జ్వాలాముఖి ఆలయం | Sakshi
Sakshi News home page

జ్వాలాముఖి ఆలయం

Published Tue, Apr 5 2016 11:07 PM

జ్వాలాముఖి ఆలయం

సందర్శనీయం


హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జ్వాలాముఖిలో వెలసిన జ్వాలాముఖి ఆలయం అత్యంత అరుదైన శక్తిపీఠం. సతీదేవి నాలుక ఇక్కడ పడటంతో ఈ శక్తిపీఠం వెలిసినట్లు చెబుతారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలో అమ్మవారు జ్వాలారూపంలో దర్శనమిస్తుంది. సహజసిద్ధమైన కొండగుహలో వెలసిన ఈ ఆలయంలో తొమ్మిది జ్వాలలు నిరంతరం వెలుగుతూ కనిపిస్తాయి. వీటిని నవదుర్గలుగా భావించి పూజిస్తారు. ఈ జ్వాలలను సతీదేవి జిహ్వకు ప్రతీకగా కూడా భావిస్తారు. మహాభారతం సహా పలు పురాణేతిహాసాలలో జ్వాలాముఖి క్షేత్ర ప్రస్తావన ఉంది. ఈ ఆలయం ఎప్పటిదనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేకున్నా, ఇది కనీసం వెయ్యేళ్లకు పైబడినదేనని చెబుతారు.


అఫ్ఘాన్ యుద్ధంలో గెలుపొందిన తర్వాత పంజాబ్ పాలకుడు 1809లో ఈ ఆలయాన్ని దర్శించుకున్న రాజా రంజిత్‌సింగ్ ఆలయ ద్వారానికి వెండితాపడంతో తలుపులు చేయించడంతో పాటు పలు కానుకలు చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. శాక్తేయ సంప్రదాయాల ప్రకారం ఈ ఆలయంలో దాదాపు రోజంతా పూజలు జరుగుతూనే ఉంటాయి. జ్వాలాముఖి పట్టణానికి చుట్టుపక్కల బ్రిజేశ్వరి ఆలయం, చాముండీ ఆలయం, నైనాదేవి ఆలయం వంటి పలు పురాతన ఆలయాలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement