అమెరికాలో పిడకల వేట!

23 Nov, 2019 02:44 IST|Sakshi

పేడంగ్‌

మన గొప్పదనమేమిటో అమెరికా వాడు గుర్తించేదాకా మనకు తెలియదు కదా. ఈ మాట మరోమారు రుజువైంది. అక్కడ అమ్ముతున్న కౌ–‘డంగ్‌’ కేక్‌ను చూసి ఇప్పుడు యావత్‌ ప్రపంచ ప్రజలంతా ‘డంగై’పోతున్నారు. ‘ఉదరపోషణార్థం బహుకృత వేషమ్‌’ అనే సామెత మనమందరమూ విన్నదే. ఉదరం లేకపోయినా పేడ కూడా చాలా వేషాలే వేస్తుంటుంది. నీళ్లలోకి జారి కళ్లాపి (సాన్పి) అవుతుంది. గోడకు చేరి పిడకవుతుంది. ముగ్గులో దిగి గొబ్బెమ్మవుతుంది. చేనుకు చేరి  చేవవుతుంది. ఎందరెందరో ఉదరాలు నింపడానికిలా పాపమది ఇన్ని వేషాలూ వేస్తుంది. అంతేకాదు.. పవిత్రమైంది పేడ. అందునా ఆవుపేడ.
‘కాదేదీ మార్కెట్‌కనర్హం’ అన్న మాట తెలిసిందే.మరి ఓ హీరో రెండు వేషాలేసి, డబుల్‌ యాక్షన్‌ చేసి, పాన్‌–ఇండియా ఫిల్మ్‌ తీస్తేనే బాక్సాఫీసు బద్దలవుతుందే... అలాంటిది మరి ‘పేడ’? పైన చెప్పిన వేషాలన్నీ వేసి పాన్‌–అమెరికన్‌ అయిపోయాక... మరెన్ని కాసులు కురిపిస్తుందో ఊహించండి. అదలా కాసుల వర్షం కురిపించగలదని గుర్తించేశారు అమెరికన్‌ మార్కెటీర్లు.

అంతే... పవిత్ర క్రతువుల్లో వాడటానికి వీలుగా పిడకలు తయారు చేశారు. వాటిని న్యూజెర్సీలోని ఓ పెద్ద మాల్లో అమ్మకానికి పెట్టారు. ధర కూడా చాలా సరసమే. పది పిడకల పాకెట్‌ 2.99 డాలర్లు. అంతే... ఇక ఇప్పుడీ కౌడంగ్‌ కేక్‌లు హాట్‌కేకుల్లాగా అమ్ముడవుతున్నాయట. ఈ న్యూస్‌ ఇంటర్నెట్‌లోకి రాగానే నెటిజన్లు ఎన్నో జోకులు విసురుకుంటున్నారు. మనకు నచ్చని హీరో పోస్టర్‌ మీద పేడ విసరడం మనకలవాటే కదా. అలాగే... కుకీలను నిరసిస్తూ... కేకుల్ని బాగా ఇష్టపడే ఒకాయన... ‘‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిని కౌడంగ్‌ కుకీస్‌ అని పిలవండి. కేక్‌లు అనకండి’’ అంటూ ఫేస్‌బుక్‌ గోడమీదికి పేడ విసరనే విసిరాడు. ఇంకో ఆయన శంకరాభరణం శంకరశాస్త్రిగారిలా కండువా సవరించుకుంటూ... ‘పవిత్రమైన ఆవు పేడ ఒకలా ఉంటుంది. తుచ్ఛమైన ఆ మ్లేచ్ఛావు పేడ మరోలా ఉంటుంది.

ఒక్కొక్క పేడకు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్పసుంది. పనుంది. ఇంతకీ అక్కడ అమ్ముతున్నది పవిత్రమైన గోమాత పేడేనా... లేక సంకరజాతి పశువుల పేడా?’’ అంటూ  విసుక్కుంటూ విసుర్లు విసురుతున్నాడు. వాళ్లంతే... వాళ్లంతే... ప్రతిదీ మార్కెట్‌ దృష్టితోనే చూస్తారు. కానీ... మన పేడ మనకెంత గొప్పది? పశువుల కొట్టంలో పశువులూ, ఆవులు పేడ వేయగానే చెక్కదంతితో సిబ్బి లోకి లాగేసి కుప్ప మీద వేస్తారు. తొలకరికి కాస్తంత ముందుగా పొలానికి తరలించి సారంగా మార్చేస్తారు. గరిసెలోని ధాన్యానికి చీడ పట్టకుండా పేడ రాసేస్తారు. పండగ ముందు రోజున ఇల్లలికేస్తారు. గంపా, గరిసే, తట్టా, బుట్టా, తడకా, చేటా... ప్రతిదానికీ రాసి చీడపీడల నుంచి కాపాడతారు. పండగ ముందు రోజున అలకాల్సిన మన వసారా పేడకుప్పలు రాసుకుని ఎలా ఉంటుంది? అచ్చం భూమాత తన తలకు హెన్నా పెట్టుకున్నట్టుంటుంది.

ఆ మర్నాడు తలస్నానం చేశాక జుట్టు మెరిసినట్టుగా... మన గచ్చూ మిలమిలలాడుతుంటుంది. ఆ పేడ అలికిన గచ్చు ఇకపై ప్రతిరోజూ చక్కగా, చల్లగా మన పాదాలకి ముద్దెడుతూ, అడుగులకు మడుగులొత్తుతూ ఉంటుంది. ఇప్పుడీ పిడకలవేట గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే...   ‘చూశారా... అమెరికావాడెంత వ్యాపారదక్షుడో!’ అంటూ అచ్చెరువొందడానికి.  ఒక్క పిడక గురించి తెలిసినందుకే ఇంత మార్కెటింగ్‌ అయితే... ఈ విషయాలన్నీ ఎవరైనా విడమరిచి చెబితే... ఇంకేముందీ? ఇకనుంచి ‘బుల్‌షిట్‌’ అంటూ విసుక్కోవడం మానేస్తాడేమో. పేడకు పేటెంట్‌ అడిగేస్తాడేమో! పేడ తాలుకు కంటెంటంతా తనదే అనేస్తాడేమో!!
– యాసీన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు