ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే..? | Sakshi
Sakshi News home page

ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే..?

Published Tue, Jun 23 2015 10:40 PM

ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే..? - Sakshi

కార్డియాలజీ కౌన్సెలింగ్
ఇటీవల నేను గుండె పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు నా ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సెంటేజీ తక్కువగా ఉందని డాక్టర్లు ఉన్నారు. కానీ నాలో ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించడం లేదు. నేను చికిత్స తీసుకోవాలా? నాకు వివరంగా చెప్పండి.
- కె. రాంబాబు, హైదరాబాద్
 
మన గుండె నిమిషానికి డెబ్బయిరెండు సార్లు కొట్టుకుంటుంది. కొట్టుకునే ప్రతిసారీ ఈ సంకోచ వ్యాకోచాల వల్ల మన రక్తనాళాల ద్వారా ప్రతి అవయవానికి రక్తసరఫరా  జరుగుతూ ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాల వల్ల గుండె రక్తసరఫరా చేయగలిగే  సామర్థ్యానికి ఒక రకం కొలమానమే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ (ఈఎఫ్). ఒక వ్యాకోచ సమయంలో గుండెకు అందిన రక్తంలో ఎంత మొత్తాన్ని తన సంకోచ సమయంలో పంపుతుందో ఆ మొత్తాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని శాతంలో చెబుతారు. వైద్య చికిత్సలో ఈఎఫ్‌ను తెలుసుకోవడం అన్నది చాలా ప్రాధాన్య అంశమే అయినా  కొన్ని సందర్భాల్లో ఈఎఫ్ తెలుసుకోవడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక ఈఎఫ్ తక్కువగా ఉన్న ప్రతివారిలోనూ హార్ట్ ఫెయిల్యూర్ రావాలన్న నియమం లేదు. అయితే ఈఎఫ్ తక్కువగా ఉండి, వారిలో పాదాల వాపు, ఆయాసం, ముఖం ఉబ్బడం, మెడనరాలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న దానికి సూచనగా భావించాల్సి ఉంటుంది.
 
హార్ట్‌ఫెయిల్యూర్ అనేది సంకోచ లోపం లేదా వ్యాకోచ లోపం... ఈ రెండింటిలో దేనివల్లనైనా రావచ్చు. ఒకవేళ ఈఎఫ్ తక్కువగా ఉన్నట్లయితే అది సంకోచలోపం వల్ల వచ్చినట్లుగా భావించాలి. అదే వ్యాకోచలోపం వల్ల హార్ట్‌ఫెయిల్యూర్ వస్తే ఈఎఫ్ శాతం నార్మల్‌గా ఉండవచ్చు.
 
ఈఎఫ్ శాతానికీ, లక్షణాలకూ కొన్నిసార్లు సంబంధం ఉండకపోవచ్చు. తక్కువ ఈఎఫ్ ఉండి కూడా ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. లేదా లక్షణాలు ఉండీ ఈఎఫ్ మరీ అంత తక్కువగా ఉండకపోవచ్చు. కానీ ఈఎఫ్‌కూ మనిషి ఆయు ప్రమాణానికే  చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఈఎఫ్ తక్కువగా ఉండి, హార్ట్‌ఫెయిల్యూర్ ఉందని తెలిశాక మందులు వాడుతున్నా కూడా ఒక్కోసారి ప్రాణహాని కలగవచ్చు. అయితే ఈఎఫ్ తక్కువగా ఉన్నప్పుడు గుండె సామర్థ్యం పెంచడానికి చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఈఎఫ్ తగ్గుతుంటే చేయాల్సిన చికిత్స...
ఈఎఫ్ విలువ తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే దగ్గరలోని హృద్రోగ నిపుణుడిని వీలైనంత త్వరగా సంప్రదించాలి ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త మందులతో ఈ కండిషన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఏసీఈ ఇన్హిబిటార్స్ అనే మందులు ఉపయోగించవచ్చు  ఈఎఫ్ విలువ తక్కువ అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, హృద్రోగ నిపుణులతో ఫాలోఅప్‌లో ఉంటే దీర్ఘకాలం జీవించవచ్చు.
 
డాక్టర్ వి. రఘు
కార్డియాలజిస్ట్,
ప్రైమ్  హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement
Advertisement