మాడు పగిలి సంగీతం పాడుతోంది.. | Sakshi
Sakshi News home page

మాడు పగిలి సంగీతం పాడుతోంది..

Published Fri, Oct 2 2015 12:04 AM

మాడు పగిలి సంగీతం పాడుతోంది..

‘గూబ మీద ఒక్కటిచ్చానంటే గత జన్మ గుర్తుకు రావాలి మరి!’ అంటారు కోపంతో. కానీ డెరెక్ ఎమేటో అనే అమెరికన్ విషయంలో ఆ మాట నిజమే అయింది. మెదడుకు తగిలిన దెబ్బతో పూర్వజన్మ జ్ఞాపకం రాలేదుకానీ పూర్వంలేని జ్ఞానం వచ్చింది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన డెరెక్ ఎమేటో పుట్టి బుద్ధెరిగి సంగీతం నేర్చుకోలేదు. జీవితంలో ఏనాడూ సంగీత కచేరీకి హాజరు కాలేదు. కానీ ఇప్పుడు పియానో వాయించడంలో మహావిద్వాంసుడు. ఇది ఆయనకు అకస్మాత్తుగా అబ్బిన విద్య.
 ఎలాగంటే: 2006లో స్విమ్మింగ్‌పూల్‌లో డైవింగ్ చేస్తుంటే పూల్ అడుగు మాడుకు తగిలి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. సర్జరీ చేశారు. ప్రాణం దక్కింది కానీ 35 శాతం వినికిడి శక్తిని, కొంత జ్ఞాపక శక్తినీ కోల్పోయాడు.

కోలుకున్నాక ఒకసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆ ఫ్రెండ్‌కి పియానో వాయించడం హాబీ. స్నేహితుడితో మాట్లాడుతూ హఠాత్తుగా పియానో దగ్గరకు వెళ్లి దానిముందున్న స్టూల్ మీద కూర్చోని కీబోర్డ్ మీద అలవోకగా వేళ్లాడించడం మొదలుపెట్టాడు. అలా గంటసేపు పియానో ప్లే చేస్తూనే ఉన్నాడు. సరిగమల సంగతులు తెలియని ఎమేటో అకస్మాత్తుగా మనోహరమైన సంగీతం వినిపిస్తుంటే ఆశ్చర్యపోయాడట స్నేహితుడు. ‘అలా కళ్లు మూసుకున్నానో లేదో నేను వాయించాల్సిన నోట్ నా ముందు ప్రత్యక్షమైంది.. వాయిస్తూ పోయాను’ అంటాడు ఎమేటో నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. నాటి నుంచి నేటి వరకు ఆ సంగీత ఝరి ఆగలేదు. ఇప్పుడు అతను మ్యూజిక్ మేస్ట్రోగా ఫేమస్.

ఎందుకలా?: తన ఆకస్మిక సంగీత జ్ఞానానికి తనే కాదు తన కుటుంబ సభ్యులు, స్నేహితులూ అబ్బురపడ్తున్నారు. ఈ ఆకస్మిక జ్ఞానానికి కారణం ఎమేటోకి వచ్చిన ఎక్వైర్డ్ సేవెంట్ సిండ్రోమ్ అనే జబ్బని చెప్తున్నాడు డాక్టర్ ఆండ్య్రూ రీవ్స్. స్విమ్మింగ్‌పూల్‌లో ఎమేటో తలకు తగిలిన దెబ్బ వల్లే ఈ జబ్బు వచ్చిందట. ఇది చాలా అరుదైన వ్యాధి అని అంటున్నాడు డాక్టర్ రీవ్స్. సైన్స్ ఛానల్ డాక్యుమెంటరీ అయితే ఈ జబ్బువల్ల సంగీత పరిజ్ఞానం పొందిన వాళ్లలో ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎమేటో అని తేల్చిచెప్పింది.
 
 

Advertisement
Advertisement