తీశాక చూస్తే మీటూ అయింది!

5 Nov, 2018 00:55 IST|Sakshi

డాక్యుమెంటరీ / బట్‌ వాట్‌ వజ్‌ షి వేరింగ్‌

వైష్ణవి సుందర్‌. వయసు 32. ఫిల్మ్‌ మేకర్‌. చెన్నైలో ఉంటారు. యాక్టివిస్టు, రచయిత్రి కూడా. ఇప్పటికే నాలుగు చిత్రాలు తీశారు వైష్ణవి. ఇప్పుడొక డాక్యుమెంటరీ తీశారు. అదే.. ‘బట్‌ వాట్‌ వజ్‌ షి వేరింగ్‌’. ఎక్కువ నిడివి గల డాక్యుమెంటరీ. దీర్ఘచిత్రం అనొచ్చు. ఇందులో.. ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులకు గురైన 32 మంది మహిళల గురించి చెప్పారు. నవంబరు 3 న చెన్నైలోని మాక్స్‌ ముల్లర్‌ భవన్‌లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మీ టూ ఉద్యమం మొదలవడానికి వైష్ణవి చిత్రీకరించిన మీ టూ కథలు, వ్యథలే ఇవన్నీ!


‘బట్‌ వాట్‌ వజ్‌ షి వేరింగ్‌’.. డాక్యుమెంటరీనే అయినప్పటికీ చిత్రం అనే అనాలి. 2013 లో వచ్చిన లైంగిక వేధింపుల (వర్క్‌ప్లేస్‌లో) నిరోధక చట్టాన్ని ఆధారంగా ఈ దీర్ఘచిత్రం నడుస్తుంది. అప్పట్లో ఉద్యోగాల్లో పురుషుల వల్ల ఇబ్బందులకు గురైన మహిళలు ఆ విషయాన్ని బయటకు చెప్పాలంటే భయపడేవారు. అవమానంగా భావించేవారు. మీ టూ వచ్చాక ఇప్పుడు కొంత నయం అయింది.

ఇందులో వైష్ణవి సుందర్‌ ప్రధానంగా న్యాయపరమైన అంశాలను చూపారు. సుప్రీంకోర్టు 1997లో ఇచ్చిన విశాఖ గైడ్‌ లైన్స్‌ని కూడా ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులను విచారించడంలోని మార్గదర్శకాలవి. 110 నిమిషాల నిడివిలో ఉన్న ఈ చిత్రాన్ని 17 సెగ్మెంట్లుగా విడగొట్టారు వైష్ణవి. చట్టానికి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు.  మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి చర్చించారు. లైంగిక వేధింపుల కారణంగా మహిళల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బ తింటోందో కూడా తెలియచెప్పారు.

చట్టం ఏం సాధించింది?
డాక్యుమెంటరీ కోసం  వైష్ణవి ముప్పై రెండు మందిని ఇంటర్వ్యూ చేశారు. సమాజంలో రకరకాల సామాజిక, ఆర్థిక, వృత్తుల విభాగాలకు చెందిన వారిని ఇందులో ప్రశ్నించారు. కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారు, కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారికి చేరువగా ఉన్నవారు సంభాషించారు. వీరంతా ^è ట్టానికీ, చట్టాన్ని అమలు చేయడానికి ఉన్న తేడా గురించి మాట్లాడారు. చట్టం ఏం సాధించింది అని ముందుగా ప్రశ్నించారు డాక్యుమెంటరీలో. ఇందులో ఒక విభాగానికి ‘‘దేర్‌ ఈజ్‌ యాక్ట్‌ నౌ, బట్‌ ఈజ్‌ దేర్‌ ఎ సొల్యూషన్‌’ అని పెట్టారు.

‘మీ టూ’ కథలే ఇవన్నీ!!
‘‘డాక్యుమెంటరీ తీయాలనుకున్నప్పుడు నాకు ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. నాలో పరిశోధనాత్మక లక్షణం ఉండటంతో ఈ విధంగా రూపొందించాను’’ అంటారు వైష్ణవి. చిత్రీకరణ కోసం సుందర్‌ 2016లో పరిశోధన ప్రారంభించిన ప్పుడు తన పరిశోధన ఇప్పటి ‘మీ టూ’తో యాదృచ్ఛింగా కలుస్తుందని ఆమెకెలా తెలుస్తుంది?  ‘‘నా డాక్యుమెంటరీ చూసి... ఇది టైమ్‌లీగా ఉంది అంటున్నారు. పది సంవత్సరాల క్రితమే ఉద్యోగ ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ విడుదల కావడం అంతా కో ఇన్‌సైడ్‌’’ అంటారు వైష్ణవి. డాక్యుమెంటరీ తీయడానికి ఫండింగ్‌ పెద్ద సమస్య అయ్యింది వైష్ణవికి.

ఫండింగ్‌ రాని థీమ్‌!
‘నేను గతంలో తీసిన సినిమాలకు ఫండింగ్‌ బాగా వచ్చింది. చాలామందిని స్వయంగా కలిసి అడిగాను. కాని ఈ దీర్ఘచిత్రం లైంగిక వేధింపుల అంశం కావడంతో అడగడానికి కొంచెం మొహమాటపడ్డాను. అదొక్కటే కాదు, మహిళలకి సంబంధించిన అంశాలకు ఫండింగ్‌ రావడం కూడా కష్టమే. దీని నిర్మాణానికి విరాళాలు అడిగినప్పుడు నాకు 100 రూ. 50 రూ. 10 రూ. వచ్చాయి. ప్రతి రూపాయినీ బ్యాంకులో జమ చేశాను.

పది వేలు కాని, ఐదు వేలుకాని వస్తే డాక్యుమెంటరీ తీయడం సులభం అయ్యేది కాని, పది రూపాయల చొప్పున పోగు చేయడం వల్ల కాస్త ఇబ్బంది అనిపించింది’’ అంటారు వైష్ణవి. ఇందులో వైష్ణవి చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ బ్యాక్‌గ్రౌండ్‌ నలుపు రంగు వేశారు. ఇలా వేయడం వలన అందరినీ సమానంగా చూపినట్టు అవుతుందని ఆమె భావించారు.

మనసు విప్పి మాట్లాడారు
‘‘ఒక సీఈవో మాట్లాడుతున్నప్పుడు ఆమె పని చేసే చోటును చూపలేదు. ఇక్కడ అది ప్రధానం కాదు. వారి సమస్యను ఫోకస్‌ చేయాలే కాని, వారి ఉద్యోగ ప్రదేశం కాదని భావించాను’’ అని వైష్ణవి సమాధానం. బాధితులు సామాన్యులైతేనేం, కోటీశ్వరులైతేనేం అనే భావనతోనే ఈ విధంగా చూపారు ఆమె. అలాగే బాధితులను టైట్‌ ఫ్రేమ్స్‌లో చూపారు. ‘‘వారు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకంటే వారు మనతో మాట్లాడుతున్నంత చక్కగా వివరాలు చెప్పారు’’ అంటారామె. ఈ డాక్యుమెంటరీలో అందరూ మహిళలే పనిచేయడం విశేషం.  


– జయంతి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు