నువ్వు పుణ్యాత్ముడివి గనుక! | Sakshi
Sakshi News home page

నువ్వు పుణ్యాత్ముడివి గనుక!

Published Fri, Apr 6 2018 12:05 AM

 built his ashram in Dandakaranyam - Sakshi

ఒకనాడు తన పొలంలోపడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతోఅదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణంకోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది.

గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో మునివాటిక సస్యశ్యామలంగా ఉండేది. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. వాగులూ వంకలూ ఎండిపోయాయి. గుక్కెడు నీళ్లు కూడా కరువై జనం అలమటించసాగారు. వర్షాలకోసం వరుణ యాగం చేసినా లాభం లేకపోవడంతో గౌతముడు  సూక్ష్మ శరీరంతో వరుణలోకానికి వెళ్లి, వానలు కురిపించమని ప్రార్థించాడు. వరుణుడు ఆలకించకపోవడంతో గౌతముడు వరుణుడిని తన తపోశక్తితో నీరుగా మార్చి తన ఆశ్రమంలోని పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. ‘నువ్వు పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉన్నాను. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను’ అని చెప్పి వరుణుడు అక్కడే ఉండిపోయాడు. దాంతో లోకమంతా కరువు  తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటోంది. ఒకనాడు తన పొలంలో పడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతో అదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది.

గౌతముడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన  గంగాజలాల స్పర్శతో గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతముడి పాపం తొలగిపోయింది. గంగా ప్రవాహం దక్షిణాపథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని, గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి. గౌతముడి పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించినప్పుడేగా లోకకల్యాణం!  

Advertisement

తప్పక చదవండి

Advertisement