ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త ఇలా... | Sakshi
Sakshi News home page

ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త ఇలా...

Published Wed, Apr 22 2015 11:14 PM

Be careful with Induction stove

ఉన్నట్టుండి గ్యాస్ అయిపోయినప్పుడు వంట చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇండక్షన్ స్టవ్. అందుకే వీటి వినియోగం ఇటీవల బాగా పెరుగుతోంది. అయితే వాడకం తెలియక కొందరు వీటితో ఇబ్బందులు పడుతున్నారు. కేర్ తీసుకోవడం రాక వాటిని పాడు చేస్తున్నారు కూడా. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఇండక్షన్ స్టవ్ మీద కేవలం స్టీలు లేక ఇనుప పాత్రలనే ఉపయోగించాలి. ఇది విద్యుత్‌తో పని చేస్తుంది కాబట్టి నీటిని దూరంగా ఉంచాలి. సిమెంటు నేల, సిరామిక్ టైల్స్ మీద పెట్టవచ్చు కానీ... తడిగా ఉన్న నేలమీద పెట్టి మాత్రం వండకూడదు. నిజానికి ఏ చెక్క టేబుల్ మీదో పెట్టుకోవడం ఉత్తమం. మెటల్ టేబుల్ మీద పెట్టకూడదు. ఈ స్టవ్‌లో ప్రవహించే విద్యుత్ విపరీతమైన వేడిని పుట్టిస్తుంది. అది కొంత దూరం వరకూ కూడా ప్రవహిస్తుంది. కాబట్టి దీనికి దగ్గర్లో పొరపాటున కూడా బట్టలు, కాగితాలు పెట్టకూడదు.

మెటల్ వస్తువులను కూడా దగ్గరలో ఉంచకూడదు. రేడియో, టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి చాలా దూరంలో ఈ స్టవ్‌ను పెట్టాలి. లేకపోతే అయస్కాంత ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్‌ని దేనికి పడితే దానికి కనెక్ట్ చేయకూడదు. అంటే ఎక్స్‌టెన్షన్ బాక్సులవీ వాడకూడదు. మామూలు స్టవ్‌లను కడిగినట్టు సబ్బునీటితో రుద్దడం చేయకూడదు. అమ్మోనియా, బ్లీచ్ ఉండేవాటిని అస్సలు ఉపయోగించకూడదు. అసలు తడి తగలకుండా మెత్తని బట్టతో శుభ్రం చేయాలి. పొరపాటున స్టవ్ మీద చిన్న పగులు ఏర్పడినా దాన్ని వాడకూడదు. అలాగే వాడటం పూర్తవగానే స్విచ్ ఆఫ్ చేసి ఊరుకోకూడదు. తప్పకుండా డిస్‌కనెక్ట్ చేసెయ్యాలి.     - సమీ

Advertisement
Advertisement