కొత్త గుండెలు... కమింగ్ సూన్ | Sakshi
Sakshi News home page

కొత్త గుండెలు... కమింగ్ సూన్

Published Mon, Jun 22 2015 1:16 AM

కొత్త గుండెలు... కమింగ్ సూన్ - Sakshi

లబ్ డబ్..లబ్ డబ్.. లబ్ డబ్! గుండె కొట్టుకునే శబ్దమిది!
నిమిషానికి ఓ ఎనభైసార్లు ఈ లబ్‌డబ్‌లు వినిపిస్తే..
మనం బతికి ఉన్నట్లు లెక్క! లేదంటే ఈ భూమ్మీద మనకు నూకలు చెల్లినట్లే!
ఈ మాత్రం మాకూ తెలుసు అని అనుకుంటున్నారా? ఒకే! కానీ ఇది కొన్నేళ్లే!
ఆ తరువాత మనిషి బతికి ఉన్నాడా? లేదా? అన్నది తెలుసుకునేందుకు
కొత్త మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటారా?
అసలు కొట్టుకోని కృత్రిమ గుండెలు వచ్చేస్తున్నాయి మరి!
గుండెజబ్బులతో ఆయుష్షు అంచుల్లో ఉన్నవారికీ కొత్త ఊపిరి పోయగల
ఈ కొత్త గుండెల కథా కమామీషు..

 
గుండె మన శరీరంలో ఎంత ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వయసు మీదపడే కొద్దీ రకరకాల కారణాల వల్ల గుండె బలహీనపడటం, దాని సామర్థ్యం తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. కడుపులో ఉన్నప్పటి నుంచి కడదాకా కొట్టుకుంటూనే ఉండే ఈ పిడికెడంత అవయవానికి ప్రత్యామ్నాయమే లేదు. మరో మనిషి గుండెను అమర్చుకునే అవకాశముంది కానీ... అవయవదానంపై అవగాహన పెద్దగా లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకవేళ మార్పిడి కోసం గుండె అందుబాటులో ఉన్నా... అన్ని సందర్భాల్లోనూ ఆ గుండె మరొకరికి సరిపోతుందన్న గ్యారెంటీ లేదు... ఈ నేపథ్యంలోనే పల్స్ లెస్ అంటే కొట్టుకోని గుండెల అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
 
గుండె పనిచేయకపోయేందుకు అనేక కారణాలుంటాయి. అధిక రక్తపోటు మొదలుకొని గుండెజబ్బులు, హార్ట్‌అటాక్, స్ట్రోక్, గుండె వాల్వ్‌లు పాడవటం, కండరాలు బలహీనపడటం (కార్డియోమయోపతి) వంటివి. గుండెకు జబ్బు చేసినప్పుడు వాటిల్లోని కణాలు క్రమేపీ బలహీనపడతాయి. దీంతో వాడేసిన ఎలాస్టిక్ పట్టీ మాదిరిగా తయారవుతుంది గుండె. వ్యాకోచిస్తూ పెద్దగా మారుతుంది. అంతేకాకుండా దాని పంపింగ్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
 
చికిత్సతో చిక్కులెన్నో...: గుండె పాడైతే ఏం చేయాలన్న ఆలోచన ఇప్పటిదేమీ కాదు. దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు దీని గురించి ఆలోచన మొదలుపెట్టారు. 1912లో తొలిసారి ఫ్రెంచ్ సర్జన్ థియోడర్ టుఫియర్ చేతివేళ్లతో రోగి గుండె అరోటిక్ వాల్వ్ (గుండె నుంచి ప్రవహించే రక్తాన్ని నియంత్రిస్తుంది) ను కదపడం వైద్యశాస్త్ర చరిత్రలో తొలి హార్ట్ సర్జరీగా నమోదైంది. ఆ తరువాత 1944లో బాల్టీమోర్‌లో ఓ పసిబాలిక ఆరోటా వాల్వ్‌ను ఊపిరితిత్తులకు వెళ్లే పల్మనరీ వాల్వ్‌తో కలపడం ద్వారా ఆల్ఫ్రెడ్ బ్లాలాక్ ఈ రకమైన శస్త్ర చికిత్స చేసిన తొలి వైద్యుడిగా రికార్డులకెక్కారు. గుండెకు నేరుగా మరమ్మతు చేయడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు. శరీరం నుంచి ప్రవహించే రక్తాన్ని అడ్డుకుంటే ప్రాణం పోయే ప్రమాదముంటుంది.

అడ్డుకోకపోతే... శస్త్ర చికిత్స చేయడం కష్టం. అయితే ఐదవ దశకంలో అందుబాటులోకి వచ్చిన హార్ట్ లంగ్ మిషన్ ఈ సమస్యను కొంత వరకూ తీర్చగలిగింది. దీంతో 1953లో తొలి ఓపెన్‌హార్ట్ బైపాస్ సర్జరీకి మార్గం సుగమమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా గుండెకు శస్త్రచికిత్స అన్నది చాలా పరిమితులతో కూడుకున్న వ్యవహారమే! పూర్తిగా పాడైన గుండెలను మరో మనిషి గుండెతో మార్పిడి చేసుకోవడం ఒక్కటే మార్గంగా మిగిలింది. దురదృష్టవశాత్తూ గుండెమార్పిడి చేసుకున్న వారు ఎక్కువ కాలం బతికేవారు కాదు. శరీరం కొత్త గుండెను తిరస్కరించడంతో సమస్యలేర్పడేవి.
 
కృత్రిమ గుండెలు...: గుండె చేసే పని కేవలం రక్తాన్ని శరీరంలోకి పంప్ చేయడం మాత్రమే అని ముందుగా చెప్పుకున్నాం కదా... ఈ అంశం ఆధారంగా కృత్రిమ గుండెలు తయారు చేసేందకు కూడా చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1968లోనే డెంటన్ కూలీ అనే శాస్త్రవేత్త తొలిసారి కృత్రిమంగా తయారైన గుండెను ఓ రోగికి అమర్చారు. ఆ తరువాత 64 గంటలకు ఆ రోగికి మరో మనిషి గుండెను అమర్చినా... ఒకట్రెండు రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ గుండెనును పోలిన కృత్రిమ పరికరాన్ని తయారు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఫలితాలు మాత్రం అంతంతమాత్రమే. విలియం కాల్ఫ్ అభివృద్ధి చేసిన జార్విక్ 7, సిన్‌కార్డియా ఈకోవకు చెందినవే. వీటిని నడిపించేందుకు బయటి నుంచి విద్యుచ్ఛక్తి అవసరమయ్యేది. అంతేకాకుండా రోగి కదలికలకు ఆస్కారమూ తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో జార్విక్ 7ను అమర్చిన పేషెంట్లు ఎక్కువ కాలం బతికేవారు కాదు.

పైగా సిన్‌కార్డియా కృత్రిమ గుండెను మూడు నెలలకు ఒకసారి మార్చాల్సి వచ్చేది. ఆర్కిమెడీస్ స్క్రూతో కొత్త ఆశలు..: ఆర్కిమెడిస్ స్క్రూ గురించి మీరెప్పుడైనా విన్నారా? క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన పరికరం ఇది.  (ఫొటో చూడండి) కాలువల నుంచి నీటిని కొంచెం ఎత్తుకు తోడుకునేందుకు ఉపయోగించేవారు. గొట్టం ఒకవైపున ఉండే పుల్లీని తిప్పితే... దిగువ నుంచి నీరు పైకి ఎగబాక్కుంటూ వస్తాయి. 1976లో రిచర్డ్ కె.వాంప్లర్ అనే కార్డియాలజిస్ట్ ఈ ఆర్కిమెడీస్ స్క్రూను చూసి దీని ఆధారంగా కృత్రిమ గుండె తయారీకి పూనుకున్నారు. ‘హీమోపంప్’ పేరుతో ఈయన అభివృద్ధి చేసిన కృత్రిమ గుండె ఓ పెన్సిల్ ఇరేజర్ సైజులో ఉండేది. 1988లో దీన్ని తొలిసారి ఓ రోగిలో అమర్చారు. దీంట్లోని స్క్రూను బ్యాటరీ సాయంతో తిప్పినప్పుడు గుండెలోని రక్తం శరీర అవయవాలకు చేరేది. అయితే ఇది నిత్యం తిరుగుతూనే ఉంటుంది. మామూలు గుండె మాదిరి నిమిషానికి 80 సార్లు చొప్పున కాదన్నమాట.

దీంతో ఈ రకమైన పరికరాన్ని అమర్చుకున్న వారి నాడి కొట్టుకోదు! ఇంకోలా చెప్పాలంటే కొట్టుకోని గుండె సిద్ధమైందన్నమాట! అయితే హీమోపంప్ అమర్చిన వారు ఆసుపత్రికి మాత్రమే పరిమితం. దీంతో హీమోపంప్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఇదే ఆర్కిమెడీస్ స్క్రూ విధానం ఆధారంగా అబియోమెడ్ తయారు చేసిన ఇంపెల్లా, టెక్సస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన హార్ట్‌మేట్ 2లు హీమోపంప్ స్థానాన్ని భర్తీ చేశాయి. పెన్సిల్ సైజులో ఉండే ఈ పరికరంలోనే మోటర్ కూడా ఉండటం విశేషం. ఈ కృత్రిమ గుండెలేవీ కొట్టుకోవు. అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 20 వేల మంది హార్ట్‌మేట్ 2ను అమర్చుకున్నారు. హార్ట్‌మేట్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో గుండెకు మెరుగైన ప్రత్యామ్నాయం లభిస్తుందని, దీంతో ఏటా కొన్ని లక్షల మందిని మరణం నుంచి దూరం చేయవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
 - గిళియార్
 
కండరాల పంప్‌సెట్

ఇంతకీ మనిషి శరీరంలో గుండె చేసే పనేమిటి? రక్తానికి ఆక్సిజన్ చేర్చి శరీరంలోని అన్ని అవయవాలకూ దాన్ని పంప్ చేయడం అంతే! ముడుచుకుపోతే రక్తం శరీరంలోకి ప్రవహిస్తుంది... వ్యాపిస్తే గుండెలోకి ప్రవహిస్తుంది. అదీ లెక్క! ఈ సంకోచ, వ్యాకోచాలే మనకు లబ్‌డబ్‌ల రూపంలో వినిపిస్తూంటాయి. శరీరంలోకి ప్రవహించే రక్తాన్ని కూడా నాడి కొట్టుకోవడం లేదా పల్స్ ద్వారా మనం గమనించవచ్చు. గుండె అనే కండరాల పంప్‌సెట్‌లో నాలుగు గదుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. పైభాగంలో ఉన్న రెండు గదులను ఆట్రియా అని... కిందివైపున ఉన్నవాటిని వెంట్రికల్స్ అని పిలుస్తారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం కుడివైపున ఉన్న ఆట్రియంలోకి... ఆ తరువాత దిగువన ఉన్న వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తులోకి పంప్ అవుతుంది.

ఈలోపు ఆక్సిజన్‌తో కూడిన రక్తం ఊపిరితిత్తుల నుంచి ఎడమవైపున్న ఆట్రియంల్లోకి... ఆ తరువాత వెంట్రికల్‌లోకి చేరుతుంది. ఇక్కడి నుంచి రక్తం శరీరంలోని అవయవాలన్నింటికీ చేరుతుంది. ఈ ప్రక్రియ మొత్తమ్మీద అత్యంత కీలకమైన భాగాలేవైనా ఉన్నాయంటే అవి ఆట్రియ, వెంట్రికల్స్‌లోని వాల్వ్‌లు. రక్తం నిత్యం ఒకేదిశలో ప్రవహించేలా చేసేందుకు, వెనక్కు ప్రవహించకుండా చూసేందుకూ ఈ వాల్వ్‌లు చాలా కచ్చితమైన పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement