పదుగురినీ కదిలించిన సేవ
తిలక్ సందర్భానుసారంగా స్పందించి చేసిన పని, ఆయన కుమారుడు రవికిరణ్ చొరవతో సమష్టికృషిగా మారింది. ఈ క్రమంలో ఇన్‌ఫోటెక్‌లో కన్సల్టెంట్ ఉద్యోగాన్ని మానేశారాయన. పెన్షన్ డబ్బు కూడా మట్టికొనడం వంటి ఇతర అవసరాలకు ఖర్చయిపోవడం మొదలయ్యాక భార్య వెంకటేశ్వరి ఇక చూస్తూ ఊరుకోలేక పోయారు. ఈ సమాచారం అమెరికాలో ఉన్న రవికిరణ్‌కు చేరింది. కానీ, తండ్రిలో పరివర్తన తీసుకురావడానికి ఇండియా వచ్చిన రవికిరణ్ ఈ సేవను కళ్ళారా చూసి, చివరికి తండ్రి మార్గంలోకే వచ్చేశారు. అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబును కలిసి ఈ శ్రమదానానికి ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఇప్పించే ఏర్పాటు చేశాడు.
 
ఇప్పటి నగర కమిషనర్ కూడా సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘అలాగే మా అబ్బాయి నేను గుంటలు పూడుస్తున్న వైనాన్ని ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి, ఇలాగే శ్రమదానం చేయాలనే వారు పాల్గొనవచ్చని ఆహ్వానించాడు. అప్పటి నుంచి చాలామంది యువకులు ముందుకొస్తున్నారు’’ అన్నారు తిలక్. వీరంతా కలిసి ప్రతి శని, ఆది వారాలూ పనిచేస్తున్నారు. ఏ వారం ఎక్కడ శ్రమదానం ఉంటుందనేది ఫేస్‌బుక్ ద్వారానే సమాచారం ఇస్తారు.
 
ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిని మాత్రమే పాల్గొంటారు. అలా ఇప్పటి వరకు దిల్‌షుక్ నగర్, ఎల్.బి నగర్, నాగోల్, వనస్థలిపురం, పురానాపూల్, జియాగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, చందానగర్ రోడ్లను బాగుచేశారు. తిలక్ చేస్తున్న పని ద్వారా సమాజం ఫలితం పొందుతోంది. ఒక సామాన్యుడి శ్రమదానానికి ఇంతకన్నా సత్ఫలితం ఇంకేం కావాలి!  
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు: అనిల్ కుమార్

Advertisement
Advertisement