డర్మటాలజీ కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

డర్మటాలజీ కౌన్సెలింగ్

Published Fri, Jul 24 2015 11:04 PM

Counseling darmatalaji

ఆ మచ్చలను పూర్తిగా తగ్గించవచ్చు

 నా వయసు 21. కొద్దికాలంగా నా ముంజేతుల మీద చర్మం నల్లగా మారుతూ వస్తోంది. అక్కడి చర్మం పూర్వం లాగా మామూలుగా మారాలంటే ఏం చేయాలో సలహా చెప్పగలరు.
 - కె.వాణి, విజయవాడ

 శరీరంలో ఎటువంటి ఆచ్ఛాదనా లేని అవయవాలు అంటే ముఖం, చేతులు మొదలైనవి సూర్యతాపానికి గురయ్యే అవకాశం ఉంది. ఎండలో తిరిగినప్పుడు చర్మంలో నలుపుదనానికి కారణమయ్యే మెలనిన్ పొర ఆచ్ఛాదనలేని భాగాలకు చేరి క్రమేపీ ఆ భాగాలు కూడా నల్లగా మారతాయి. దీనినే సన్‌టాన్ అంటారు. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మంచి బ్రాండ్‌కు చెందిన సన్‌స్క్రీన్ లోషన్‌ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి 15 లేదా 20 నిమిషాల ముందుగా ముఖం, మెడ, చేతులు... ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలకు రాసుకుని అప్పుడు వెళ్లడం మంచిది. అయితే మనం రాసుకునే లోషన్ 3 లేదా 4 గంటలు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి. అలాగే పడుకోబోయే ముందు కోజిక్ యాసిడ్, అర్బుటిన్ వంటి వాటిని కలిగి ఉండే క్రీమును ముఖానికి రాసుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి పదిహేనురోజులకు ఒకసారి గ్లైకాలిక్ పీల్స్ అప్లై చేయడం మంచిది. ఈ జాగ్రత్తలతోబాటు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమోటాలు, తాజాకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం అవసరం.
 
 మా పాపకు 18 సంవత్సరాలు. ఐదేళ్ల క్రితం తనకు అమ్మవారు పోసింది. అయితే దాని తాలూకు మచ్చలు మాత్రం ముఖం మీద మిగిలి ఉన్నాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలి?
 - డి.మహాలక్ష్మి, ఆదిలాబాద్

 సాధారణంగా అమ్మవారు పోసినప్పుడు అంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పడ్డ మచ్చలు కొద్దికాలం తర్వాత వాటంతట అవే చర్మం రంగులో కలిసి పోతాయి. అయితే కొంతమందికి ఈ గుల్లలు భరించలేనంత దురదగా ఉంటాయి. ఆ దురదను తట్టుకోలేక గోకటం లేదా చిదమడం వల్ల ఆ పుండులో నుంచి రసి కారి, మిగిలిన ప్రదేశాలకు కూడా వ్యాపించడమే కాక ఇన్ఫెక్షన్ ఏర్పడి మచ్చలు పడతాయి. అందువల్లనే డాక్టర్లు మొటిమలను కానీ గుల్లలను కానీ గిల్లటం, చిదమడం వంటి పనులు చేయరాదని చెబుతారు. మీ పాప విషయంలో మచ్చలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల అప్పుడు మచ్చలు అలాగే ఉండిపోయాయనిపిస్తోంది. లేజర్ చికిత్సావిధానంలో కొల్లాజెన్ ఏర్పడేటట్లు చేయడం ద్వారా మచ్చలు పడ్డ చోట్ల కొత్త చర్మం పుట్టేటట్లు చేయడం ఒక పద్ధతి అయితే, మచ్చలు పడిన ప్రదేశంలోని చర్మపు పై పొరలను తొలగించి, అక్కడ కొల్లాజెన్  ఉత్పత్తయేలా చేయడం ద్వారా కొత్త చర్మం ఏర్పడేటట్లు చేయడం మరోపద్ధతి. ఈ రెండూ కాకుండా మరో పద్ధతి ఏమిటంటే మచ్చల తీవ్రతను తగ్గించటం ద్వారా అవి క్రమంగా చర్మంలో కలిసిపోయేటట్లు చేయడం. ఇవన్నీ సురక్షితమైన చికిత్సావిధానాలే. అన్ని చర్మ తత్వాల వారికీ ఈ చికిత్సను చేయవచ్చు. లేజర్ విధానంతో బాటు ఇతర చికిత్సాపద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు మంచి డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో మచ్చలను నయం చేసుకోవచ్చు.
 
 డాక్టర్ ప్రశాంత్ సోమ
 డెరైక్టర్, ఒలీవా అడ్వాన్స్‌డ్ హెయిర్
 అండ్ స్కిన్ క్లినిక్స్,
 హైదరాబాద్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement