బీబర్ ఒక బ్రాండ్! | Sakshi
Sakshi News home page

బీబర్ ఒక బ్రాండ్!

Published Sun, Aug 25 2013 11:24 PM

బీబర్ ఒక బ్రాండ్! - Sakshi

అతడి శ్వాస సంగీతం... అతడి పెదవంచు స్వరం కోట్ల హృదయాల్లో రిథమ్...స్టైల్, ఇమేజ్, ఫ్యాన్స్... విషయాల్లో అతడొక సంచలనం. అతడే... జస్టిన్ బీబర్. తన హమ్మింగ్‌తో సంగీతానికున్న హద్దులను చెరిపేస్తున్న టీనేజర్ ఇతడు. కెనడాలో పుట్టిన బీబర్ 20 ఏళ్లు కూడా రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబర్ సాంగ్, బీబర్ స్టైల్, బీబర్ సంపాదన... ప్రతి ఒక్క అంశమూ సంచలనమే. అలాంటి ఈ ‘94 బార్న్ యువ తరంగం గురించి...
 
 అభిమానుల సంఖ్య, సంపాదించిన డబ్బు, మీడియా కవరేజ్, సోషల్‌మీడియాలో ఫాలోయింగ్... ఏ పరంగా చూసినా బీబర్ ఒక వండర్ బాయ్. సింగర్- సాంగ్‌రైటర్, మ్యుజీషియన్, ప్రొడ్యూసర్, యాక్టర్, డాన్సర్, ఇన్వెస్టర్.. ఇవి బీబర్‌కు ఉన్న హోదాలు. ట్రంపెట్ , డ్రమ్స్ వాయించగలడు. గిటార్, పియానోలతో విన్యాసాలు చేయగలడు. పాశ్చాత్య దేశాలను తన సంగీత ఝరిలో ముంచెత్తుతున్న టీనేజ్ యువకుడే జస్టిన్ బీబర్. 1994 మార్చి ఒకటో తేదీన పుట్టిన బీబర్ తన 14వ యేట తొలిగుర్తింపు పొందాడు.

2008లో రేమాండ్ బ్రౌన్ మీడియా గ్రూప్ (ఆర్‌బీఎమ్‌జీ) తో చేరడంతో బీబర్‌కు గుర్తింపు లభించింది. అక్కడ నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకోవడానికి బీబర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 2009లో ‘మై వరల్డ్’తో పాప్‌వరల్డ్‌లోకి ప్రవేశించాడు బీబర్. ఏడు ట్రాక్స్‌తో విడుదలైన ఈ ఆల్బమ్ అమెరికాలో అద్వితీయమైన స్థాయిలో అమ్ముడయ్యింది. దీంతో ఒక్కసారిగా బీబర్ పేరు మార్మోగిపోయింది. పదిహేనేళ్ల వయసు యువకుడి గానామృతంలో పాప్ ప్రియులు ఓలలాడారు. బీబర్ మళ్లీ ఎప్పుడు పాడతాడా అని ఎదురుచూడసాగారు.

2010లో వచ్చిన స్టూడియో ఆల్బమ్, మై వరల్డ్ లైతే పిచ్చెక్కించేశాయంతే!  అనేక దేశాల్లో అమ్మకాల చార్ట్‌లలో బీబర్ ఆల్బమ్‌లు తొలిస్థానంలో నిలిచాయి. బేబీ, మై వరల్డ్ టూర్ వంటి ఆల్బమ్‌లు వస్తూనే అమ్మకాల విషయంలో బీబర్ స్థాపించిన పాత రికార్డులను చెల్లాచెదురు చేశాయి. ప్రపంచపటంలో మూలగా ఉండే కెనడాలో బీబర్ గొంతు విప్పాడంటే... మరో మూలన ఉన్న ఆస్ట్రేలియా వరకూ ఆ పాట అలలా వచ్చి తాకుతుంది. ఆన్‌లైన్ సాయంతో ఈ పడమటి గాలి మన దేశాన్ని పలకరిస్తోంది. మన దగ్గరా బీబర్‌కు ఎన్నో లక్షలమంది ఫ్యాన్స్ ఉన్నారు. బీబర్ ట్విటర్ అకౌంట్‌లో ఉన్న నాలుగు కోట్ల మంది ఫాలోవర్లలో చాలామంది భారతీయులు ఉంటారు.
 
 బీబర్ ఫ్యాన్స్‌‘బిలీబర్స్’గా ప్రసిద్ధులు. తమను తాము బిలీబర్స్‌గా చెప్పుకోవడం కూడా యువతలో ఒక గొప్ప! తన సంపాదనతో బీబర్ ఇప్పటికే ఫోర్బ్స్ పత్రికలో స్థానం సంపాదించాడు. 2012లో బీబర్ సంపాదన 55 మిలియన్ డాలర్లు అని ఒక అంచనా.
 
 యువకుల ఫేవరెట్ స్టైల్...


 పొడవాటి జుట్టును కనుబొమలపై పడేలా దువ్వుకోవడం.. అంతవరకూ అమ్మ దువ్విపెడుతున్న జుట్టుకు  కాస్తంత టీనేజ్ నిర్లక్ష్యం తోడవ్వడంతో వచ్చిన స్టైల్ అది. ఇప్పుడు ఎంతోమంది యువకుల ఫేవరెట్ హెయిర్ స్టైల్.
 
 బీబర్ ది బాస్...


 బీబర్ మైఖేల్ జాక్సన్‌కు పెద్ద ఫ్యాన్. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను నిలుపుకోవడంలో మైఖేల్ ఆదర్శమని బీబర్ అంటాడు. టీనేజ్‌లోనే వెలుగులోకి వచ్చిన జాక్సన్ పాప్ మ్యూజిక్‌పై, ఫ్యాన్‌ఫాలోయింగ్‌పై ఎలా పట్టును నిలుపుకున్నాడో తాను కూడా అదే విధంగా కొనసాగగలనని బీబర్ అంటాడు. ‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన దయవల్లే నాకు ఈ గుర్తింపు దక్కిందని భావిస్తాను. అందుకే నా ప్రతి షోతోనూ ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలని భావిస్తాను...’ అంటాడు ఈ టీనేజ్ సెన్సేషన్. బీబర్ జీవితం ఆధారంగా ‘బీబర్: నెవర్ సే నెవర్’ అనే బయోపిక్ కూడా వచ్చింది.
 
 - జీవన్
 

Advertisement
Advertisement