అజ్ఞానాన్ని పటాపంచలు చేసేవాడే గురువు! | Sakshi
Sakshi News home page

అజ్ఞానాన్ని పటాపంచలు చేసేవాడే గురువు!

Published Sat, Jun 10 2017 11:03 PM

అజ్ఞానాన్ని పటాపంచలు చేసేవాడే గురువు! - Sakshi

అజ్ఞానమనే చీకటి ఎక్కడ ఉంటుందో, అక్కడ గురువు అవసరం ఉంటుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలోనే వస్తాడు. అందుకే శివ కేశవులిద్దరూ కటిక చీకట్లోనే వచ్చారు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన శ్రావణమాసం నుండి ఆరు నెలల తరువాత మాఘబహుళ  చతుర్దశినాడు మహాశివరాత్రి అర్ధరాత్రివేళ ఆవిర్భవించింది లింగం. అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం. శివుడు దీపం. శివుడు జ్యోతిర్లింగమై కటికచీకట్లో అర్ధరాత్రివేళ తుదిమొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయిన ఓ పెద్దజ్యోతి స్వరూపంగా ప్రకాశించాడు. దాన్ని నమ్మితే ఆరాధన చేస్తే అది అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞానమనే వెలుతురునిస్తుంది. అప్పుడు సమస్త భయాలు తొలగిపోతాయి. ఆత్మ అనేది ఎరుకలోకి వస్తుంది. అంటే గురువు ద్వారా భగవానుడు భక్తుడికి పరిచయమవుతాడు.

నేను ఒక దీనుడి వంక చూశాను. నాలో పొంగిన ప్రేమ భావనను కారుణ్యమంటారు. పెద్దల్ని ప్రేమతో చూసాను. ఆ భావనకు గౌరవమని పేరు. నా తల్లిదండ్రులను చూశాను. అప్పుడు నాలో ఉద్భవించిన ప్రేమ వారిపట్ల నాకున్న భక్తికి గుర్తు. మరి అలా భగవంతుడి పట్ల భక్తి కలగడానికి భగవంతుడిని చూసిన వాడెవడు! అందుకే గురువు భగవంతుడిని పరిచయం చేయడానికి అనేక మార్గాలను ఎంచుకుంటాడు.
 నేను దారిన పోతున్నప్పుడు ఒక అద్భుతమైన భవంతి కనబడింది. ‘ఎంత బాగుంది, ఎవరిదండీ ఇది?’ అని అడుగుతాను. ఒక వస్తువును చూస్తే దాని యజమాని ఎవరని అడుగుతాం. ఇంటి పెరట్లో ఒక చేమంతి పువ్వు పూసింది. దాని సన్నటి తొడిమ మీద గుండ్రని దిండుమీద ఆకుపచ్చ పత్రగుచ్ఛంమీద ఇన్ని పసుపుపచ్చటి రేకులు అందంగా పేర్చి వాటిలోంచి ఆ సౌరభం వెదజల్లేటట్లు చేసిన మహాశిల్పి ఎవరు? నేను చిన్నప్పట్నించీ ఎన్నో గీతలు గీశా. అన్నీ చెరిగిపోయాయి.

ఎవరో నా చేతిలో గీసిన గీతలు ఎన్నిసార్లు  కడిగినా చెరిగిపోలేదు. ఎవరాయన? ఇప్పుడు విశ్వాన్ని బట్టి విశ్వనాథుణ్ణి వెతుకుతాను. విశ్వమున్నది. కంటిముందు కనబడుతున్నది. దీన్ని నిర్మించినవాడు ఒకడు ఉండి ఉండాలి. వాడెవరు... అన్న ఆర్తి ప్రబలితే అప్పుడు ఎరుకపరిచేది గురువే. అందుకే జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవడో ఆయనే గురువు. అంధకారాన్ని పోగొడుతున్న వాడెవడో, అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చెయ్యగలిగిన వాడెవడో ఆయనే గురువు. గురువు ఒక్కొక్కసారి బోధచేస్తాడు. మరొకసారి ప్రశ్న వేస్తాడు. ఒక్క ప్రశ్న చాలు. శంకరభగవత్పాదులు ఒకానొకప్పుడు మోహముద్గరలో శ్లోకరూపంలో ఒక ప్రశ్నవేస్తాడు. అసలు నేనెవరనే ఆలోచన తెచ్చుకోవడానికి, భగవంతునితో అనుసంధానం పొందడానికి ఆ ఒక్క శ్లోకం చాలు.

Advertisement
Advertisement