వాసక్టమీ రివర్స్ చేయవచ్చా... | Sakshi
Sakshi News home page

వాసక్టమీ రివర్స్ చేయవచ్చా...

Published Mon, Dec 14 2015 12:56 AM

Can vasaktami reverse ..

హోమియో కౌన్సెలింగ్
 

మా తాతగారికి 75 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా పైల్స్‌తో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆపరేషన్ తప్పదన్నారు. దీనికి హోమియోలో ఏమైనా మంచి మందులుంటే చెప్పగలరు.
 - పి. అరవింద్, హైదరాబాద్

 మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపునకు గురై, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలగడాన్ని పైల్స్ అంటారు.
 
కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం, దీర్ఘకాలంగా దగ్గు, గర్భధారణ సమయంలో, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికం. మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడి, దాంతో తీవ్రమైన నొప్పి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.

పైల్స్‌లో రకాలు: పైల్స్‌ని ముఖ్యంగా ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలుగా విభజించవచ్చు.
 
ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వాపునకు గురవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు.
 
ఎక్స్‌టర్నల్ పైల్స్: మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై, వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటకు పొడుచుకుని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు. ఇందులో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. ఇవిగాక ఫిషర్స్, ఫిస్టులా అనేవి కూడా వస్తుంటాయి. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అంటారు. ఇది చాలా నొప్పి, మంటలో కూడి ఉంటుంది.

రెండు ఎపితీకల్ కణజాలాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది  ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడేది యానల్ ఫిస్టులానే. ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఫిస్టులా ఒక్కోసారి మలద్వారంలోకి తెరుచుకోవడం వల్ల ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ ఆనో అంటారు.
 
హోమియో చికిత్స:
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లోని జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్ధకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా ఈ సమస్యలు మళ్లీ తిరగపెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం చేయవచ్చు. మీరు మీ తాతగారిని మంచి హోమియో వైద్యునికి చూపించండి.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
 
మా అన్నయ్య వయసు 46 ఏళ్లు. ఆయనకు రెండు కిడ్నీలూ చెడిపోయాయి. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే కిడ్నీ మార్పిడి చేయడానికి నా బ్లడ్‌గ్రూపు సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నా వయసు 41 ఏళ్లు. నేను మా అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడం వల్ల నాకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? నేను కిడ్నీ ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో నాకు ఉన్న ఒక్క కిడ్నీ చెడిపోతే నేనుకూడా వేరేవారి కిడ్నీని మార్పిడి చేసుకోవాల్సి వస్తుందా? ఒక కిడ్నీ ఉన్నవారికి ఏమైనా సమస్యలు వస్తాయా? కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి నాకు వివరంగా తెలుపగలరు. మీరు చెప్పే సమాధానంపైనే కిడ్నీ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయం తీసుకుంటాను.
 - బాల్‌రాజ్, ఖమ్మం
 ప్రతి మనిషిలోనూ రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి మన రక్తంలోని మలినాలను శుద్ధి చేస్తూ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తుంటాయి. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఒక కిడ్నీ కూడా సరిపోతుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయ వ్యాధులైన హెపటైటిస్-బి, సి ఉండకూడదు. ఒక కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం రాదని నిర్ధారణ చేసిన తర్వాతనే వైద్యులు కిడ్నీ తీసుకొని, రోగికి కిడ్నీ మార్పిడి చేస్తారు. దాత ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు కిడ్నీ ఇచ్చేందుకు అర్హులో, కాదో నిర్ణయిస్తారు. మీరు కిడ్నీ ఇవ్వవచ్చని నిపుణులు నిర్ధారణ చేస్తే, మీరు నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు. దీనివల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. మీ అన్నయ్యకు రెండు కిడ్నీలూ చెడిపోయాయనీ, డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారనీ తెలిపారు. కాబట్టి మీరు కిడ్నీ ఇవ్వడం ద్వారా మీ అన్నయ్యకు కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారు. మీ అన్నయ్యకు ఇక జీవితంలో మళ్లీ డయాలసిస్ అవసరం ఉండదు. మందుల వాడకం కూడా చాలావరకు తగ్గిపోతుంది. అందరిలాగే మీ అన్నయ్య కూడా సాధారణ జీవితం గడపగలుగుతారు. మీరు నిర్భయంగా ఉండండి.
 
డాక్టర్ శశికిరణ్
సీనియర్ నెఫ్రాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాను. ఒక బాబు పుట్టిన తర్వాత పదేళ్ల కిందట వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాను. ఇంకో బిడ్డ ఉంటే బాగుండు అని నా భార్య అంటోంది. నేను మళ్లీ బిడ్డలు కనడానికి వీలుగా వాసెక్టమీ రివర్స్ చేసుకునే అవకాశం ఉందా?
 - సూర్యనారాయణ, కొత్తవలస

 వాసెక్టమీ అయిన వారు మీలా మళ్లీ సంతానాన్ని కోరుకుంటే, వారికోసం వాసెక్టమీ రివర్స్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంది. కానీ... మీ భార్యకు గర్భం వచ్చే అవకాశాలు కేవలం వాసెక్టమీ రివర్సల్ మీదనే గాక... చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆమె ప్రస్తుత వయసు లాంటివి. కాబట్టి మీరు వాసెక్టమీ రివర్సల్‌కు ముందుగా ఆమెలోని చాలా అంశాలను అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే వాసెక్టమీ రివర్సల్‌కు బదులు మరికొన్ని ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. అందులో ఒకటి వృషణాల నుంచి గానీ... ఎపీడెడైమిస్ అనే భాగం నుంచి గానీ... మీ శుక్రకణాలను సేకరించి, ఆమె అండంతో ఫలదీకరణం చేయించే ఐసీఎస్‌ఐ (ఇంట్రా సైటోప్లాజమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే పక్రియ సంతాన సాఫల్య ప్రక్రియల్లో ఒకటి. అయితే ఇలాంటి ప్రక్రియలు అనుసరించడం అన్నది మీ ఇద్దరి ఎంపిక మీద, ఇప్పుడు ఎంత మంది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం మీద, ఆర్థికంగా ఇందుకు అయ్యే ఖర్చును భరించగలిగే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పేర్కొంటున్న వాసెక్టమీ రివర్సల్ అన్న అంశానికి వస్తే... అది మైక్రోసర్జికల్ టెక్నిక్స్ ద్వారా అత్యంత నాజూగ్గా చేసినప్పుడే సత్ఫలితాలు ఇస్తుంది.

మైక్రోసర్జరీ సమయంలో మీ వీర్యాన్ని సేకరించి, దాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టేలా చేసి (ఫ్రోజెన్ కండిషన్‌లో) భద్రపరుస్తారు. ఒకవేళ వాసెక్టమీ ప్రక్రియ విఫలం అయితే ఇలా భద్రపరచిన వీర్యాన్ని ఐసీఎస్‌ఐ ప్రక్రియకు ఉపయోగిస్తారు. ఇక వాసెక్టమీ తర్వాత రివర్సల్ ఎంతగా ఆలస్యం అవుతుంటే దాని సత్ఫలితం ఇచ్చే అవకాశాలు అంతగా తగ్గుతుంటాయి. వాసెక్టమీ రివర్సల్ తర్వాత  కొన్ని నెలల పాటు వీర్యంలోకి శుక్రకణాలు వస్తున్నాయా లేదా అనేది చూడాలి. శుక్రకణాలను వీర్యరాశిలోకి తెచ్చే నాళాలు మళ్లీ మూసుకుపోవచ్చు. కాబట్టి అది జరుగుతుందేమో అని పరీక్షిస్తూ ఉండాలి. చాలామందిలో ఈ రివర్సల్ సర్జరీ జరిగిన 24 నెలల్లో భాగస్వామికి నెలతప్పుతుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్‌ను  సంప్రదించండి.
 
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్,
రోడ్ నెం. 1, బంజారాహిల్స్,
హైదరాబాద్
 

Advertisement
Advertisement