సెల్‌తో కొడితే సెల్‌లోకే! | Sakshi
Sakshi News home page

సెల్‌తో కొడితే సెల్‌లోకే!

Published Sun, Jun 14 2015 11:59 PM

సెల్‌తో కొడితే సెల్‌లోకే! - Sakshi

స్టూబెన్‌విల్లే ఒహాయో అమెరికా! ఆగస్టు 12, 2012. ఎప్పటిలానే ఆ రోజూ తెల్లవారింది. చాలామంది ఇంకా ముసుగుతన్ని పడుకునే ఉన్నారు. ఇంతలో... పోలీసు సైరన్ మోతలు మొదలయ్యాయి.. చిన్న ఊరిలో ఉన్నట్టుండి కలకలం. ఓ ఇంట్లో 16 ఏళ్ల అమ్మాయి ఒళ్లు తెలియని స్థితిలో నగ్నంగా పడి ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి!

క్రితం రోజు జరిగిన పార్టీల్లో ఆ అమ్మాయిని మలిక్ రిచ్‌మండ్, ట్రెంట్ మే అనే ఇద్దరు ఆటగాళ్లు రేప్ చేశారని... వార్తలు! అంతా ఆ అమ్మాయి ఇష్టంతోనే జరిగిందని, అంతకుమించి తమకేమీ తెలియదన్న నిందితులు! అయితే... రోజులు గడుస్తున్న కొద్దీ వీరిద్దరి బండారం బట్టబయలైంది! ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తయింది... నిందితులకు శిక్ష కూడా పడింది!
         
బరేలీ, ఉత్తరప్రదేశ్, భారత్! మార్చి 5 2014.
11 ఏళ్ల పరమిందర్ సింగ్ ఉదయం ఏడు గంటలకే
సైకిలెక్కి ఇంటి నుంచి బయటపడ్డాడు! గంటలు గడుస్తున్నా... అతడి ఐపు అజా లేనేలేదు. కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్ని గంటలు గడిచాయో లేదో... ఆ కుర్రాడు నిక్షేపంగా ఇంటికి చేరాడు!
         
ఫేస్‌బుక్.. ట్విట్టర్... వాట్సప్! ఇవి... ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటి, గర్ల్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లు, న్యూస్ అండ్ వ్యూస్ తెలుసుకునేందుకు మాత్రమేనా? ఊహూ టెక్నాలజీ మాదిరిగానే ట్రెండ్ కూడా మారిపోతోంది! ఇన్వెస్టిగేషన్‌తోపాటు నేరాల నివారణకూ  భలే ఉపయోగపడుతున్నాయి ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు! స్టూబెన్ విల్లే రేప్ కేసుతోపాటు బరేలీ కుర్రాడి మిస్సింగ్ కేసు సాల్వ్ అయింది వీటిద్వారానే. ఒహాయో రాష్ట్రంలోని చిన్న ఊరిలో జరిగిన రేప్ కేసులో నిందితులు తమకేం తెలియదని బుకాయించినప్పటికీ... వారు ఆ రోజు చేసిన ట్వీట్లు... యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలను విశ్లేషించిన పోలీసులు వాటినే ఆధారాలుగా చూపుతూ నిందితులకు శిక్ష పడేలా చేయగలిగారు. బరేలీ పోలీసులు పరమిందర్ సింగ్ ఫొటో, ఇతర వివరాలను వాట్సప్ ద్వారా నగరంలోని అన్ని మొబైల్ ఫోన్లకు చేరవేయడం... డూన్ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దాన్ని అందుకుని తన ఎదురుగా కూర్చున్నది ఆ కుర్రాడే అని గుర్తించడం గంటల్లో జరిగిపోయింది.

అదీ సోషల్ మీడియా శక్తి!
 సోషల్ మీడియా కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని చాలామంది అంటూ ఉంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఈ మాధ్యమం నేర విచారణలోనూ, నియంత్రణలోనూ పోలీసులకూ ఉపయోగపడుతోంది. పైన చెప్పినవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. అనవసరమైన పుకార్లు పుట్టించి కలకలం లేవనెత్తే అసాంఘిక శక్తులు మొదలుకొని కిడ్నాప్, రేప్ చోరీ వరకూ అనేక కేసులను పోలీసులు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌ల ద్వారా పరిష్కరించిన సందర్భాలున్నాయి.

రహస్యమనేది లేదు...
ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మనం చేసే కామెంట్లు ఇతరులకు... ముఖ్యంగా పోలీసులకు తెలియకుండా ఉంటాయనుకోవడం పొరబాటు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సోషల్ మీడియా సైట్లపై నిరంతర నిఘా ఉంటోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైని ఉదాహరణగా తీసుకుందాం... అక్కడ కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియా ల్యాబ్ ఏర్పాటైంది. నాస్కామ్, ఓ ప్రైవేట్ కంపెనీల సాయంతో ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 20 మంది పోలీస్ అధికారులు పనిచేస్తూంటారు. సోషల్‌మీడియా సైట్లను జల్లెడ పట్టడం... అనుమానాస్పదమైన కామెంట్లు, ఫొటోలు, వీడియోలను గమనించడం... వాటి వివరాలను ముంబై సైబర్ సెల్‌కు అందించడం ఇదీ ఈ సోషల్‌మీడియా ల్యాబ్ చేసే పని. యువతరం చర్చించుకునే అంశాల ఆధారంగా ఏవైనా గొడవలు జరిగే అవకాశముందా? అన్నది అంచనావేస్తూ ముందస్తు చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

చెప్పుకుంటే... చిక్కినట్టే...
నేరాలకు పాల్పడేవారు ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటివాటిని వాడటం పోలీసులకు వరంగా మారుతోంది. స్టూబెన్ విల్లే రేప్ కేసులోనూ జరిగింది ఇదే. నిందితులు తాము రేప్ చేయలేదన్నప్పటికీ... లభించిన ఫొటోల ద్వారా అసలు నేరం జరిగిందా? లేదా? అన్నది స్పష్టం కానప్పటికీ... నిందితులు ట్విట్టర్ సందేశాలు వారిని పట్టిచ్చాయి. అలెగ్జాండ్రా గొడార్డ్ అనే క్రైమ్ బ్లాగర్ (్కటజీజ్ఛీజజ్ఛీఛీ.ఛిౌఝ) నిందితుల పోస్ట్‌లన్నింటినీ జల్లెడపట్టి అసలు జరిగిందేమిటో స్పష్టం చేయడంతో నిందితులకు శిక్ష ఖరారైంది.

ఫిర్యాదులు చేసేందుకు....
కళ్లముందు నేరం జరుగుతున్నా స్పందించేందుకు చాలామంది వెనకాడుతూంటారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా నామోషీనే. ఇటువంటివారికి ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు అక్కరకొస్తున్నాయి.
- గిళియార్
 
ఇట్టే దొరికిపోయారు!
జేబులు కత్తిరించేవాళ్లు, బంగారు గొలుసుల దొంగల ఫొటోలను ముంబై సెంట్రల్ రైల్వే పోలీసులు వాట్సప్ ద్వారా టికెట్ కలెక్టర్లకు పంపుతున్నారు. ఫలితంగా ఈ తరహా నేరాలు గణనీయంగా తగ్గినట్లు అంచనా.
కిడ్నాప్‌నకు పాల్పడిన వెంటనే ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఓ నేరస్తుడు అడ్డంగా దొరికిపోయాడు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు అతడు ఉపయోగించిన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయడం ద్వారా పోలీసులు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేయగలిగారు.
రెండు నెలల క్రితం ఢిల్లీలో మూడేళ్ల బాలికను కొందరు కిడ్నాప్ చేయగా... బాలిక తల్లిదండ్రులు, బంధువులు సోషల్ మీడియాలో అమ్మాయి ఆచూకీ కోసం పోస్ట్‌లు పెట్టారు. దీంతో బెదిరిపోయిన కిడ్నాపర్లు ఆ బాలికను వారం రోజుల తరువాత వదిలి వెళ్లిపోయారు.
హైదరాబాద్ జూలో చిరుతపులితో ఫొటోలు దిగిన యువకుడు వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ద్వారా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టాల్సిందిగా ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభిస్తోంది. ఏటా కొన్ని వేల మందిని ట్రాఫిక్ అఫెండర్స్‌ను ఈ విధంగా పట్టుకుని జరిమానా విధిస్తున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో టీసీఎస్ ఉద్యోగిని ఉమా మహేశ్వరి చెన్నైలో హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుల అరెస్ట్‌కు సహకరించింది. వాట్సప్ ద్వారా పోలీస్ ఇన్ఫార్మర్లు పంపిన ఫొటోలే.

 

Advertisement
Advertisement