గర్భసంచి సమస్యలకు రోబోటిక్ ప్రక్రియ మేలు | Sakshi
Sakshi News home page

గర్భసంచి సమస్యలకు రోబోటిక్ ప్రక్రియ మేలు

Published Sat, Oct 1 2016 12:24 AM

Cancer counseling

క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 54 ఏళ్లు. బాగా లావుగా ఉంటాను. ఇటీవల మెనోపాజ్ వచ్చింది. రుతుస్రావం ఆగిపోయి దాదాపు ఐదేళ్లు అవుతోంది. కానీ గత మూడు నెలల నుంచి అప్పుడప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది. ఆ సమయంలో నొప్పిలు నన్ను విపరీతంగా బాధిస్తున్నాయి. చాలా మంది వైద్యులను సంప్రదించాను. ఒక డాక్టర్ కొన్ని టెస్ట్‌లు నిర్వహించి గర్భసంచి తీసివేస్తే గానీ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. దీంతో మా కుటుంబ సభ్యులంతా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.  - ఒక సోదరి, నిర్మల్

 
మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా సురక్షితం కాని లైంగిక సంబంధాలతో పాటు జన్యుపరమైన కారణా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో టీబీకి గురైనవారిలో కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు వెంటనే నిపుణులైన సర్జికల్ ఆంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండే పెద్ద ఆసుపత్రికి వెళ్లి సంప్రదించండి. వారు మీకు ముందుగా అల్ట్రా సౌండ్ లాంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో మీరు గర్భాశయ క్యాన్సర్‌కు లోనైనట్లు తెలిసినా ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే చికిత్సకు సంబంధించి అత్యంత అధునాతనమైన విధానాలు, నిపుణులైన వైద్యులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. క్యాన్సర్ ఏ గ్రేడింగ్‌లో ఉందో తెలుసుకోడానికి అలాగే ఆ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు ఏమైనా పాకిందా కనుగొనడానికి సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి అడ్వాన్స్‌డ్ పరీక్షలూ చేస్తారు. ఒకవేళ మొదటి లేదా రెండో దశలో ఉంటే మీకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ గర్భసంచిని తొలగించడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు చింతించాల్సిన పనేమీ లేదు. దాన్ని తొలగించిన తర్వాత మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. అలాకాకుండా మూడు లేదా నాలుగో స్టేజ్‌లో ఉంటే గర్భసంచి తొలగించడంతో పాటు క్యాన్సర్ కణాలను పూర్తిగా నిర్మూలించడానికి రేడియో థెరపీ, కీమోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది.

వీటన్నింటికీ ఇప్పుడు అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధానంలో 3డి కెమెరా సహాయంతో శరీరంలోని కీలకమైన అవయవాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం ప్రభావితమైన కణజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టేయవచ్చు.
- డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్ సెన్సైస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

Advertisement
Advertisement