జాలి వద్దు...నమ్మకం కావాలి! | Sakshi
Sakshi News home page

జాలి వద్దు...నమ్మకం కావాలి!

Published Sun, Sep 7 2014 11:47 PM

జాలి వద్దు...నమ్మకం కావాలి! - Sakshi

వైకల్యం అభివృద్ధికి అవరోధమని ఎవరన్నారు? టింగిర్‌కర్ వెంకటేష్‌ని చూస్తే తెలుస్తుంది... ఆ మాట ఏ మాత్రం నిజం కాదని. కంటిచూపు కరువైనా దాని గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అంధత్వాన్ని తన గమ్యానికి అడ్డు కానివ్వలేదు. పీజీ చేశాడు. పీహెచ్‌డీ చేయబోతున్నాడు. ఎఫ్.ఎం. రెయిన్‌బోలో ఆర్జేగా ఎంపికయ్యాడు. దేశంలోనే తొలి బ్లైండ్ ఆర్జేగా రికార్డు సృష్టించాడు. గెలవడానికి ఏదీ అడ్డంకి కాదనే వెంకటేష్ తన అంతరంగాన్ని ఇలా సాక్షి ముందు పరిచాడు...
 
‘నేనిది చేయగలనా?’... నా జీవితంలో తొలిసారిగా వేసుకున్నాను నేనా ప్రశ్నని. ఎప్పుడూ ఎందుకు చేయలేను అనుకునేవాడిని. కానీ ఆ రోజు మాత్రం కాస్త జంకాను. ఆలిండియా రేడియో ఎఫ్.ఎం.రెయిన్‌బోలో ఆర్జేల ఎంపిక జరుగుతోంది. నేనూ ఆడిషన్‌కి వెళ్లాను. వెళ్లినప్పట్నుంచీ ఒకటే సంశయం... నేను బాగా చేయగలనా లేదా అని. మూడు టాపిక్స్ చెప్పారు. ప్రిపేరవమని అందరికీ పేపర్లు, పెన్నులు ఇచ్చారు. కానీ వాటిని నేనేం చేసుకోగలను! నేను చెబితే రాయడానికి కూడా నాతో ఎవరూ రాలేదు. దాంతో మనసులోనే ప్రిపేరయ్యాను. ఆడిషన్‌కి పిలవగానే వెళ్లి చెప్పేశాను. ఎలా చెప్పానో తెలియదు. ఎంపికవుతానో లేదో కూడా తెలియదు. రిజల్ట్ వచ్చేవరకూ ఒకటే టెన్షన్. మార్చి 21, 2014న ఫోన్ వచ్చింది సెలెక్ట్ అయ్యానని. నా ఆనందానికి అవధులు లేవు.
 
ఎక్కడో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ అనే చిన్న ఊళ్లో పుట్టాను. నాన్న రాజయ్య రైతు. అమ్మ గిరిజ గృహిణి. పుట్టుకతోనే చీకటిని వెంటబెట్టుకుని వచ్చాను. నాకు చూపు లేదని తెలిసి అమ్మానాన్నలు కుమిలి పోయారు. కానీ నేను ఏరోజూ నా వైకల్యాన్ని చూసి బాధపడలేదు. మొదట్నుంచీ ఒకటే ఆలోచన. మామూలు వాళ్లకు నేనేమీ తీసిపోనని నిరూపించాలని. అందుకే కష్టపడి చదివాను. ఎం.ఏ.తెలుగు లిటరేచర్ చేశాను. సాహిత్యమంటే ప్రాణం. ఆ ఆసక్తి నాతో కలం కూడా పట్టించింది. కవితలు రాయడం మొదలు పెట్టాను.

హైదరాబాద్‌లోని ఓ ఫౌండేషన్‌లో చేరిన తర్వాత, వాళ్లు చేసే సంగీత కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం మొదలుపెట్టాను. 2011లో ఓసారి ఆలిండియా రేడియో ‘ఎ’లో సీనియర్ అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి గారితో కలిసి ఓ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ లేకుండా చకచకా మాట్లాడ్డం చూసి ఇంప్రెస్ అయిపోయారావిడ. తర్వాత ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ిపిలిచేవారు. ఇద్దరం కలిసి చాలా కార్య క్రమాలకు యాంకరింగ్ చేశాం. తను రాసిన ‘ధిక్కార’ అనే పుస్తకంలో నాతో ఓ ఆర్టికల్ కూడా రాయించారావిడ! నన్ను రెయిన్‌బోకి అప్లై చేయమని ఆవిడే చెప్పారు. ఆవిడ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యపడింది.
 
ఎంపిక యినందుకు ఆనందమే. కానీ తర్వాత ఎలా! ఈ ప్రశ్న నన్ను తొలిచేసింది. ఎందుకంటే గడగడా మాట్లాడేస్తే చాలదు. కన్సోల్‌ని ఆపరేట్ చేయాలి. కానీ నేనెలా చేయగలను? అదృష్టంకొద్దీ మా ఇన్‌చార్‌‌జ శ్రీనివాసరెడ్డిగారు నా బాధను అర్థం చేసుకున్నారు. ఎవరినైనా తోడు తెచ్చుకోమన్నారు. దాంతో మా తమ్ముడు రవికాంత్‌ని తీసుకెళ్లాను. తనకి కన్సోల్ ఆపరేషన్‌లో తర్ఫీదునిచ్చారు. తన సాయంతోనే ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను. ప్రతి ఆదివారం రాత్రీ ‘సరాగమాల’ పేరుతో నేను చేస్తోన్న పాత పాటల విశ్లేషణ అందరికీ నచ్చుతోంది. నాకు బోలెడు కాంప్లిమెంట్స్ తెచ్చిపెడుతోంది.
 
మన దేశంలోనే నేను తొలి బ్లైండ్ ఆర్జేనని తెలిసి ఆశ్చర్యపోయాను. నిజానికి నాకు టెలివిజన్ యాంకర్‌గా కూడా చేయాలని ఉంది. కానీ అదంత తేలిక కాకపోవచ్చు. అందాన్నే కొలమానంగా తీసుకుంటే నాకా అవకాశం రాకపోవచ్చు. అదే నా ప్రతిభను మాత్రమే చూస్తే మాత్రం ఏదో ఒకరోజు అదీ సాధిస్తాను. నేను అందరికీ ఒక్కటే చెబుతాను. అంధత్వం శాపమని మేం అనుకోవడం లేదు. ఏదైనా సాధించగలమని అను కుంటున్నాం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని వేరేలా చూడకండి. చాన్‌‌స ఇవ్వండి చాలు... మేమేంటో చూపిస్తాం. మాకు జాలి వద్దు. నమ్మకం కావాలి. అయ్యో పాపం అనేవాళ్లు కాదు, అవకాశాలిచ్చేవాళ్లు కావాలి. అలాగే నాలాంటి వాళ్లందరికీ ఓ విజ్ఞప్తి. న్యూనతను వీడండి. మీ బలాన్ని నమ్మండి. గెలిచి చూపించండి!
 

Advertisement
Advertisement