ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా... | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా...

Published Wed, Jul 2 2014 12:14 AM

ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా... - Sakshi

విజయయాత్ర
పందొమ్మిది వందల ఎనభైల కాలం... టెలివిజన్ ప్రసారాలు అప్పుడప్పుడే సామాన్యులను చేరాయి.
 అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఏకైక తెలుగు దృశ్యశ్రవణ మాధ్యమం. టీవీలో ఏ బొమ్మ వచ్చినా ఆశ్చర్యమే. ఆ నేపథ్యంలో
 ఓ కుర్రాడు ఒకే ఒక కార్యక్రమాన్ని విపరీతంగా చూసేవాడు. అతడి దృష్టి టీవీలో ప్రసారమవుతున్న గిన్నిస్ ప్రపంచ రికార్డు
 సాధించిన వారి మీదనే కేంద్రీకృతం అయ్యేది. ఆ జాబితాలో తన పేరు ఉండాలనే ఆకాంక్ష మనసులో నాటుకుంది. కట్ చేస్తే...
 
2014 మే నెలకంతా ‘ఒక దేశంలో అత్యధిక దూరం సైకిల్ మీద పర్యటించిన వ్యక్తి’గా గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నాడా యువకుడు. అతడి పూర్తి పేరు ఆర్కాట్ నాగరాజు, వయసు 36 సంవత్సరాలు. కామర్స్‌లో పట్టభద్రుడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నాగరాజు ప్రస్తుతం దుబాయిలో ఎస్టిమేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగంలో మేనేజరు. గిన్నిస్ రికార్డులో చేరాలన్న చిన్నప్పటి కోరికకు పెద్దయ్యాక దేశమంతటినీ చూడాలనే కోరిక తోడయింది. సైకిల్ యాత్ర ద్వారా రికార్డు సాధించారు.
 
విజయారంభం!
నాగరాజు సైకిల్‌యాత్ర గడచిన ఏడాది అక్టోబర్ 14వ తేదీన విజయదశమి రోజున సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో అతడి ఇంటి నుంచి ప్రారంభమైంది. నిరంతరాయంగా 135 రోజుల పాటు కొనసాగి ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముగిసింది. ఈ మొత్తం పర్యటనలో నాగరాజు 14,197.55 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. నాగరాజు ప్రస్థానంలో 21 రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ సందర్శించారు. 2012 ఆగస్టు 25 నుంచి 2014 ఫిబ్రవరి 25 వరకు పద్దెనిమిది నెలల్లో మూడు దఫాలుగా 22.5 వేల కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీద పయనించారు.

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఏకత్వభావమే కనిపించింది అంటారాయన. నగరాల్లో వెళ్తున్నప్పుడు చాలామంది ఆసక్తిగా చూసి వెళ్లిపోయేవారు. పట్టణాలు, గ్రామాల్లో ఎదురు వచ్చి ఆపేసి ‘సైకిల్ మీదనా, దేశమంతా పర్యటనా’ అని ఆశ్చర్యపోయేవారు. ఆతిథ్యం ఇచ్చి ప్రేమగా వీడ్కోలు చెప్పేవారు. అలాంటి అనేక సంఘటనలు నాలో ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని నింపేవి. కేరళకు చెందిన గురుప్రసాద్  గ్వాలియర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పనిచేస్తారు. ఆయన నా రాక గురించి తెలుసుకుని ఆగ్రాలో నా కోసం ఎదురు చూస్తూ నన్ను ఆనందంగా ఆహ్వానించారు. ఆ కుటుంబం నన్ను చాలా ఆత్మీయంగా చూసుకోవడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అంటారు నాగరాజు.
 
ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్...
సాధారణంగా రికార్డు కోసం చేసే పర్యటనల్లో ఒకరు సైకిల్ మీద వెళ్తుంటే వెనుక మరో వాహనంలో సహాయకులు అనుసరిస్తుంటారు. కానీ నాగరాజు అలాంటి సహాయాలు తీసుకోకుండా పర్యటించారు. ‘‘ఏ రోజు ఎక్కడ పర్యటించాను, ఎవరెవరిని కలిశాననే వివరాలను రోజూ ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేస్తూ వచ్చాను. ‘టూర్ ఆఫ్ ఇండియా ఆన్ పెడల్ అండ్ శాడిల్’ పేరుతో నా సైకిల్ పర్యటన వివరాలుంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సాహసం చేయాలనుకునే వారికి నా ప్రయాణం గెడైన్స్ అవుతుంది’’ అన్నారు.
 
యాత్రకు తనను తాను...

రికార్డు యాత్రకు తనను తాను సిద్ధం చేసుకోవడం కీలకమైన విషయం. 2012లో మొదటిసారి హిమాలయ పర్వతప్రాంతంలో సైకిల్‌పై పర్యటించినప్పుడు నాగరాజు వేగం గంటకు పన్నెండు కిలోమీటర్లకు మించలేదు. దేశమంతా పర్యటించాలంటే కనీసం గంటకు పాతిక కిలోమీటర్ల వేగం తప్పదని నిర్ణయించుకున్న తర్వాత వేగం పెంచడం మీద దృష్టి పెట్టారు. ఏడెనిమిది నెలలపాటు శ్రమించాక వేగం పెరగడంతోపాటు ఆగకుండా యాభై కిలోమీటర్లు ప్రయాణించే శక్తి వచ్చింది.
 
ప్రయాణంలో పదనిసలు...

సాహసయాత్ర చేయాలనుకునే వారికి ‘‘వాతావరణ పరిస్థితులకు వెరవకుండా ఎవరికి వారు తమ మీద తామే విశ్వాసంతో ముందుకు సాగిపోవాల’’ని చెబుతారు నాగరాజు. సమాచారం విస్తృతంగా ఉన్న నేటి రోజుల్లో గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. గిన్నిస్ రికార్డు వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తే సమగ్రమైన సమాచారం తెలుస్తుంది. అదే దిక్సూచి అని ప్రోత్సహిస్తున్నారాయన.
 
అందమైన నా దేశం!
మన దేశంలో ప్రతి ప్రాంతం దానికంటూ ఒక అందాన్ని సొంతం చేసుకున్న అందమైన ప్రదేశమే. ఈ పర్యటనలో ప్రతి క్షణాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ సంతోషంగా ఆస్వాదించాను. నా ప్రయాణంలో బీహార్, పశ్చిమబెంగాల్ రోడ్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాయి. వాతావరణ పరంగానాకు చాలెంజ్‌గా నిలిచింది గుజరాత్ - ఒరిస్సా మధ్య నాలుగువేల కి.మీ.ల ప్రయాణం. విపరీతమైన చలి, మంచు కారణంగా ఒంట్లో నుంచి వణుకు పుట్టేది. ఉత్తర ప్రదేశ్ వాళ్ల మాట కరుకుదనంతో మనసుకు ఇబ్బంది కలిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు సైకిల్ మీద హెల్మెట్ ధరించి వెళ్లడాన్ని చూసి పెద్దగా నవ్వారు.
 - ఆర్కాట్ నాగరాజు

Advertisement

తప్పక చదవండి

Advertisement