మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు! | Sakshi
Sakshi News home page

మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు!

Published Tue, Nov 5 2013 11:32 PM

మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు!

 ‘ఒత్తిడి అలా కొనసాగుతూ ...
 అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించగలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు.  ఒత్తిడి అప్పటికి  తొలగినా... దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు... అందువల్ల దాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం... ఈ కథనం.
 
 ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం.
 ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు :
 1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే.
 
 2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్త్రపరంగా రుజువైంది. అంతేకాదు... తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవతిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మందిని కాలుష్యపు పొగకు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా సోకింది.
 
 3. స్థూలకాయం: మన శరీరంలో కొవ్వు పేరుకునే ప్రాంతాల్లో... తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఒత్తిడి వల్ల పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాల నష్టాలని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం, రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్యభంగం జరగడం.
 
 4. డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్‌కు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇది రెండురకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్థాలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం మరో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ  ఒక చక్రంగా సాగిపోతూ అనారోగ్యపు ఊబిలోకి దించుతూపోతుంది.
 
 5. తలనొప్పి: ఒత్తిడివల్ల కొన్ని తలనొప్పులూ, మైగ్రేన్ రావడం సహజం. వాటి కోసం వాడే నొప్పి నివారణ మందులతో కొన్ని దుష్ఫలితాలు రావడం సాధారణం. వాటితో మరింత అనారోగ్యం కలగడం మరింత సర్వసాధారణం. ఇలా ఒకటికొకటి తోడవుతూ ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం అన్నది ఒత్తిడి తాలూకు మరో చెడు  లక్షణం.
 
 6. డిప్రెషన్, యాంగ్జైటీ: ఒత్తిడికి గురైన వారు ఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగ్జైటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకాలిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్‌కు లోనైన దాఖలాలు చాలా ఉన్నాయి.
 
 7. జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యేవారిలో చాలామంది జీర్ణకోశ సమస్యలకు గురవుతుండటం సాధారణం. వీరిలో చాలామందికి ఒత్తిడికి గురికాగానే కడుపులో యాసిడ్స్ స్రవించి మంట రావడం, అలా మంటలు వచ్చే వారిలో చాలామందికి దీర్ఘకాలంలో కడుపులో అల్సర్స్ కనిపిస్తాయి. ఇలా గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా సాధారణంగా కనిపించే పరిణామం. ఆ సంకేతాన్ని కొన్నిసార్లు గుండెపోటుగా పొరబడటమూ చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) అనే శారీరక రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి కారణంగానే జరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
 
 8. అల్జైమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అల్జైమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అల్జైమర్స్ డిసీజ్ తీవ్రం కావడం చాలా వేగంగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అల్జైమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని గుర్తించాలి. పైగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది తీవ్రమయ్యే వేగం కూడా పెరుగుతుందని గ్రహించాలి.
 
 9. వేగంగా వయసు పైబడటం: ఒత్తిడి వల్ల త్వరగా వృద్ధులైపోయే మరో దుష్పరిణామం కనబడుతోంది. తల్లుల, పిల్లల డీఎన్‌ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశకు సమీపించినట్లు, వారిలో వృద్ధాప్యలక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
 
 10. చాలా ముందుగా మరణించడం (ప్రీ-మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగా పోయారంటూ బాధపడటం మామూలే. ఒత్తిడితో ఇలాంటి మృతులు సంభవించడాన్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగా వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
 అధిగమించడం మేలు... అది చేయాల్సిందిలా...
 మానసిక ఒత్తిడి వల్ల కలిగే  శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రించడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి...
 
 ఊ ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి... ఊ చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం ఊ ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ  పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. ఊ ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా  చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచెప్పుకోవడం ఊ పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
 
 ఏ శారీరక లక్షణాల ద్వారా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించవచ్చు..?
 కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...
 
 1. నిద్రపట్టకపోవడం 2. ఆకలి లేకపోవడం 3. కండరాలు బిగుతుగా పట్టేయడం. 4. మాటిమాటికీ తలనొప్పి 5. జీర్ణకోశ సమస్యలు 6. దీర్ఘకాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం.
 ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీయకముందే జాగ్రత్తపడాలి.
 -నిర్వహణ: యాసీన్
 
 వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం...
 మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎర్రబారడం (ఇన్‌ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత ఆ ఎరుపూ, మంటా, వాపు వంటివి దానంతట అదే తగ్గడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ర్పభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెల్లడైంది. నిజానికి మనలో ఇన్‌ఫ్లమేషన్ కలిగినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అన్న హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గదు. అంతేకాదు... ఈ థియరీ మరికొన్ని దృష్టాంతాల ద్వారా కూడా  వాస్తవమని తేలింది.
 
  సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి ప్రభావం మన వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూలంగా పడటమే. ఇలా మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే బాధించకుండా క్రమంగా అది శారీరక బాధలైన స్థూలకాయం, గుండెజబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని స్పష్టంగా గుర్తించారు.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్,
 మెడిసిటీ హాస్పిటల్స్,
  సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్
 
 

Advertisement
Advertisement