వెచ్చటి చలి | Sakshi
Sakshi News home page

వెచ్చటి చలి

Published Wed, Oct 26 2016 10:26 PM

వెచ్చటి   చలి

పిల్లలు చలిని తట్టుకోలేరు.
పసి పిల్లలు మరీనూ.
వాళ్లకు ఏమేమి కష్టాలు వస్తాయో  వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో సాక్షి వివరిస్తోంది.
దాంతో పాటు ఒక చిన్న రిక్వెస్ట్.
మీ పిల్లలకు చలికాలం మీ వెచ్చటి ప్రేమ అందించండి.
వెచ్చవెచ్చగా చలికాలాన్ని దాటేయండి.

 

చలికాలం వచ్చిందంటే చాలు... పిల్లల మాట ఎలా ఉన్నా వాళ్ల తల్లిదండ్రులకు  ఆందోళన ఎక్కువ. అందునా సహజంగానే పిల్లల చర్మం అంటే ఎంతో సున్నితం. మొదట పొడిబారుతుంది. ఆ తర్వాత పగుళ్లు.  ఒక్కోసారి మడమలు చిట్లిపోయి కాళ్లు కింద పెట్టలేరు. ఇలా చర్మం పగలడాన్ని వైద్య పరిభాషలో అటోపిక్ డర్మటైటిస్ అని అంటారు.  ఈ సీజన్‌లో నెల బాలలు  మొదలుకొని దాదాపు కౌమారం వచ్చే వరకు అంటే... 14 ఏళ్ల లోపు పిల్లల్లో వచ్చే చర్మ సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలు తెలుసుకుందాం.

 
అటోపిక్ డర్మటైటిస్ అంటే... పిల్లల్లో తరచూ కనిపించే ఒక సాధారణ సమస్య. కొందరిలో అప్పటికప్పుడు కనిపించే ఈ సమస్య... మరికొందరిలో ఒక దీర్ఘవ్యాధిగా కూడా పరిణమిస్తుంటుంది. తొలుత చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురదతో బాధిస్తుంటుంది. దాంతో పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం  మందంగా మారుతుంది. ఇలా మందంగా మారడాన్ని ‘లెకైనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద మరింతగా పెరుగుతుంది. మరింతగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం ఇంకా మందం అవుతుంది. ఇది ఒకదాని తర్వాత మరొకటిగా ఒక సైకిల్‌లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) నడుస్తుంటుంది.

 
లక్షణాలు:
చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటి గుల్లలు కూడా ఏర్పడతాయి.

ఎర్రబారిన ప్రాంతంలో చర్మం పొట్టుకట్టినట్లుగా అవుతుంది. ఆ తర్వాత చర్మం మందంగా (లెకైనిఫికేషన్) మారుతుంది.

ఆ స్కిన్‌పైన ఏదో ఒక చోట పొట్టులేచినట్లుగా అయి, అక్కడ గాటు కూడా పడవచ్చు.

తెట్టుకట్టినట్లుగా ఉన్న చర్మం పైపొర లేచిపోయినప్పుడు ఆ ప్రాంతంలో కాస్త ద్రవం ఊరుతున్నట్లుగా (ఊజింగ్) కనిపిస్తుంటుంది. ఈ దశలోనూ చికిత్స అందించకపోతే పిల్లల్లో లింఫ్‌నోడ్స్ వాచడం వంటి లక్షణాలు సైతం కనిపించవచ్చు.

 
ఎందుకిలా జరుగుతుంది?
మన చర్మంలోని సాగే గుణాన్ని నిలిపి ఉంచడంలో చర్మం పొరల్లోని తేమ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బయటి వాతావరణంలో ఉన్న పొడిదనం కారణంగా ఈ సీజన్‌లో చర్మంలోని చెమ్మ క్రమంగా ఇగిరిపోతుంది. దాంతో చర్మం పొడిబారి ఎర్రబారుతుంది. (ఒక్కోసారి ఇది ‘ఇక్థియోసిస్ వల్గారిస్’, ‘కెరటోసిస్ పైలారిస్’ వంటి ఇతర చర్మ వ్యాధులతో కలిసి కూడా రావచ్చు.) ఆ తర్వాత మనం అలాగే నిర్లక్ష్యం చేస్తే ఇది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.

 

మొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్)
అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు మొదటి దశలో చాలా తేలిగ్గా చికిత్స చేయవచ్చు. ఆ చికిత్స అందించే క్రమంలో వారి చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్  రావడం వంటివి చేస్తే చాలు... పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం, రుద్దుకోవడం తగ్గి రాత్రి బాగా నిద్రపడుతుంది. 

 
అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం
ఈ పిల్లలకు వాడే సబ్బులు, డిటర్జెంట్లు... అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్న అంశాలను గమనించి అలాంటి సందర్భాల్లో వాటికి ప్రత్యామ్నాయంగా వేరే సబ్బులను, డిటర్జెంట్లను మార్చాల్సి ఉంటుంది. ఘాటైన సబ్బులకు బదులు చాలా మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్‌లో తడిగుడ్డను ముంచి ఒంటిని శుభ్రం చేయడం మంచిది. డర్మటైటిస్ ఉన్న పిల్లల్ని పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉంచాలి. అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి, మార్పు చేయాలి.

 
పూత మందులతో చికిత్స
ఇలాంటి పిల్లలకు ఒళ్లు పొడిబారినప్పుడు లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్, స్క్వాలీన్ వంటివి  (ఈ పూత మందులను ‘ఎమోలియెంట్స్’అంటారు)  పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు  స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయడం చాలా ముఖ్యమని గుర్తించండి.

     
తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా లభ్యమయ్యే స్టెరాయిడ్స్ (టాపికల్ స్టెరాయిడ్స్) కూడా పూయవచ్చు. ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ అవసరం పడకుండా ఉండటానికి టాపికల్ క్యాల్సిన్‌యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ ఉపయోగించవచ్చు. చర్మం మందంగా మారిన పిల్లల్లో ‘ఇక్థైమాల్’ అనే పూతమందును ఉపయోగించడం వల్ల చర్మం మామూలుగా మారుతుంది.

 

రెండోదశ చికిత్స
తేలిగ్గా చేయదగిన మొదటి దశ చికిత్సతో ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ మోతాదును పెంచడం... అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావడం జరగవచ్చు.  వెట్... ర్యాప్ టెక్నిక్ : అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల ‘వెట్ ర్యాప్ టెక్నిక్’ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట చర్మంపైన ఎమోలియెంట్స్ బాగా పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన ఒక పొరలా బ్యాండేజ్ కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొర పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి.

 

మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్‌మెంట్)

తక్కువ మోతాదులో సైక్లోస్పోరిన్ థెరపీ.

నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం.

అజాథ్రయోప్రిన్ వంటి నోటి ద్వారా తీసుకునే మందులను తీసుకోవాలి. థర్డ్ లైన్ ట్రీట్‌మెంట్ అంతా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

సాధారణంగా చికిత్స తర్వాత చాలా మంది పిల్లల్లో పరిస్థితి మెరుగవుతుంది. అయితే అలా మెరుగైన అదే పరిస్థితిని నిలకడగా ఉంచడం కోసం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అవి...

     
ఎమోలియెంట్స్‌ను కొనసాగించడం

సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న పిల్లల్లో తక్కువ శక్తితో ఉండే కార్టికో స్టెరాయిడ్ పూతమందులను నయమైన చోట రాయాలి. దీన్ని వీకెండర్ అప్రోచ్‌గా పేర్కొంటారు. దీనివల్ల అటోపిక్ డర్మటైటిస్ మాటిమాటికీ తిరగబెట్టడం తగ్గుతుంది. అప్పటికీ సమస్య తిరగబెడితే కార్టికోస్టెరాయిడ్ పూతమందులను కొద్ది రోజులు రోజూ రాసి ఆ తర్వాత వారానికి ఒక రోజు వారంలో ఒకరోజు వాడాలి. (వీకెండర్ అప్రోచ్ అవలంబించాలి). డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ చికిత్సా పద్ధతులను అవలంబించాలి.

 

రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు...
ప్రభావితమయ్యే భాగాలు: సాధారణంగా చర్మం ఎర్రబారడం ముఖంపై కనిపిస్తుంటుంది, గాని ఇది చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపించవచ్చు. పాకే పిల్లల్లో ఏమవుతుంది...  పాకే ఈడు పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకుపోతుంటాయి. దాంతో మోకాళ్ల భాగంలో ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఇతర లక్షణాలిలా...  చర్మంపై పగుళ్లు చాలా దురదగానూ నొప్పిగానూ ఉంటాయి.  శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్  ఉద్వేగాలకు, తీవ్ర ఆందోళనకు లోనుకావడం. పేరెంట్స్ అటోపిక్ డర్మటైటిస్‌తో బాధపడుతూ ఉండేవారైతే వారి పిల్లల్లో డర్మటైటిస్ వచ్చే అవకాశాలూ ఎక్కువే.

 

ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో...
వయసు పిల్లల్లో సాధారణంగా అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడం - చర్మంలోని ముడుతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే... మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్‌లైన్) ఉన్నచోట్ల దురదపుట్టి అది పగుళ్లు బారుతున్నట్లవుతుంది.

 

రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...
ఈ వయసు పిల్లల్లో చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడిబారడం అన్నది మోకాళ్ల కింది చర్మంలో చాలా ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు... బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఈ వయసువారిలో ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవుల మూలలు చీరుకుపోయినట్లుగా ఉంటాయి.


ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...
ఏడు కంటే తక్కువ వయసు ఉండే పిల్లలతో పోలిస్తే ఈ వయసు (7 నుంచి 14 ఏళ్ల) పిల్లలు కాస్తంత ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. అందుకే ఈ వయసుకు వచ్చేసరికి అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు లక్షణాల్లో తీవ్రత ఒకింత తగ్గుతుంది. ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఆస్తమా అటాక్ వచ్చి శ్వాసతీసుకోవడం కష్టం కావచ్చు. రాత్రివేళ శ్వాససరిగా అందక సరైన నిద్ర ఉండదు. ముక్కు కారుతుంటుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. కొందరు పిల్లల్లో తరచూ చర్మంపై హెర్పిస్ సింప్లెక్స్ వంటి వైరల్; స్టెఫాలోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement