ఊహూ ఆ అమ్మే కావాలి | Sakshi
Sakshi News home page

ఊహూ ఆ అమ్మే కావాలి

Published Tue, Jan 30 2018 12:26 AM

children were turned - Sakshi

ఇద్దరు తల్లులు.. ఇద్దరు బిడ్డలు...
పిల్లలు తారుమారయ్యారు...
తల్లులు కనిపెట్టలేకపోయారు.
తీరా కనిపెట్టాక ఈ వింత జరిగింది.

ఆమె ఒక ముస్లిం యువతి. పేరు రెహానా (పేరు మార్చాం). అసోంలో ఒక చిన్న గ్రామంలో ఉంటోంది. నిండు చూలాలు. నెలలు నిండటంతో మంగోల్డోయ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు  పోసుకోవడానికి వచ్చింది. అక్కడి వారి నియమానుసారం కేసు షీటులో అన్నీ పూర్తి చేసింది. కాన్పు సులువుగానే అయ్యింది. పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. నర్సు వచ్చి పసిబిడ్డకు స్నానం చేయించడానికి తీసుకువెళ్లింది. శుభ్రంగా ఒళ్లంతా కడిగి, సాన్నం చేయించి, పొడి వస్త్రంలో చుట్టి తీసుకువచ్చి తల్లి దగ్గర పడుకోబెట్టింది. తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి నిద్రపుచ్చింది. అదే రోజున  ప్రభ (పేరు మార్పు చేశాం) అనే బోడో యువతి కూడా అదే ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చింది. ఆమెకు కూడా పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ పసివాడికి కూడా నర్సు స్నానం చేయించి పొడి వస్త్రంలో చుట్టి తల్లికి అప్పచెప్పింది. పిల్లవాడు పాలు తాగి హాయిగా నిద్రపోయాడు. 

ఈ ఇద్దరూ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యి, ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ప్రతిరోజూ పసిబిడ్డకు స్నానం చేయించి, బిడ్డకు పాలిచ్చి నిద్ర పుచ్చారు. ఇలా వారం రోజులు గడిచాయి. రోజూ స్నానం చేయిస్తున్నా గమనించని ఆ ముస్లిం అమ్మ, ఆ రోజు బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రుల పోలికలు లేకుండా ఉన్నాడు బిడ్డ. పోలికలే కాదు, వేరే జాతి పిల్లవాడిలా ఉన్నాడు. ఇలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. వెంటనే ఆమె భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. ఆ రోజు ప్రసవించిన ప్రభ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంది.ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన వెంటనే ప్రభ ఒడిలోని బాబుని చూసింది. ఆశ్చర్యపోయింది. తన పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆ బిడ్డ తన బిడ్డేనని, ఆసుపత్రిలో బిడ్డలు తారుమారయ్యారని చెప్పింది.

ప్రభ అంగీకరించలేదు. ఆ బిడ్డ తమ బిడ్డేనంటూ గట్టిగా ఏడుస్తూ, బిడ్డను గుండెలకు హత్తుకుంది. రెహానా ఎంత చెప్పినా ప్రభ అంగీకరించలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రెహానా న్యాయ పోరాటం చేసింది. ఆ బిడ్డ ఆమె బిడ్డే అని కోర్టు తీర్పు చెప్పింది. న్యాయపరంగా తన బిడ్డను తనకు ఇవ్వమని కోరింది రెహానా. అన్ని రోజులపాటు పాలిచ్చి పెంచిన బిడ్డను ఇవ్వడానికి ప్రభ మనసు అంగీకరించలేదు. అయితే తాను పెంచిన తల్లిని మాత్రమేనని, నవ మాసాలు మోసిన తల్లికే బిడ్డ మీద అధికారం ఉంటుందని చాలాసేపటికి అర్థం చేసుకుంది ప్రభ. తన అజ్ఞానానికి విచారిస్తూ, రెహానా బిడ్డను ఆమెకు ఇవ్వడానికి అంగీకరించింది.  ఇంతవరకు కథ బాగానే ఉంది.

అసలు ఇబ్బందంతా ఇక్కడే వచ్చిపడింది.ప్రభ తన ఒడిలోని బిడ్డను రెహానాకు అందించబోయింది. ఆ బిడ్డ ప్రభను విడిచిపెట్టలేదు. చీర గట్టిగా పట్టేసుకున్నాడు. రెహానా ఆమె చీర విడిపించి, బిడ్డను తన ఒడిలోకి తీసుకుంది. గుక్క పెట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత ఆడించినా ఏడుపు ఆపలేదు. బిడ్డను తన వైపు మళ్లించుకోవడానికి రెహానా ఎంతగానో ప్రయత్నించింది.ఇదే సంఘటన ప్రభకూ అనుభవమైంది. రెహానా దగ్గర నుంచి తన బిడ్డను తీసుకుని ఎత్తుకుంది. ఆ పిల్లవాడూ గుక్క పట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు.ఇద్దరు తల్లులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కన్న పేగు కంటె, పెంచిన మమకారానికి లొంగిపోయారు ఆ పసికందులు. కన్న తల్లి చేతుల నుంచి, పెంచిన తల్లి చేతుల్లోకి వెళ్లగానే ఇద్దరూ ఏడుపు ఆపేశారు.

కన్నతల్లిని కాదు, పుట్టిన మరుక్షణం నుంచి పాలిచ్చి పెంచిన తల్లినే కన్నతల్లిగా భావించారు. చిరునవ్వులు చిందించారు. ఆమే తన తల్లి అని గుర్తుపట్టినట్లుగా, ఆ పసిపిల్లలిద్దరూ తల్లులను గట్టిగా పట్టేసుకున్నారు... ‘‘నువ్వే మా అమ్మవు’’అన్నట్లుగా ఉంగా ఉంగా అంటూ అమ్మలతో మాట్లాడారు.చేసేదిలేక ఒకరి కన్న బిడ్డను మరొకరు తమతో తీసుకెళ్లారు. బరువెక్కిన గుండెలకు ఆ పిల్లలను అదుముకున్నారు. ఇది చాలా వింత, విచిత్ర కథ. సృష్టి అంటే ఇదేనేమో. ఎవరు ఎవరిని పెంచాలో ఆ దేవుడే నిర్ణయించి ఉంటాడు. అందుకే ఒకరు కన్నారు మరొకరు పెంచారు. వీరిద్దరూ యశోదలే. ఇద్దరూ దేవకీదేవులే! 

Advertisement

తప్పక చదవండి

Advertisement