డయాబెటిక్ కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

డయాబెటిక్ కౌన్సెలింగ్

Published Mon, Jun 15 2015 10:49 PM

Diabetic counseling

మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా టాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి.
- సురేఖ, మంచిర్యాల

డయాబెటిస్ (టైప్-2) తొలిదశల్లో అంటే ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతో పాటు అందులో కొవ్వులు, ప్రోటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహారనియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఇన్సులిన్ టాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి.
 
నా వయసు 27. జీటీటీ టెస్ట్‌లో షుగర్ ఉన్నట్లుగా వచ్చింది. కానీ హెచ్‌బీఏ1సీ పరీక్షలో మాత్రం నార్మల్ వచ్చింది. అయినా ప్రస్తుతం నేను గ్లైకోమెట్-500 మి.గ్రా. టాబ్లెట్లు రోజుకు రెండు వాడుతున్నాను. రోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- దివ్య, వరంగల్

మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవాలి. దీనికంటే ముందు మీరు మీ డయాబెటిక్ టాబ్లెట్లు ఆపేయండి. వీలైతే డయాబెటిస్‌ను నియంత్రించే ఆహారంతోనే మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ రీనల్ ఫంక్షన్ పరీక్షలు, హెచ్‌బీఏ1సీ పరీక్షలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండాలి. ఒకసారి గర్భం ధరించాక అవసరమైన అన్ని పరీక్షలతో పాటు మంచి ఫాలోఅప్ జరుగుతుండాలి. ఒకవేళ గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా చివరి మూడు నెలలలో చక్కెరపాళ్లు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు.
 
డాక్టర్ కె.డి. మోదీ
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement
Advertisement