మమతా ఎనర్జీ | Sakshi
Sakshi News home page

మమతా ఎనర్జీ

Published Sun, Feb 14 2016 11:12 PM

మమతా ఎనర్జీ

కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి మమత. అయితే ఆ మాటను దీదీ ఒప్పుకోరు. ‘‘నేనెక్కడికీ ఎదగలేదు. ప్రజల మధ్యలోనే ఉన్నాను’’ అంటారు. ‘కాదు, కాంగ్రెస్ నుంచే ఎదిగారు గుర్తుకుతెచ్చుకోండి అని రెట్టిస్తే’ - ‘నిజమే, కాంగ్రెస్ తప్పిదాల నుంచి ఎదిగి ఉంటాను’ అని నవ్వేస్తారు!
 
ప్రజల కోసం తను ఎంతైతే  చెయ్యగలరో అంతా చేసేందుకు ప్రయత్నిస్తారు మమతా బెనర్జీ.  అందుకోసం అడ్డొచ్చిన వారిని హక్కుగా నిలదీసి అడుగుతారు. వారు సొంత పార్టీవారైనా, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా! ఆ ధర్మాగ్రహమే.. ఆమె ఎనర్జీ. ఆ ఎనర్జీతోనే ఇప్పుడు మమతా బెనర్జీ.. ఎన్నికలకు సిద్ధమౌతున్నారు.

 
 
20 మే 2011. శుక్రవారం.
  ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఆ ఉదయమే ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ నుంచి రైటర్స్ బిల్డింగ్స్ (సచివాలయం)కి వెళ్లాలి.  రోడ్డయితే ఉంది కానీ వెళ్లేందుకు దారే లేదు. కనీసం రెండు లక్షల యాభై వేల మంది బెంగాల్ ప్రజలు తమ తొలి మహిళా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడం కోసం క్రిక్కిరిసి ఉన్నారు.  
 ‘‘నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’’ అని గవర్నర్‌ను అడిగారు మమత. ఆ తర్వాత ప్రజల మధ్యలోంచి అడుగు అడుగు వేసుకుంటూ... పుష్పగుచ్ఛాలు, ఆశీర్వచనాలు అందుకుంటూ కిలో మీటరు దూరంలో ఉన్న సచివాలయం చేరుకున్నారు. పదిహేడేళ్ల తర్వాత ఆమె మళ్లీ సచివాలయం గడప తొక్కడం అదే మొదటిసారి!
 
పదిహేడేళ్ల క్రితం ఒకరోజు - పోలీసులు మమతాబెనర్జీని అదే సచివాలయ ప్రాంగణం నుంచి ఈడ్చి పడేశారు! అప్పుడామె కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ కార్యకర్త. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు. బసు కార్యాలయం బయట మమత నినాదాలిస్తోంది. అత్యాచారానికి గురైన ఒక బాధితురాలిని బసు పరామర్శించాలని ఆమె డిమాండ్. అత్యాచారం జరిపింది సి.పి.ఎం. కార్యకర్తలేనని ఆరోపణ. బసు బయటికి రావడం లేదు. మమత బయటికి వెళ్లడం లేదు. మధ్యలోకి పోలీసులు తోసుకుంటూ వచ్చేశారు. మమతను గెంటేశారు.
 
అదిగో... అప్పుడు చేశారు ఆవిడ ప్రతిజ్ఞ. బెంగాల్లో కమ్యూనిస్టుల కరెంట్ పోయేవరకు రైటర్స్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టనని ప్రకటించారు. చివరికి ప్రజలే ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చారు!
 
గిర్రున ఐదేళ్లు !
బెంగాల్‌కు మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ నెల చివర్లో షెడ్యూల్. మార్చి మొదటి వారంలో మమత ప్రచారం. అయితే ఈసారి మమత ప్రత్యేకంగా హామీలేం ఇవ్వడం లేదు. అలాగని చేసిన పనుల్నీ ఏకరువు పెట్టబోవడం లేదు. ‘మా, మాటీ, మనుష్’ (మదర్, మదర్‌లాండ్, పీపుల్) అనే తన పూర్వపు నినాదంతోనే ప్రజల్లోకి వెళుతున్నారు. బి.జె.పి. వ్యతిరేక శక్తులను చేరదీసి, సి.ఐ.ఐ.(ఎం)కి వ్యతిరేకంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.
 
ఇంతకీ ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా మమత ఏం చేశారు? అన్నం మొత్తం పట్టుకుని చూడనవసరం లేదు.
 ముఖ్యమంత్రిగా తొలి 48 గంటల్లోనే తనేమిటో బెంగాల్‌కి, మిగతా దేశానికి చూపించారు మమత. మొదట ఆమె అన్ని ప్రొటోకాల్స్‌ని బ్రేక్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అధికార లాంఛనాన్నీ తీసి అవతల పడేశారు. బులెట్ ప్రూఫ్ కారును తిప్పి పంపించారు. తన సొంత కారులోనే విధులకు బయల్దేరారు.
 
ఆ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపించే విషయంలోనూ కోల్‌కతా రాజనీతిజ్ఞులు మునుపెన్నడూ ఎరుగని ప్రత్యేక మర్యాదలు పాటించారు! మమత సూచన మేరకు డిప్యూటీ అసెంబ్లీ లీడర్ పార్థ చటర్జీ ఉదయం 8.35కి నేరుగా బుద్ధదేవ్ భట్టాచార్జీ (అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి) ఇంటికి వెళ్లి, తలుపు తట్టి మరీ ఆయన చేతికి ఇన్విటేషన్ అందించారు!
 
అనుకోని అతిథులు
ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని అంత పర్సనల్‌గా ఆహ్వానించడం బెంగాల్‌లో బహుశా అదే మొదటిసారి కావచ్చు.
 
ఇలాంటి ‘ఫస్ట్’లు ఇంకో రెండుమూడు కూడా ఉన్నాయి! సీమ అని... సెక్స్ వర్కర్. సోనాగంజ్ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటుంది. ఆవిడక్కూడా మమత ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, నెతాయ్, నందిగ్రామ్ ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు మమత నుంచి ఆహ్వానాలు అందాయి.
 
ఏం చేసినా ప్రజల కోసమే..
మమతా బెనర్జీ... అగ్గిరవ్వ, తారాజువ్వ.  మొహమాటాల్లేని మనిషి. ‘నీకోసం అది చేశాను, ఇది చేసేశాను. అవన్నీ మర్చిపోయి ఇప్పుడిలా చేస్తావా’ అని అడిగితే - ఎంతటి వాళ్లకైనా ఆమె చెప్పే సమాధానం ఒక్కటే... నీకూ నాకూ జరగడం కాదు, ప్రజలకు ఏం ఒరిగిందన్నదే నా ప్రయారిటీ అని! మమత తగాదాలు,  వివాదాలు, నినాదాలు, రాజీనామాలు  అన్నీ ప్రజల కోసమే. అలాగే ఏ పార్టీలో ఉన్నదీ, ఏ పదవిలో ఉన్నానన్నది,  ఎవరికి మద్దతు ఇస్తున్నదీ ముఖ్యం కాదు దీదీకి.

తను అనుకున్నది నెరవేరాలి. అంతే. అయితే తనెప్పుడూ తనకోసం ఏదీ అనుకున్నది లేదు. ప్రజలు, పశ్చిమబెంగాల్... పార్లమెంటులోనూ ఇదే ఆమె అజెండా. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మమత కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. యూత్, స్పోర్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ చూస్తున్నారు ఆవిడ. దేశంలో క్రీడారంగం నీరసించి పోయింది. కాస్త గ్లూకోజ్ ఎక్కించండి అని దీదీ ఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. చిర్రెత్తుకొచ్చి కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో పెద్ద ర్యాలీ తీశారు.

రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మమతతో వేగలేక కాంగ్రెస్ ఆమె శాఖలన్నిటినీ ఇంకొకరికి మార్చింది. అయినా దీదీ మారలేదు. బెంగాల్లో సి.పి.ఐ-ఎం. కి కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోందని 1996 ఏప్రిల్లో బహిరంగంగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ వణికిపోయింది. ఇంటి రహస్యాలను ఎవరైనా బైటికి చెప్పుకుంటారా అని ప్రత్యేక దూతలు కొందరు ఢిల్లీ నుంచి వచ్చి లాజికల్‌గా  కన్విన్స్ చెయ్యబోయారు కానీ ఆమె కాలేదు. తర్వాతి ఏడాదే పార్టీ నుంచి బయటికి వచ్చేశారు.
 
దీదీగిరి
‘దాదాగిరి’ అనే మాట భారత రాజకీయాలలోకి ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం. ‘దీదీగిరి’ అనే మాట మాత్రం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టుకొచ్చింది! మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి మరీ అమె 2011లో బెంగాల్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చీరావడంతోనే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ ప్రజలకు చేరువ అయ్యారు.

అవే పరుగులను తనను వ్యతిరేకించేవారినీ పెట్టించి అసహన వైఖరికి ప్రతిరూపంలా నిలిచారు. అయితే ఈ వైఖరిని నియంతృత్వ పోకడ అనేందుకు లేదు. ప్రజల మధ్య చిరస్థాయి నాయికగా నిలిచిపోయేందుకు చేసే ప్రయత్నంలో అమె అనుసరించిన విధానంగానే చూడాలి. పాలనలో వందకు వంద మార్కులు గెలుచుకోగలిగారంటే అంత కన్నా ముందు ప్రజల హృదయాలను గెలుచుకున్నారనే కదా.
 
దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన నాయకురాలు మమత. స్కూల్లో ఉండగానే ఆమె విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరీ పదిహేనేళ్ల వయసుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ, ‘లా’లో ఇంకో డిగ్రీ... పాలిటిక్స్‌లో ఉంటూనే పూర్తి చేశారు. పొయెట్రీ రాశారు. పుస్తకాలు వేశారు. సీపీయెంకు వ్యతిరేకంగా గోడలకు పోస్టర్లు అంటించిన అజ్ఞాత కార్యకర్తగా మొదలైన మమత కెరీర్.. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగింది.

ఆ తర్వాత కాంగ్రెస్‌నే ధిక్కరించే స్థాయికి, శిఖరాగ్రానికి చేరుకుంది. మమత ఒక సాధారణ మహిళగా ఎలా ఉంటారో... ముఖ్యమంత్రిగానూ అలాగే ఉంటారు. రెండు మూడొందల్లో వచ్చే కాటన్ చీర, కాళ్లకు రబ్బరు స్లిప్పర్స్.. ఇవీ కూడా ఆమె దృఢచిత్తంలా ఆమెకో ప్రత్యేకమైన గుర్తింపును, ఎనర్జీని తెచ్చిపెట్టాయి.
 
 
మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

జననం    : 5 అక్టోబర్ 1960
జన్మస్థలం     : కలకత్తా
తల్లిదండ్రులు    : గాయత్రి, ప్రమీలేశ్వర్ బెనర్జీ
తోబుట్టువులు    : ఆరుగురు సోదరులు
వైవాహిక స్థితి    : అవివాహిత
పార్టీ    : తృణమూల్ కాంగ్రెస్
రాజకీయ ప్రవేశం    : 1970 (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)
కాంగ్రెస్‌ను వదిలిపెట్టింది    : 1997
చేపట్టిన పదవులు    : ఎంపీగా, రైల్వే మంత్రిగా.
ప్రస్తుత ప్రాతినిధ్యం    : భవానీపూర్ (విధాన సభ నియోజకవర్గం)
ఆటోబయోగ్రఫీ    :  మై అన్‌ఫర్గెటబుల్ మెమరీస్
 
రాజకీయాలలోకి ప్రవేశించినట్లే, చదువులలోకీ చాలా త్వరగా వచ్చేశారు మమత. సెకండరీ (టెన్త్) పరీక్షలు రాయడానికి వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారు! అసలైతే మమత పుట్టింది 1960 అక్టోబర్ 5న. రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5.

Advertisement
Advertisement