ఎడ్ల చలోరే... | Sakshi
Sakshi News home page

ఎడ్ల చలోరే...

Published Wed, Jan 21 2015 11:22 PM

ఎడ్ల చలోరే...

ఆధునిక రవాణా వ్యవస్థ వాయువేగంతో దూసుకుపోతుంటే.. ఆదివాసీలు మాత్రం తమ సంప్రదాయ రవాణా వ్యవస్థను వీడటం లేదు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ ఫాస్టు రైళ్లు, వోల్వో బస్సులు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చినా.. అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఈ గిరిజనుల మాత్రం ఆ సదుపాయాల దరికి చేరడం లేదు! ఇప్పటికీ వారు సుదూర ప్రయాణాలకు ఎడ్లబండ్లనే ఎంచుకుంటున్నారంటే నమ్మి తీరాల్సిందే. అలా వందల కిలో మీటర్లు దూరంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కుటుంబాలతో కలిసి బండ్లపై వచ్చిన ఆదివాసీలతో గత నాలుగు రోజులగా నాగోబా సన్నిధిలో ‘జాతర’ జరిగింది. అలా వచ్చిన వారిలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పాండ్రవణికి చెందిన మేస్రం జాగేరావు, దుర్పతబాయిలు కూడా ఉన్నారు. వారు  తమ కొడుకు, కోడలు మనువళ్లు, మనువరాండ్లతో సకుటుంబ సమేతంగా జాతరకు వచ్చారు.

ఆ కుటుంబం ఈనెల 14న తమ స్వగ్రామం నుంచి ఎడ్లబండ్లపై బయలుదేరింది. ఐదు రోజుల పాటు అటవీ మార్గం గుండా వీరి ప్రయాణం సాగింది. ఈనెల 18న రాత్రి నాగోబా కొలువై ఉన్న కేస్లాపూర్‌కు చేరుకుంది. సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం ఎడ్లబండ్లపైనే సాగింది. వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలు సంస్కృతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారనడానికి ఇదే నిదర్శనం. ‘‘నాగోబా జాతరతున్ కోంద, కసూర్‌తో వయివాల్ మా ఆచార.. ఇద్ సల్‌దున్ గేర్ మావ ఆచారం పకరం వాతోమ్.. కోంద, కసూర్‌తే వాతేకే మాకున్ చోకోట్ కరేమాంత్’’ (నాగోబా జాతరకు ఎడ్లబండ్లపై రావడం మా ఆచారం.. ఈసారీ మా ఆచారాన్ని కొనసాగించాము. ఈ ఎడ్ల బండ్లపై జాతరకు రావడం సంతోషంగా ఉంటుంది) అంటున్నారు మేస్రం జాగేరావు తమ గోండి బాషాలో. ఈనెల 22న జాతర ముగిసిన అనంతరం వీరంతా ఇక్కడి నుంచి తిరిగి తమ గూడేనికి బయలుదేరి వెళతారు.
 - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
 
 

Advertisement
Advertisement