డామిట్... ఈ వామిట్స్ తగ్గేదెలా? | Sakshi
Sakshi News home page

డామిట్... ఈ వామిట్స్ తగ్గేదెలా?

Published Mon, Jun 30 2014 11:43 PM

Beriyatrik Surgery

నేడు డాక్టర్స్ డే

డాక్టర్. కె.ఎస్. లక్ష్మీకుమారి, సీనియర్ కన్సల్టెంట్ - మినిమల్
 యాక్సెస్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ,
 గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్

 
అప్పటికే ఎన్నో బేరియాట్రిక్ సర్జరీలు చేసిన అనుభవం నాది. అత్యంత సంక్లిష్టమైన కేసులు ఎదుర్కొన్న రికార్డు నాది. ఓ అంతుచిక్కని కేసు. శ్రీనివాస్ అనే పేషెంట్ అప్పటికే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మూడుసార్లు సర్జరీ చేయించుకున్నాడు. అప్పటినుంచి కొద్దిగా ఆహారం తీసుకున్నా వాంతి అయిపోతోంది. అప్పటికే మూడు సర్జరీలు! ఇక ఏం చేయాలో తెలియక ప్రాణాన్ని రక్షించడం కోసం అవసరమైన పోషకాలు అందడానికి వీలుగా నేరుగా పొట్టలోకి, పేగుల్లోకి ఒక చిన్న పైప్ వేశారు.

పైప్ ద్వారా ఘనాహారం అందించలేరు, ద్రవాలను పంపిస్తూ ఉన్నారు. తప్పు ఎక్కడ దొర్లిందో అర్థం కావడం లేదు. మళ్లీ ఒకసారి వరసక్రమంలో పరీక్షలు చేసుకుంటూ వచ్చాం. తప్పిదం ఎక్కడో తెలియలేదు. అయినా సరే... మరోమారు శ్రీనివాస్ శరీరానికి శస్త్రచికిత్స చేయాలనుకున్నాం. అయితే అప్పటికే అది నాలుగో శస్త్రచికిత్స! ఆపరేషన్ చేస్తున్నప్పుడు జరిగిన పొరబాటేమిటో తెలిసింది.

గతంలో శస్త్రచికిత్స చేసే సమయంలో జీర్ణమార్గం ఉండాల్సిన రీతిలో కాకుండా, పొరబాటున దాన్ని కాస్త దారి మళ్లించినట్లు మాకు అర్థమైంది. దాన్ని సరిదిద్దడానికి మాకు చాలా వ్యవధి పట్టింది. ప్రక్రియనైతే పూర్తి చేశాం గానీ... మా అందరిలో ఎంతో ఉద్విగ్నత. శ్రీనివాస్ మామూలుగా భోజనం చేసిన రోజు మా అందరి కళ్లలోనూ తృప్తి నిండిన కాంతులే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement