ఆరోగ్యగీతం

20 Feb, 2019 00:01 IST|Sakshi

‘నాదమే నిధి... తాళం పెన్నిధి... రాగం సన్నిధి... గాత్రం దివ్యౌషధం. మ్యూజిక్‌ థెరపీకి మూలం సంగీతమే... మాధ్యమమూ సంగీతమే. వెస్టర్న్‌ సొసైటీ ఈ వైద్యాన్ని శాస్త్రబద్ధం చేసుకుంది. గాత్రాన్ని... రాగాన్ని పేటెంట్‌తో చట్టబద్ధమూ చేసుకుంది. యూనివర్సిటీల్లో పాఠాలను బోధిస్తోంది. మరి... మన నాదాన్ని మనం కాపాడుకోకపోతే ఎలా? మన సంగీత నిధి మీద పేటెంట్‌ భరతమాతకే ఉండాలి. ఈ శేష జీవితం మన శాస్త్రీయ సంగీత వైద్యం కోసమే’ అంటున్నారు కర్ణాటకకు చెందిన డాక్టర్‌ మీనాక్షీ రవి.

‘నాదమయం’ అనే అక్షరాల వెంటే పాదముద్రలున్నాయి. ఆ పాదాలు ఆ సంగీత నిలయంలోకి దారి తీస్తున్నాయి. లోపల అరవై దాటిన ఓ సంగీత సరస్వతి కర్ణాటక సంగీతం గానం చేస్తున్నారు. ఆమెతోపాటు ఓ పదేళ్ల పిల్లవాడు సాధన చేస్తున్నాడు. ‘తల పై కెత్తి నా చేతిని చూడు నాన్నా’ అంటూ ఆగారామె. ఆ పిల్లవాడు తదేకంగా గాల్లోకి లేచిన ఆ చేతినే చూస్తూ ఆమె పలికినట్లు పలుకుతున్నాడు. ‘తాళం మర్చిపోతున్నావు’ అని ఆమె గుర్తు చేయగానే తాళం వేస్తూ పాట అందుకున్నాడా పిల్లాడు. ఆ దృశ్యాన్ని ఫొటో తీయబోతే ఆమె రాగం తీస్తూనే మరో చేత్తో ఫొటో తీయవద్దన్నట్టు వారించారు. పక్కనే ఉన్న పిల్లవాడి తల్లి కూడా ఫొటో వద్దని సంజ్ఞ చేసింది. కొన్ని క్షణాలకు గానం ఆపి... ‘‘పిల్లవాడిని ఫొటో తీయకండి’’ అన్నారామె. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆమె ‘‘ఈ అబ్బాయి స్పెషల్‌ కిడ్‌. మ్యూజిక్‌ థెరపీతో నాలుగైదేళ్లలో నార్మల్‌ కిడ్‌ అయిపోతాడు. ఇప్పుడు మీరు పేపర్‌లో ఫొటో వేస్తే రేపటి నుంచే స్కూల్లో మిగిలిన పిల్లలు అతడిని ఏడిపిస్తారు. ఇప్పుడు ఫొటో చూసి గుర్తు పెట్టుకున్న వాళ్లు ఈ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ‘ఆ పిల్లాడే కదూ, ఆ అమ్మాయే కదూ’ అని ఈ పిల్లల్ని గుర్తు చేసుకుంటారు. వీళ్లు జీవితం మొత్తం ఒకప్పుడు వీళ్లు ‘స్పెషల్‌ కిడ్‌’ అనే ముద్రను మోయాల్సి వస్తుంది. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అన్నారామె. ఆమె భావం అర్థం కాగానే పిల్లల పట్ల ఆమెకున్న బాధ్యతకు ఎనలేని గౌరవం కలిగింది.  

సంగీతంతో పరిపూర్ణత్వం
ఆ సంగీత సరస్వతి పేరు విదుషి మీనాక్షీరవి. మీనాక్షి ఆమె పేరు, విదుషి సంగీతంలో ఆమె సాధించిన గౌరవం. పుట్టింది కర్ణాటక రాష్ట్రం, మాండ్యాలో. తాత శంకర శాస్త్రి సంగీతం మాస్టారు. మీనాక్షి తొలి గురువు కూడా ఆయనే. ఆమె డబుల్‌ ఎం.ఎ. (సోషల్‌ వర్క్, కర్నాటిక్‌ మ్యూజిక్‌) చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసి మహిళా శిశు సంక్షేమ శాఖలో తహసీల్దార్‌ కేడర్‌ ఉద్యోగంలో చేరారు. కరడుగట్టిన అవినీతి మధ్య ఇమడలేక ఏడాదికే ఆ ఉద్యోగాన్ని వదిలేశారామె. అప్పటి నుంచి సంగీతాన్నే జీవితంగా మలుచుకున్నారు. సంగీతం కోసమే జీవించడం మొదలుపెట్టారు. మనిషికి పరిపూర్ణత్వం సిద్ధింపచేసే గొప్ప లక్షణం సంగీతంలో ఉందన్నారామె. 

నాదవైద్యం
‘‘శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం, సామాజిక పరివర్తన, ఆధ్యాత్మిక మార్గంలో జీవించే పరిణతి... ఈ నాలుగు కోణాల్లో మనిషిని పరిపూర్ణం చేసేది సంగీతమే. అందుకే మనిషికి ఎదురయ్యే శారీరక, మానసిక, సామాజిక సమస్యల నుంచి విముక్తి కోసం సంగీతాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్నాను. నేను ప్రయోగాత్మకంగా చేసిన మ్యూజిక్‌ థెరపీ మంచి ఫలితాలనిస్తోంది. దీని మీద నా రీసెర్చ్‌ని కొనసాగిస్తున్నాను. ఇందుకోసం నాలాగ ఆలోచించే మరికొందరం కలిసి ‘ఇండియన్‌ మ్యూజిక్‌ థెరపీ అసోసియేషన్‌ (ఐఎమ్‌టీఏ)’ను స్థాపించాం. నేను జనరల్‌ సెక్రటరీని. ఈ వేదిక నుంచి ప్రతి నాలుగు నెలలకోసారి ఒక వర్క్‌షాప్‌ పెట్టాలనేది మా ఉద్దేశం. బెంగళూరులో స్థాపించిన ‘మీరా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీ, హైదరాబాద్‌లోని నాద సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీలు ఐఎమ్‌టీఏతో కలిసి పని చేస్తున్నాయి. మ్యూజిక్‌ కాన్సర్ట్‌లలో పాడటం వల్ల స్పెషల్‌ కిడ్స్‌కి స్టేజ్‌ ఫియర్‌ పోతుంది. స్పెషల్‌ కిడ్స్‌తో కలిసి కాన్సర్ట్‌ చేయడంతో నార్మల్‌ కిడ్స్‌లో పరస్పరం సహకరించుకోవాలనే తత్వం అలవడుతుంది. ఇలా పిల్లల్లో ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కోర్సు డిజైన్‌ చేశాను. ‘నాద మంథన’ పుస్తకంలో సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు సంగీతం ఎలా ప్రభావం చూపుతుందో రాశాను. ఇప్పుడు ‘కర్నాటిక్‌ మ్యూజిక్‌ థెరాపుటిక్‌ పర్‌స్పెక్టివ్‌’ అని మరో పుస్తకం రాస్తున్నాను. వీటిలో మ్యూజిక్‌ థెరపీ గురించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ప్లేటో, అరిస్టాటిల్‌ కూడా సంగీతానికి ఆరోగ్యాన్ని చేకూర్చే లక్షణం ఉందని రాశారు. ప్రపంచ యుద్ధాల సమయంలో సైనికుల పునరావాస కేంద్రాల్లో సంగీతంతో సాంత్వన కలిగించిన ఉదాహరణలున్నాయి. అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ 1944లో మ్యూజిక్‌ థెరపీలో గ్రాడ్యుయేషన్‌ కోర్సు ప్రవేశపెట్టింది, 1950లో మ్యూజిక్‌ థెరపీ నేషనల్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. వందల ఏళ్ల వెస్టర్న్‌ మ్యూజిక్‌ని వాళ్లు అంతగా శాస్త్ర బద్ధం చేసుకుంటున్నారు. మనదేశంలో వేల సంవత్సరాల నుంచి అపారమైన సంగీత నిధి ఉంది. మనం పట్టించుకోకపోతే మన సంగీతాన్ని కూడా పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు చేసి వాళ్లు పేటెంట్‌ తీసుకుంటారు. ఇప్పటికే భారతీయ సంప్రదాయ సంపద తరలిపోతోంది కూడా. అందుకే మ్యూజిక్‌ థెరపీని శాస్త్రబద్ధంగా నిరూపించడానికి పరిశోధన చేస్తున్నాను. మ్యూజిక్‌ థెరపీతో స్వస్థత పొందిన ప్రతి స్టూడెంట్‌ డెవలప్‌మెంట్‌నీ నోట్స్‌ రాస్తున్నాను. మందులు వాడాల్సిన అవసరం లేకుండా మ్యూజిక్‌ థెరపీతో జీవిస్తున్న కేస్‌ స్టడీలను రికార్డు చేస్తున్నాను. శాస్త్రీయ పరీక్షకు నిలిచేటట్లు ప్రతిదీ గ్రంథస్థం చేస్తున్నాను. మన సంపదకు పేటెంట్‌ మనదేశంలోనే ఉండాలనేది నా ఆశయం’’ అన్నారు మీనాక్షి.

దిగులు కరిగింది
ప్రభుత్వ ఉద్యోగం మానేసిన తర్వాత మీనాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. కర్ణాటకలో తొలి ఫ్యామిలీ కౌన్సెలర్‌ ఆమె. వైవాహిక జీవితంలో మహిళలు ఎదుర్కొనే దైన్య స్థితిని వర్ణించడానికి మాటలు చాలవు. వాటిని దిగమింగి బతుకీడుస్తూ క్రమంగా మానసికంగా ఒడిదొడుకులకు గురవుతుంటారు. అలాంటి వాళ్లకు మాటలతో ఓదార్చి, ధైర్యం చెప్పడంతో సరిపోవడం లేదని గ్రహించారు మీనాక్షి. మ్యూజిక్‌ థెరపీతో ఓ ప్రయత్నం చేశారు. అది విజయవంతమైంది. పురంధర దాసు కీర్తనల్లో కుటుంబ బంధాల కీర్తనలు మహిళల్లో గూడుకట్టుకుని ఉన్న దిగులును కన్నీటి రూపంలో కరిగించేశాయి. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా మూడు వేల మంది మ్యూజిక్‌ థెరపీతో మనసు తేలిక పరుచుకుని వైవాహిక బంధాలను చక్కబరుచుకున్నారు. మ్యూజిక్‌ థెరపీ కోసం కౌన్సెలింగ్‌ కీర్తనలతో ఎనిమిది సీడీలు విడుదల చేశారామె. ఇప్పుడు స్పెషల్‌ కిడ్స్‌కి మ్యూజిక్‌ థెరపీ ఇస్తూ ఈ అంశం మీద విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు.

నేను గానం.. ఆయన తాళం
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి నా రోల్‌మోడల్‌. అయితే భగవంతుడు నన్ను కీర్తనల ఆలాపనకు పరిమితం చేయకుండా మ్యూజిక్‌ థెరపిస్టుగా మార్చాడు. ఈ స్పెషల్‌ వైద్యం నాతో ముగిసిపోకుండా తర్వాత తరానికి కొనసాగడం కోసం శిక్షకులను తయారు చేయడం నా బాధ్యత. నా భర్త ఎన్‌.జి. రవి మృదంగ విద్వాంసులు. స్పెషల్‌ కిడ్స్‌కి రిథమ్‌ థెరపీ ఇస్తారాయన. మా పిల్లలిద్దరూ జీవితాల్లో సెటిలయ్యారు. మా శేష జీవితం సంగీతవైద్య పరిశోధనకే అంకితం.
– విదుషి డా. మీనాక్షీరవి,  ఫ్యామిలీ కౌన్సెలర్, మ్యూజిక్‌ థెరపిస్ట్‌

మనసు బాగోలేకపోతే సంగీతం వింటాం. మనసు కోలుకుంటుంది. తనువు బాగుండకపోయినా సంగీతం ఔషధంలా పనిచేస్తుంది... అంటున్నారు విదుషి డాక్టర్‌ మీనాక్షీరవి 

ఈ నెల 24వ తేదీ, ఆదివారం హైదరాబాద్, హైటెక్‌ సిటీ ఫీనిక్స్‌ఎరీనాలో నాదమయ సంగీత సభ, త్యాగరాజ, పురందర దాస ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. అందులో స్పెషల్‌ కిడ్స్‌ సంగీతాలాపన చేస్తారు. 
– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా