థెరిసా స్ఫూర్తి...బాలభారతి | Sakshi
Sakshi News home page

థెరిసా స్ఫూర్తి...బాలభారతి

Published Mon, Oct 7 2013 11:52 PM

థెరిసా స్ఫూర్తి...బాలభారతి

జ్ఞానోదయం కావడానికి బోధివృక్షాలే అక్కర్లేదు. మనసును కదిలించే ఒక్క దృశ్యం చాలు. అది నిలువెల్లా పట్టి కుదిపేస్తుంది. హృదయాన్ని మెలిపెడుతుంది. కర్తవ్యబోధ చేస్తుంది. కొత్త లక్ష్యం నిర్దేశిస్తుంది. అలాంటి లక్ష్యంతో ఆవిర్భవించిందే ‘శ్రీ బాలభారతి’ సేవాసంస్థ. గుంటూరుకు చెందిన యర్రం సాంబిరెడ్డి మానసపుత్రిక అయిన ఈ సంస్థ... సేవాకర దీపికలు పంచుకుంటూ మదర్ థెరిసా స్ఫూర్తితో ముందుకు సాగుతోంది.
 
గుంటూరు జిల్లా రెంటచింతలపాడుకు చెందిన ముగ్గురు రైతులు నకిలీ విత్తనాల కారణంగా పంట సరిగా పంటక తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలై, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. భార్యాపిల్లలు గుర్తొచ్చారు. మార్గాంతరం అన్వేషించారు. ఓ దళారిని ఆశ్రయించారు. అయిదులక్షలు ఇస్తానన్నాడు. హైదరాబాదు వెళ్ళి, ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ముగ్గురూ కిడ్నీలు ఇచ్చారు. ముగ్గురికీ కలిపి రెండున్నర లక్షలు చేతిలో పెట్టి, దళారి కాస్తా ఉడాయించాడు. చేసేదీఏ లేక స్వగ్రామానికి తిరిగొచ్చి తెలిసిన వారందరితో మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని పత్రికలు కథనంగా ప్రచురించాయి.
 
అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు బాంధవులు దాన్ని శ్రద్ధగా చదివి, వెంటనే మర్చిపోయారు. కానీ యర్రం సాంబిరెడ్డి  మాత్రం అలా చేయలేదు. బాధితుల్ని కలిశారు. ైధైర్యం చెప్పారు. ముగ్గురినీ గుంటూరు తీసుకెళ్లి, అవసరమైన వైద్య పరీక్షలు చేయించి, మందులిప్పించారు. కొందరి సహకారంతో మళ్లీ పెట్టుబడులకు అవసరమైన మొత్తాన్ని వారికి ఇప్పించారు. సుమారు పాతికేళ్లుగా ‘శ్రీబాలభారతి’ సంస్థ ద్వారా ఇలాంటి ఎన్నో మంచిపనులను తన ఖాతాలో జమ చేసుకుంటున్న సాంబిరెడ్డిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దమ్మాలపాడు గ్రామం. సాంబిరెడ్డి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. కొడుకునైనా బాగా చదివించాలన్న తపనతో ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి, మకాం గుంటూరుకు మర్చారు. పీయూసీ పూర్తి కాగానే సాంబిరెడ్డికి టెలికమ్ విభాగంలో ఉద్యోగం దొరికింది.
 
 కదిలించిన మానవత్వం
 ఉద్యోగం చేస్తున్నపుడు ఓరోజు ఆయన గుంటూరులో మదర్ థెరిసా స్థాపించిన ‘దీర్ఘరోగపీడిత అనాథ శరణాలయానికి’ వెళ్లారు. అక్కడ ఆరుగురు సిస్టర్స్ అందిస్తున్న సేవలు చూసి, ఆశ్చర్యపోయారు. ఓ సిస్టర్ ఒక పెద్దాయనకు గెడ్డం చేస్తోంది. మరో సిస్టర్ ఓ వృద్ధురాలికి అన్నం తినిపిస్తోంది. మరో దృశ్యం మరీ అబ్బురానికి గురిచేసింది. ఒక గదిలో... చర్మరోగంతో బాధపడుతున్న ఓ పాతికేళ్ల యువకుడు. ఒంటిమీద దుస్తులు కూడా సరిగా లేవు. ఓ సిస్టర్ అతని దగ్గరకు వచ్చి, దుస్తులు నిండుగా కప్పి, శరీరానికి మందు రాస్తూ, సపర్యలు చేస్తోంది. కాసేపటి తర్వాత ఆ గదిలోంచి బయటికొచ్చిన సిస్టర్ దగ్గరకు వెళ్లి ‘అలాంటి స్థితిలో ఉన్న అతనికి మీరు సేవలెలా చేయగలుగుతున్నారు?’’ అనడిగారు సాంబిరెడ్డి. దానికామె ‘‘నేను ఒక రోగికి సపర్యలు చేయడం లేదు.
 
 పభువుకి చేస్తున్నాను’’ అంది. రాత్రిపూట నిద్రలో కూడా ఆ దృశ్యం, ఆ సమాధానం సాంబిరెడ్డిని వెంటాడాయి. అతనిలో తల దాచుకున్న ‘సేవకుణ్ని’ బయటకు లాగాయి. తానూ సామాజిక సేవలో భాగస్వామి కావాలన్న మహోన్నత లక్ష్యానికి బాటలు వేశాయి. ప్రేరణనిచ్చిన సంస్థ నుంచే తన సేవాకార్యాక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకున్నారు.ఆ ఆశ్రమంలో పనిచేసే సిస్టర్స్‌కు తెలుగు రాదు. దాంతో వారికీ స్థానికులకూ పరిచయాలు ఏర్పడలేదనీ, అసలు అక్కడో ఆశ్రమం ఉన్న విషయం కూడా గుంటూరులో చాలామందికి తెలియదనీ సాంబిరెడ్డి గ్రహించారు. ఆశ్రమ నిర్వహణకు అవసరమయ్యే డబ్బు కలకత్తా నుంచి వచ్చేది. ‘గుంటూరు స్థానికులకు విరాళాలిచ్చే అలవాటు లేదా’ అని మదర్ ప్రతి నెలా ప్రశ్నిస్తారని ఓ సిస్టర్ చెప్పారు. ఆ ఇబ్బందులను తొలగించాలని సాంబిరెడ్డి కంకణం కట్టుకున్నారు. అక్కడ తల దాచుకుంటున్న రోగుల దీనగాథలు వివరిస్తూ కరపత్రాలు వేసి, ఇంటింటికీ పంచారు. తలా ఒక చెయ్యి వెయ్యండంటూ గడపగడపకూ తిరిగి అభ్యర్థించారు. ఫలితం... ఆరు నెలల తర్వాత కలకత్తా నుంచి డబ్బు తెప్పించుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. పైగా, ఇక్కడి నుంచే కొంత డబ్బు కలకత్తా పంపేవారు.
 
 ‘శిశుభవన్’ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ
 ఆశ్రమంలో కొందరు మానసిక వైకల్యం కలిగిన బాలలు ఉండేవారు. వారిని పెద్దలతోనే కలిపి ఉంచడంతో సిస్టర్స్‌కు ఇబ్బందులు ఎదురయ్యేవి. పిల్లలకు ప్రత్యేకంగా ఒక భవనం ఉంటే బాగుంటుందని సాంబిరెడ్డి భావించారు. స్థలం దొరికింది. దాతల చుట్టూ తిరిగారు. కొన్ని కంపెనీలు సిమెంటు, స్టీలు, కలప ఉచితంగా ఇచ్చాయి. విరాళాలు కూడా బాగా వచ్చాయి. దాంతో ‘శిశుభవన్’ నిర్మాణం సాకారమయింది. ఆ భవనాన్ని మదర్‌కు అంకితమిచ్చారు. ‘‘అక్కడ పిల్లలకు అందుతున్న సేవలు, దాని వెనక నా కృషి తెలుసుకున్న మదర్ స్వదస్తూరితో ‘నిర్మలహృదయ్‌కు భగవంతుడిచ్చిన కానుక యర్రం సాంబిరెడ్డి’ అని రాసి పంపడంతోపాటు నన్ను కలకత్తా రమ్మంటూ ఆహ్వానించారు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన’’ అని ఆయన గుర్తు చేసుకుంటారు.
 
 రేపటి బాలల కోసం
 ‘‘మృత్యువుకు చేరువలో ఉన్న దీనులకు సేవలందించే కన్నా, చిన్నారులకు ఊతమందిస్తే, రేపటి భారతం సుభిక్షంగా ఉంటుందని భావించాను. అదే విషయాన్ని మదర్‌కు చెప్పాను. ఆమె అనుమతితోనే 1990 నవంబరు 14న ‘బాలభారతి’ సంస్థను ప్రారంభించాను. అప్పట్నుంచీ 23 సంవత్సరాలుగా ఏదో ఒక సేవాకార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాను’’ అంటారు సాంబిరెడ్డి. ఈ సంస్థ తరఫున పేదపిల్లల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. హోటళ్లలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను  సేకరించి, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఆలయాల వద్ద భిక్షాటన చేసే అనాథ బాలబాలికలకు స్వయంగా పంచిపెట్టేవారు సాంబిరెడ్డి. ఆరోగ్యశిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేసేవారు. ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లల్ని చేరదీసి, వారి వివరాలు తెలుసుకుని, మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేర్చేవారు. నా అన్నవారు లేని పిల్లల కోసం ‘అమ్మ’ పేరుతో గుంటూరులో ఒక వసతిగృహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సెక్స్‌వర్కర్స్‌గా జీవితం వెళ్లదీస్తున్న 30 మంది బాలికలకు ఆ ఊబి నుంచి విముక్తి కల్పించి, వారికి వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి, ఆదాయమార్గం చూపించారు. పడుపు వృత్తిలో జీవిస్తున్న మహిళల్లో చైతన్యం కల్గించి, వారి పిల్లలు అదే వృత్తిలో కొనసాగకుండా ఉండేందుకు నాటి కలెక్టర్ సహకారంతో ‘వాత్సల్య కుటీర్’ను ఏర్పాటు చేశారు.
 
 మదర్‌కు ‘శత’మానం భవతి!
 మదర్ థెరిస్సా శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు సాంబిరెడ్డి. ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై సుదీర్ఘంగా ఆలోచించి, చివరికి ‘వరసగా వంద కార్యక్రమాలు’ నిర్వహించాలని భావించారు. కానీ అది తన ఒక్కడి వల్ల కాని పని. అందుకే, వంద స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని, వంద కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులైన చేనేత కార్మికులకు పెన్షన్లు అందజేయడం తొలి కార్యక్రమం కాగా, అమెరికాలోని అట్లాంటాలో మదర్ స్థాపించిన అనాథాశ్రమంలో వందోకార్యక్రమం నిర్వహించారు. ఈ శతకార్యక్రమ విశేషాలతో ప్రత్యేక సంచికను వెలువరించారు. ఈయన సేవల్ని గుర్తించిన ‘తానా’ ఇటీవల డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు మహోత్సవానికి సాంబిరెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించింది.
 
 పత్తి రైతుకు పాడి ఊతం
 గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తరచూ పత్తిరైతుల ఆత్మహత్యల వార్తలు పత్రికలకెక్కేవి. సాంబిరెడ్డికి బాగా తెలిసిన ఓ సామాన్య రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో, అతని భార్యాపిల్లలు దిక్కులేని వారయ్యారు. పత్రికల్లో అలాంటి వార్తలు చదివినప్పుడల్లా ఆయన మనసు వికలమయ్యేది ఆ కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని భావించారు. అందులో భాగంగా తొలుత గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు ఇంటికి తిరిగారు. వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో ‘రైతు హృదయ సమ్మేళనం’ పేరిట గుంటూరులో ఒక సమావేశం నిర్వహించారు. వారికి సాయం అందేలా ప్రయత్నించారు. అది కూడా నామాత్రమేనని గ్రహించి ‘బాధిత కుటుంబానికో పాడిగేదె’ చొప్పున పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఒక్క గేదె ఉంటే, కుటుంబం గడుస్తుంది. వారికి అండగా నిలవడానికి ఇదే మంచి తరుణోపాయం అనిపించింది. ఒక్కో గేదెను 50 నుంచి 60 వేల రూపాయలు వెచ్చించి కొని, వారికి అందిస్తున్నాం. ఇప్పటిదాగా సుమారు వంద కుటుంబాలు పాడిపశువుల్ని అందుకున్నాయి. ఇందుకోసం అవరమైన మొత్తాన్ని ప్రవాసాంధ్రుల నుంచి సేకరిస్తున్నాను’’ అని సంతృప్తిగా చెబుతారు సాంబిరెడ్డి.
 
 అభినందనలే అసలైన అవార్డులు
 ఇన్నిన్ని కార్యక్రమాలు చేస్తున్న సాంబిరెడ్డికి ఇందుకోసం ప్రత్యేక నిధి అంటూ ఏమీలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో చీఫ్ సెక్షన్ ఆఫీసర్‌గా రిటైరైన ఆయన... మంచిపనులకు నిధుల కొరత ఎప్పుడూ ఉండదని నమ్ముతారు. కొడుకు, కూతురు అమెరికాలో స్థిరపడ్డారు. ఖర్చులకోసం వారు పంపిన డబ్బును కూడా సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటారు సాంబిరెడ్డి. తన సేవలకు గుర్తింపుగా చాలా అవార్డులు అందుకున్నారాయన. రాష్ట్ర శిశుసంక్షేమశాఖ, నాగార్జున విశ్వవిద్యాలయం, జాతీయ మహిళాకమిషన్, భారతజ్యోతి, వార్దా ఆశ్రమం... ఇలా ఎన్నో సంస్థలు సాంబిరెడ్డి సేవల్ని సగౌరవంగా సత్కరించాయి. కానీ ‘‘నన్ను అభినందిస్తూ మదర్ థెరిస్సా స్వదస్తూరితో రాసిన ఉత్తరమే నాకు పెద్ద అవార్డు’’ అంటారాయన.
 - ఎమ్వీ రామిరెడ్డి
 
 సేవాదీపికలు
 వందకు పైగా వైద్యశిబిరాలు నిర్వహించి, 25వేల మంది పేదబాలలకు వైద్యులతో పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘరోగ పీడితులకు హెల్త్ కార్డులు అందించారు.
 నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ సహకారంతో ‘మహిళా లోక్ అదాలత్’ నిర్వహించి, ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న సమస్యల్ని పరిష్కరించారు.
 ప్రత్యేకంగా బాలకార్మికుల కోసం ‘బాలహిత’ పేరుతో పాఠశాలను ప్రారంభించారు.
 ముస్లిం బాలికలకు మదర్ థెరిస్సా పాఠశాలలో ఎంబ్రాయిడరీ, డ్రస్‌మేకింగ్ వంటి అంశాల్లో శిక్షణకేంద్రం నిర్వహించారు.
 జిల్లా జైలులోని మహిళా ఖైదీలకు ఎంబ్రాయిడరీ, మగ్గం పని, శారీ పెయింటింగ్ వంటి చేతి వృత్తుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారు బయటికి వచ్చాక తమ కాళ్ల మీద తాము నిలబడేలా మార్గనిర్దేశనం చేశారు.
 
 కోటి రూపాయలిచ్చినా దక్కని అనుభూతి!
 గుంటూరులోని అనాథాశ్రమంలో రోగులు మరణించే ముందు వారి ఆఖరి కోరిక తీర్చడం ఆనవాయితీ. సిస్టర్స్‌కు తెలుగు రాదు కాబట్టి, నేనే ఆ రోగుల కోరికలేమిటో అడిగి తెలుసుకునేవాణ్ని. ఒకరోజు ఓ భిక్షకుడు రైల్వేస్టేషన్‌లో యాచన చేస్తూ, ప్రమాదవశాత్తు రైలుకింద పడ్డాడు. రెండు కాళ్లూ విరిగాయి. ప్రభుత్వాసుపత్రిలో చేర్పిస్తే, వైద్యులు పెదవి విరిచారు. ఆ విషయం తెలుసుకున్న సిస్టర్స్ అతన్ని నిర్మల్ హృదయ్‌కు తీసుకొచ్చారు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ‘నీ ఆఖరి కోరిక ఏమిటి’ అనడిగాను. అతను సమాధానమివ్వడానికి సంకోచించాడు. ఎలాంటిదైనా ఫర్లేదు.... చెప్పమన్నాను. అతను అతి కష్టం మీద ఒక బీడీ కావాలని అడిగాడు. వెంటనే తెచ్చి, అతని నోట్లో పెట్టి,  నేనే వెలిగించాను. అతను సంతృప్తిగా బీడీ తాగి, నా ఒడిలోనే ఆఖరి శ్వాస వదిలాడు. అతను చనిపోయాడన్న బాధకన్నా, అతని ఆఖరి కోరిక తీర్చగలిగానన్న సంతృప్తే నన్ను ఎక్కువగా ఆవరించింది. కోటి రూపాయలిచ్చినా దక్కని అమూల్య అనుభవమది.
 - యర్రం సాంబిరెడ్డి
 

Advertisement
Advertisement