క్రికెట్ కాలం | Sakshi
Sakshi News home page

క్రికెట్ కాలం

Published Sun, Apr 3 2016 10:55 PM

క్రికెట్ కాలం - Sakshi

ప్రేమ


వానాకాలం, చలికాలం, పోయేకాలం లాగా క్రికెట్ కాలం ఒకటుంటుంది. అప్పుడు మన పీకని మనమే కాపాడుకోవాలి. ఈ మధ్య గడ్డం గీయించుకోడానికి వెళితే పీకపై కత్తి పెట్టి ఆ కుర్రాడు టీవీ చూస్తున్నాడు. సిక్స్ పడేసరికి సబ్బు నురగపై కత్తి కాలుజారింది. షేవింగ్, డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. లేదంటే బ్లడ్డే అని డైలాగ్ చెప్పాను. ఈసారి పీకని వదలి చెంపపై గాటు పెట్టాడు. ఒకసారి మనవాళ్లు సరిగా ఆడకపోయేసరికి ఆ కుర్రాడు నా జుత్తుపై కోపాన్ని చూపాడు. తోటమాలి గడ్డి కత్తిరించినట్టు కటింగ్ చేశాడు. అప్పులోళ్లు కూడా నన్ను గుర్తుపట్టలేకపోయారు.

 ఈ మధ్య ప్రెస్‌క్లబ్ కెళితే చాలామంది మిత్రులు క్రికెట్ చూస్తూ ఊగిపోతున్నారు. కన్‌ఫ్యూజన్‌లో పెగ్గులు తాగేవాడు మగ్గులు తాగేస్తున్నాడు.

 
ఒక మిత్రుడు దగ్గరకొచ్చి ‘ధోని వోవ్స్ బౌల్స్ అవుస్ విక్స్’ అన్నాడు. ఆయన మిత్రుడొచ్చి ‘క్రిక్స్‌పిచ్ బావుసే అంపైర్స్ స్ స్’ అని సౌండ్ చేశాడు. తాగుబోతులు గాల్లో తేలడమే కాదు, వాళ్ల మాటల్లో కూడా గాలి ఎక్కువగా ఉంటుంది. నాలుగు రౌండ్లు పడితే టేకాఫ్ తీసుకుని ఎయిరిండియాగా మారిపోతారు.

 
డాస్టోవిస్కీలా నిబ్బరంగా కూర్చున్న ఒకాయన వచ్చి వీళ్లిద్దరి భాషకి అనువాదం చేశాడు. మూలం, అనువాదం రెండూ అర్థం కాకపోవడం పుస్తకాల్లోనే కాదు, ప్రెస్ క్లబ్‌లో కూడా జరుగుతూ ఉంటుంది.

 
ఇంకొకాయన ఉన్నాడు. క్రికెట్ వస్తున్నప్పుడు రకరకాల జంతువులుగా, సరీసృపాలుగా మారిపోతాడు. కాసేపు కుర్చీలో కూచుని పిల్లి కూతలు కూస్తాడు. మనవాళ్లు అవుటైనప్పుడు కుర్చీ పెకైక్కి కుక్కలా మొరుగుతాడు. అవతలివాళ్లు అవుటైతే నేల మీద దబేల్‌మని పడి బల్లిలా పాకుతాడు. క్యాచ్ పట్టినప్పుడు పక్షిలా పైకి ఎగురుతాడు. మనకు సిక్సర్ పడితే పులిలా గాండ్రిస్తాడు. ఎగస్పార్టీకి పడితే పాములా బుస కొడతాడు. మనం ఓడితే కోతిలా .. కనిపించినవన్నీ విసిరి కొడతాడు. గెలిస్తే కప్పలా గెంతుతూ బెకబెకమంటాడు.

 
కురుకురే లాంటి ఫ్యామిలీ ఒకటుంది. వాళ్లెంత మర్యాదస్తులంటే క్రికెట్ వస్తున్నప్పుడు టీవీ మినహాయించి ఇల్లంతా దోచుకెళ్లినా పట్టించుకోరు. టీవీ జోలికెళితే ఎన్‌కౌంటరే.

 
క్రికెట్ వల్ల ఒక్కోసారి భూకంపం కూడా వస్తుంది. నాకు తెలిసిన ఒక జంట ఎప్పటి కంటే ఎక్కువగా క్రికెట్ సీజన్‌లో ఫైటింగ్ చేస్తుంది. సీరియల్ చూడాలని ఆవిడ. క్రికెట్ చూడాలని ఆయన. ఆమె ప్లేట్ విసురుతుంది. ఆయన దాన్ని ఫిరాయిస్తాడు. గ్లాస్ విసురుతుంది. క్రికెట్ చూస్తూ క్యాచ్ పడతాడు. చెంబు విసిరితే రన్ చేస్తాడు. ఈ వస్తువులు బౌండరీలు దాటి పక్కింటి వాళ్లపైన కూడా ఒక్కోసారి పడుతుంటాయి.

 
క్రికెట్ వల్లే విజయ్‌మాల్యా దివాళా తీశాడని నమ్మే ఒక మిత్రుడు, ఎలాగైనా మాల్యాని గట్టెక్కించాలని క్రికెట్ చూస్తున్నంత సేపూ కింగ్ ఫిషర్ బీరు తాగుతాడు. బ్రేవ్‌మని ఆయన చేసే సౌండ్‌కి చుట్టుపక్కల వాళ్లు భయపడుతుంటారు. వడగాల్పుల కంటే త్రేన్పులు భయంకరం.

 
మా వూళ్లో పుల్లయ్య అనే క్రికెట్ ప్రేమికుడు ఉండేవాడు. ఆ రోజుల్లో టీవీ లేదు. రేడియోనే గతి. కామెంట్రీ పేరుతో గురగురమని సౌండొచ్చేది. చాలామందికి అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటించేవాళ్లు. ఈ పుల్లయ్య దాన్ని చెవిలో పెట్టుకుని రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవాడు. ఫైనల్స్ జరుగుతున్నప్పుడు ‘జ్’మని అరుస్తూ స్టేషన్‌కి ఎర్రముల్లు తగలకుండా రేడియో గావు కేకలు పెట్టింది. దాంతో విసిరికొట్టాడు. డొప్ప ఒకవైపు, సెల్స్ ఇంకోవైపు పడ్డాయి. రేడియో కూడా కనిపెట్టలేని విచిత్రమైన శబ్దాలతో ఆయన భార్య బండబూతులు తిడుతూ బడితె పూజ చేసింది. చాలాకాలం పుల్లయ్య పరారీలో ఉన్నాడు.

 
క్రికెట్ పిచ్చి ఉన్న మగవాళ్లతో ఆడవాళ్లకి కూడా చాలా ఇబ్బంది. టీవీ చూస్తూ టీ తీసుకురా, కాఫీ తీసుకురా అని ఒక సుబ్బారావు ఆర్డరేస్తుంటే ఆయన భార్య లా అండ్ ఆర్డర్ అప్లయ్ చేసింది. మనవాడు డక్ అవుట్.

 
జీవితం కూడా క్రికెట్ లాంటిదే. ఒకేసారి అనేకమంది బౌలర్లు మన పైకి బాల్స్ విసురుతుంటారు. వికెట్లకీ, శరీరానికీ తగలకుండా బ్యాటింగ్ ఆడాలి. ఈ బౌలర్స్‌లో సూపర్‌ఫాస్ట్ బౌలర్స్ మన సన్నిహితుల్లాగే ఉంటారు. అదే లైఫ్ మ్యాచ్.

 - జి.ఆర్.మహర్షి

 

Advertisement
Advertisement