బుధియా...ఇప్పుడో ‘గుడియా’ | Sakshi
Sakshi News home page

బుధియా...ఇప్పుడో ‘గుడియా’

Published Fri, Mar 28 2014 11:54 PM

బుధియా...ఇప్పుడో ‘గుడియా’

బుధియా సింగ్.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదూ.. అవును.. ఈ పరుగుల బుడతడి గురించి తెలియని క్రీడాభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.! 2005-06లో దేశవ్యాప్తంగానే కాదు... ప్రపంచ వ్యాప్తంగా బాగా మార్మోగిన పేరు బుధియా. నాలుగేళ్లకే 48 సార్లు మారథాన్ (42 కిలోమీటర్ల పరుగు) పూర్తి చేసి అప్పట్లో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రీడా పండితులైతే ఒకడుగు ముందుకేసి అతన్ని భారత అథ్లెటిక్స్‌కు భవిష్యత్ తారగా అభివర్ణించారు.
 
 8 ఏళ్ల తర్వాత.. బుధియా ఇప్పుడో గతం.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. ఒకప్పుడు అతని పరుగును చూసి భేష్ అని మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు అతన్ని చూసి... ప్చ్.. అని జాలిపడిపోతున్నారు. ఇందుకు కారణం.. అప్పటి పరుగుల బుడతడు ఇప్పుడు ఓ బొమ్మ(గుడియా)లా మారిపోయాడు. 
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
 ఇప్పుడు ఎక్కడున్నాడు..?

 2002లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జన్మించిన బుధియా వయస్సు ఇప్పుడు 11 ఏళ్లు. నాలుగేళ్ల వయసులోనే మారథాన్‌లో సంచలనాలు సృష్టించిన బుధియా సింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి  ఎదగాలి.. కానీ ఇప్పుడా కుర్రాడు.. భువనేశ్వర్‌లోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఓ సాధారణ అథ్లెట్ మాత్రమే. అక్కడున్న క్రీడాకారులతో పాటే అతడూ  శిక్షణ పొందుతున్నాడు. అతనికంటూ ఓ స్పెషల్ కోచ్ లేడు. మామూలు గ్రౌండ్‌లోనే పరిగెత్తుతున్నాడు. అలాగని అరకొర సౌకర్యాల మధ్యే బుధియా రోజూ మారథాన్ పూర్తి చేస్తున్నాడనుకుంటే పొరపాటే . ఎందుకంటే అతడు పరుగెత్తేది కేవలం ఒకట్రెండు రౌండ్లే..! ఇప్పుడు బుధియాలో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. చిన్న పిల్లాడిగా ఉన్న సమయంలో కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తిన అతడికి ఇప్పుడు ఆ శక్తి లేదు.. ప్రత్యేక గుణాలు అంతకన్నా లేవు. ఇప్పుడంతా అతన్ని చూసి జాలిపడిపోతున్నారు.. కానీ జాలి పడాల్సింది ఈ వ్యవస్థను చూసి..!
 
 ‘హాస్టల్‌లో బుధియా అందరిలాంటి వాడు.. అతనిలో ఎలాంటి ప్రత్యేక గుణాలు లేవు. ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రమే. నా దృష్టిలో బుధియా మామూలు అథ్లెట్ మాత్రమే. 600 మీటర్ల దూరం పరిగెత్తడానికి కూడా అతడు ఇంకా చిన్నవాడే’.
 - రూపన్‌విటా పాండా, అథ్లెటిక్స్ కోచ్
 
 నాలుగేళ్లకే స్టార్...

 అది 2006... మే నెల... భువనేశ్వర్ నుంచి పూరీ వరకు మండుటెండను సైతం లెక్కచేయకుండా 65 కిలోమీటర్ల దూరాన్ని నాలుగేళ్ల బుధియా కేవలం ఏడు గంటల్లో పూర్తి చేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. టీవీల్లో హల్‌చల్ చేశాడు. కొన్ని ప్రకటనల్లో నటించాడు. బుధియాను అద్భుతమైన అథ్లెట్‌లా తయారు చేసేందుకు మేమున్నామంటూ స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చారు. అలా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
 
తన ప్రమేయం లేకుండానే వివాదాల్లోకి
 
బుధియా ఎంతవేగంగా పైకొచ్చాడో.. అంతే వేగంగా తనకు తెలియకుండానే వివాదాల్లో ఇరుక్కున్నాడు. డబ్బులు అమాంతం వచ్చిపడటంతో అతని తల్లికి, కోచ్ బిరంచిదాస్‌కి మధ్య వివాదాలు తలెత్తాయి. చివరికి తన కొడుకును హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది అతని తల్లి. ఇదే బుధియా పతనానికి నాంది పలికింది. 11 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఇలా పరిగెత్తకూడదంటూ ఉన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన ఒడిశా ప్రభుత్వం... 2007లో బుధియా లాంగ్ డిస్టెన్స్ రన్‌పై నిషేధం విధించింది. అతన్ని స్పోర్ట్స్ హాస్టల్‌కు పంపింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మారథాన్ వైపు బుధియా అడుగులు పడనే లేదు. ఒకప్పుడు గంటల కొద్దీ గ్రౌండ్‌లోనే గడిపిన కుర్రాడు... ఇప్పుడు చదువుకు మాత్రమే పరిమితమయ్యాడు. నిషేధం కారణంగా మైదానంలో గడపలేకపోతున్నాడు.
   
మర్చిపోవాల్సిందేనా..?
 
అంతర్జాతీయ స్థాయిలో మెరికల్లాంటి అథ్లెట్లను తయారు చేసేందుకు చాలా దేశాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు శిక్షణనిస్తారు. చైనాలో అయితే మూడు నుంచి ఆరేళ్ల లోపు వారికే ఆయా క్రీడాంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. చిన్న వయసులోనే శిక్షణ ఇస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నది వారి భావన.. బుధియా లాంటి వాడు చైనాలో పుట్టుంటే ఇప్పటికే  లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా మెరిసే వాడేమో.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. కొద్ది నెలల్లోనే అతనిపై ఉన్న నిషేధం తొలగిపోనుంది. అది ముగిసిన వెంటనే బుధియాను తిరిగి మునుపటిలా లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌ను తయారు చేయవచ్చు. అయితే ఇది సాధ్యమేనా ?
 
నాకు స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉండాలని లేదు... కిలోమీటర్ల కొద్ది పరుగెత్తే అవకాశం లేదు. ఒకప్పుడు గంటలకొద్దీ ఫీల్డ్‌లో ఉండేవాణ్ని. ఇప్పుడు అదే సమయాన్ని చదువుకోవడానికి కేటాయిస్తున్నా.. ఇక్కడ సరైన శిక్షణ లేదు. సరైన పౌష్టికాహారం అందడం లేదు
- బుధియా
 

Advertisement
Advertisement