లాక్‌డౌన్‌ వాణి.. కమ్యూనిటీ కేంద్రం  | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ వాణి.. కమ్యూనిటీ కేంద్రం 

Published Sat, May 9 2020 5:05 AM

Community Radio Stations Spreading Awareness About Covid 19 - Sakshi

తుఫాను సమయంలో తీరంలోని వారికి ఒడ్డును చూపిస్తున్న లైట్‌ హౌస్‌... రేడియో అల. రైతుల యోగక్షేమాల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను వినిపిస్తున్న వాణి... రేడియో కర్షకవాణి. ప్రాంతీయ సమస్యలను స్థానిక నాయకుల చెవిన వేస్తున్న మైక్‌... రేడియో గురూ. గంగ జమున తెహ్‌జీబ్‌ పాఠాల్లోనే కాదు, ప్రాక్టికల్‌గానూ కనిపించాలని ట్యూన్‌ చేస్తున్న బ్యాండ్‌... రేడియో చార్మినార్‌...

ఇవన్నీ కమ్యూనిటీ రేడియోలు. కాకినాడ, చిత్తూరు, కోదాడ, హైదరాబాద్‌లలో స్థానిక శ్రోతల ఇళ్లకు తోరణాల్లాంటి తరంగాలు. ప్రతి రేడియోకు ఓ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యసాధనలో ఉంటూనే కరోనా కాలంలో ప్రత్యేక ప్రసారాలను, సేవలనూ అందిస్తున్నాయి.

కరోనా కారక్యక్రమాలు ..
ప్రస్తుత కరోనా కాలానికి తగ్గట్టుగా కొన్ని  కొత్త కార్యక్రమాలను చేర్చుకుని ప్రసారం చేస్తున్నాయి ఈ కమ్యూనిటీ రేడియోలు. కరోనా అప్‌డేట్స్‌తోపాటు స్థానిక ప్రభుత్వఅధికారులు, ప్రజాప్రతినిధుల  ముఖాముఖి, కరోనా దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సిన ఆహార నియమాలపై డాక్టర్ల సలహాలు, సూచనలు వినిపిస్తున్నాయి, వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు, స్థానిక  స్వచ్ఛంద సంస్థల సేవాకార్యక్రమాలు, హెల్ప్‌లైన్‌ల నంబర్లు వంటి వివరాలను అందిస్తున్నాయి. ఫిట్‌నెస్, యోగా నిపుణులతో ఇంటరాక్షన్‌ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, పెద్దలకోసం లోకాభిరామాయణం, అంత్యాక్షరి, డైలాగ్‌ చెప్పి సినిమా పేరు అడగడం, చరణం పాడి పల్లవి చెప్పమనడం, షాయరీలు, హౌజీ గేమ్స్, రైతుల కోసం ధాన్యం కొనుగోలు, మార్కెట్‌వివరాలు, యూత్‌కి ఆన్‌లైన్‌ పాఠాలు, పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు గైడెన్స్‌ మొదలైనవి, పిల్లలకోసం పిల్లల చేత చెప్పిస్తున్న కథలు, రేడియో నాటకాలు, సామెతలు వంటివి ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నాయి.

సమస్యలతో ఫోన్‌ చేస్తే నిపుణులతో సమాధానం ఇప్పించే ఫోన్‌ ఇన్‌లూ ఉంటున్నాయి.  కొన్నిచోట్ల  వలస కూలీలకు రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకూ సహాయపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కమ్యూనిటీ రేడియోలు కరోనా స్థానిక వార్తలే  కాక పదమూడు జిల్లాల సమాచారాన్నీ ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాయి. ఈ కమ్యూనిటీ రేడియోలన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తమ ప్రసారాలను వినిపిస్తున్నాయి. ఒక్క కరోనా పరిస్థితుల్లోనే కాదు... అవి గొంతు విప్పిన నాటి నుంచీ  ప్రతీ కష్టకాలంలోనూ స్థానికులకు, స్థానిక పాలనావ్యవస్థకు మ«ధ్య వారధిగా నిలుస్తున్నాయి. సంచలనాలకన్నా సమాచారానికి విలువనిçస్తూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నాయి.

మన ఊరు.. మన రేడియో .. 
ఈ క్యాప్షన్‌తో 2013లో కాకినాడలోని తీరప్రాంతం కేంద్రంగా మొదలైంది ‘రేడియో అల’. ఫౌండర్‌ ఎమ్‌వీఆర్‌ ఫణీంద్ర. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు, వారి కుటుంబాల్లోని మహిళల కోసం ఏర్పడింది. సముద్రానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని మత్స్యకారులకు అందిస్తూ, సాధికారత సాధించే దిశను మహిళలకు చూపిస్తోందీ రేడియో. ఆడవాళ్లే  నడిపిస్తున్న ఈ ‘రేడియో అల’ స్టేషన్‌కు డైరెక్టర్‌ కొండ్ర సత్యవతి. 

‘రేడియో అల’ స్టేషన్‌ డైరెక్టర్‌ కొండ్ర సత్యవతి

కర్షకవాణి... ఇది మన రేడియో
 చిత్తూరు జిల్లాలోని పుంగనూరు కేంద్రం నుంచి రైతుల సంక్షేమాన్ని  వినిపిస్తోందీ రేడియో. 2015లో మొదలైన ఈ వాణి..వర్షపాతం, వర్షాభావ పరిస్థితులు, అనుగుణమైన పంటలు, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీల నుంచి రైతు సంక్షేమ పథకాలు, బీమాపథకాలు వంటి సమస్త సమాచారంతో చెవినిల్లు కడుతోంది. అలాగే మహిళలను ఎంట్రప్రెన్యూర్స్‌గా తయారు చేయడానికి జ్యూట్‌ బ్యాగులు, ఆర్టిఫీషియల్‌ జ్యువెలరీ తయారీ, కిచెన్‌ గార్డెన్స్‌లో శిక్షణ కార్యక్రమాలూ నిర్వహిస్తోంది. కర్షకవాణి ఫౌండర్‌ ఎమ్‌. కిరణ్‌కుమార్, స్టేషన్‌ మేనేజర్‌ టీకే ప్రశాంత్‌. ఈ రేడియో కోసం కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా సేవలు అందిస్తున్న శశికళతోపాటు మరో ముగ్గురు ఉద్యోగులూ ఉన్నారు

‘కర్షకవాణి’ కార్యక్రమాల మీద సిబ్బంది చర్చ

వాయిస్‌ ఫర్‌ వాయిస్‌లెస్‌
అంటూ గ్రామీణ యువత,ఆసరాలేని, ఆసరా కోల్పోయిన మహిళల కోసం కోదాడ కేంద్రంగా  ప్రసారాలు మొదలుపెట్టింది ‘రేడియో గురు’. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణప్రాంతంలో సాధికారత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఆ బాటగా యువతను, మహిళలను నడిపించే ప్రయత్నం చేస్తోంది. దీనికి ఫౌండర్స్‌ కోట రామారావు, కాకునూరు వెంకట్‌రెడ్డి. వీళ్లతోపాటు ఇద్దరు మహిళా ఆర్‌జేలూ పనిచేస్తున్నారు. 2017లో స్టార్ట్‌ అయిన ‘రేడియో గురు’కి  లిజనర్స్‌ క్లబ్‌ కూడా ఉంది.

‘రేడియో గురు’ స్టేషన్‌లో ఆర్‌జె జాస్మిన్‌

దిల్‌ సే హైదరాబాదీ
అని చెప్తున్న ‘రేడియో చార్మినార్‌’  2015లో పాతబస్తీ కేంద్రంగా ప్రారంభమైంది. హిందూ, ముస్లిం కలగలసిన దక్కనీ సంస్కృతిని ప్రతిబింబించే ఇన్‌ఫోటైన్‌మెంట్‌ కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగమైన ఢోలక్‌ కే గీత్‌ వంటి వాటిని స్పాన్సర్‌ కూడా చేస్తోందీ రేడియో. దీనికి ఫౌండర్‌ సంతోష్‌ అనుబత్తుల. స్థానికులతోపాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆర్‌జేలుగా పనిచేస్తున్నారు .

అతిథితో ‘రేడియో చార్మినార్‌’ ఆర్‌జే  తార

Advertisement

తప్పక చదవండి

Advertisement