నీళ్లు తాగి వాళ్లు... కన్నీళ్లు తాగి నేను... | Sakshi
Sakshi News home page

నీళ్లు తాగి వాళ్లు... కన్నీళ్లు తాగి నేను...

Published Tue, Feb 3 2015 11:40 PM

నీళ్లు తాగి వాళ్లు...  కన్నీళ్లు తాగి నేను...

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!


సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...

అంతవరకూ వేగంగా పరుగులు తీసిన రైలు తన వేగాన్ని తగ్గించింది. పరుగును నడకగా మార్చి స్టేషన్‌ను చేరుకోవడానికి నెమ్మదిగా సాగుతోంది. నరసాపురం అన్న బోర్డు చూడగానే నా మనసులో కాసింత ఆనందం, కాసింత ఆందోళన. రైలు ఆగింది. నాలో ఉద్వేగం పెరిగింది. నలిగి చిరగడానికి సిద్ధంగా ఉన్న కాటన్ చీరను భుజాల చుట్టూ కప్పుకుని, ఓ చేతితో పాత సూట్‌కేసు, ఇంకో చేతితో పర్సు పట్టుకుని తలుపు వైపు నడిచాను. ప్లాట్‌ఫామ్ మీద అడుగు పెడుతుంటే నా కాళ్లు సన్నగా వణకడం నాకు తెలుస్తోంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనన్న చింతన నన్ను చిత్రవధ చేస్తోంది. భావోద్వేగాలను అదిమిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నా కళ్లు ఆతృతగా స్టేషన్ అంతా కలియజూస్తున్నాయి. నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని చూడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అంతలో వెనుక నుంచి నా భుజమ్మీద చేయి పడింది. అది నాకు బాగా పరిచయమైన స్పర్శ. ఠక్కున వెనక్కి తిరిగాను. మాసిన గడ్డం, నలిగిన దుస్తులు, ముఖంలో దైన్యత, కళ్ల నిండా దిగులు... తన అంగవైకల్యానికి సాక్ష్యంగా చొక్కా కుడి చేయి, ప్యాంటు ఎడమ కాలు గాలికి ఎగురుతున్నాయి. ఒక్క అంగలో వెళ్లి తనని హత్తుకుపోయాను. గుండెల్లోని వేదన కరిగి కళ్ల నుంచి పొంగు తుంటే నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగాను. నన్ను ఎలా ఓదార్చాలో తెలియక తను మౌనం వహించాడు. తనకి ఏమి చెప్పాలో తెలియక నేను మూగబొమ్మనయ్యాను. అయినా ఏం చెప్పగలను? నా పట్ల ఏం జరిగిందో, నా బతుకు ఏ విధంగా నలిగిపోయిందో తనతో ఎలా చెప్పగలను?!

 ఆకాశానికి ఎగరాలని కొందరు ఉవ్విళ్లూరుతారు. నేలమీద నిశ్చింతగా నిలబడగలిగే చోటుంటే చాలని కొందరనుకుంటారు. రెండోకోవకు చెందినదాన్ని నేను. ఉన్నదాంట్లో తృప్తిగా బతికేస్తే చాలనుకుంటాను. అందుకే ఏనాడూ ఏదీ లేదని చింతించలేదు. నిజానికి సంతోషించడానికి కూడా మా దగ్గరేం లేదు. ట్రక్కు డ్రైవరైన నా భర్త సంపాదన మాకు విలాసాలనివ్వలేకపోయినా, వేళకింత అన్నం పెట్టేది. సంపద లేకపోయినా జీవితం సంతోషంగానే సాగిపోయేది. కానీ అది కూడా కంటగింపుగా అనిపించిందో ఏమో ఆ దేవుడికి... ఒక్కసారిగా మా జీవితాలను చిందరవందర చేశాడు.

ఓ రోడ్డు ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఒక చేయి, కాలు తీసేశారు డాక్టర్లు. దాంతో మా బతుకులు అతలాకుతలమైపోయాయి. నాకా ఉద్యోగం చేసేంత చదువు లేదు. అలా అని భర్తని, ముగ్గురు పిల్లల్నీ ఆకలికి బలిపెట్టలేను. అందుకే మొదటిసారి గడప దాటాను. పొలం గట్ల మీద పరుగులు తీశాను. ఎండలో ఎండాను. వానలో తడిశాను. ఎలాగైనా కుటుంబాన్ని నెట్టుకు రావాలని తపించాను. కానీ ఎంత కష్టపడినా మా కడుపుల్లో ఎప్పుడూ కాసింత ఖాళీ ఉంటూనే ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చాడు రాజు... మా పెదనాన్న కొడుకు. ‘కొయిటా ఎల్లిపోవే అక్కా, కస్టాలు తీరతాయి’ అన్నాడు. ఏజెంట్‌కి ఓ ముప్ఫై వేలు ఇస్తే దుబాయ్ పంసిస్తాడనీ, నెలకు ఇరవై వేల జీతం వస్తుంది కాబట్టి జీవితం మారిపోతుందనీ చెప్పాడు. అది మా కష్టాలు తీరడానికి దొరికిన అవకాశంలా తోచడంతో తటపటాయించకుండా తలూపేశాను. ఉన్న చిన్న గుడిసెనీ తాకట్టు పెట్టేసి, ఏజెంటుకు ముప్ఫై వేలు కట్టేశాను. కళ్లు మూసి తెరిచేలోగా వీసా వచ్చేసింది. నన్ను తీసుకెళ్లి దుబాయ్‌లోని ఓ ఇంట్లో వదిలిపెట్టింది.
 కోటీశ్వరుడైన సేఠ్ ఇల్లు అది. ఇంటిపని చేయడానికి ఇద్దరు నౌకర్లున్నారు. నేను వంట చేస్తే చాలు అన్నాడు. నిజమనుకున్నాను. కానీ వారం తిరిగేసరికి ఇద్దరు పనివాళ్లూ మానేశారు.

కాదు, సేఠ్ మాన్పించే శాడు. వాళ్ల పనీ నన్నే చేయమన్నాడు. అతడి చెప్పులు తుడవడం దగ్గర్నుంచి బాత్రూమ్ కడగడం వరకూ నాదే బాధ్యత. పది రోజుల్లో ఒళ్లు హూనమైపోయింది. నీరసం ముంచుకొచ్చింది. కానీ అవన్నీ ఆ సేఠ్‌కి నచ్చని లక్షణాలు. కూర్చుని కనిపిస్తే అరిచేవాడు. ఏదో ఒక పని పురమాయించేవాడు. దానికి తోడు రెండు రోజులకోసారి ఫ్రెండ్స్‌కి ఇంట్లో పార్టీలు ఇచ్చేవాడు. అతడి సరదాలు నా శరీరానికి చిత్రహింసలు. విశ్రాంతి అన్న మాటకు స్థానం లేదు. రోగమొచ్చినా మందూ మాకూ కోరకూడదు. కోరుకున్న కొయిటా ఉద్యోగం కొలిమిలాంటిదని అర్థమవడానికి ఎంతోకాలం పట్టలేదు. అయినా భరించాను. వికలాంగుడైన నా భర్త, జాలిగొలిపే నా పిల్లల ముఖాలు గుర్తొచ్చి సహించాను. కానీ నా జీవితం మరింత దిగజారిపోతుందని ఊహించలేదు. ఉన్నట్టుండి ఒకరోజు సేఠ్ పశువులా మీద పడ్డాడు. తన కోరిక తీర్చాలన్నాడు. కాదంటే కొట్టాడు. పని చేయడానికి వచ్చిన తర్వాత ఏ పనయినా చేయాలంటూ నియమాలు బోధించాడు. మొండికేస్తే దొంగతనం కేసులో ఇరికిస్తానన్నాడు. జీవితాంతం జైల్లో పడేయిస్తానన్నాడు. నా ఆత్మాభిమానం నన్ను లొంగనివ్వకపోయినా, అతడి పశుబలం నన్ను వశం చేసుకుంది. నా బతుకును కాలరాసింది.

ఆ క్షణమే నేను ఆడదానిగా చచ్చిపోయాను. కానీ ఓ భార్యగా, తల్లిగా నా బాధ్యత గుర్తుకొచ్చి జీవచ్ఛవంలా బతికున్నాను. కానీ నా సహనం మావాళ్ల కడుపులు నింపలేదు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు సేఠ్. అడిగితే అరిచేవాడు. అర్థిస్తే అవమానించేవాడు. ఓ పక్క నావాళ్లు ఎలా బతుకుతున్నారో అన్న దిగులు... మరోపక్క నా తనువు, జీవితం సేఠ్ చేతుల్లో నలిగిపోతున్నాయన్న వేదన... ఎన్నాళ్లు అలా చావలేక బతికానో చెప్పలేను. చివరికి శరీరం పట్టు తప్పింది. ఆరోగ్యం అదుపు తప్పింది. మంచం మీది నుంచి లేవడం గగనమైంది. దాంతో నేనిక తనకి పనికి రాను తీసుకుపొమ్మని ఏజెంట్‌తో చెప్పాడు సేఠ్. హైదరాబాద్ నుంచి నరసాపురం వెళ్లడానికి రైలు చార్జీలు చేతిలో పెట్టి, నన్ను విమానమెక్కించేశాడు ఏజెంట్. సంతోషంగా వెళ్లిన నేను, సర్వం కోల్పోయి వచ్చాను. నిస్సహాయంగా నా భర్తను పిల్లల్ని చేరుకున్నాను. అక్కడ పడిన యాతనకి నా శరీరం ఇప్పటికీ సలుపుతూనే ఉంది. అక్కడ జరిగిన అవమానాలకి నా మనసు నేటికీ బాధతో మూలుగుతూనే ఉంది. దేనికోసం వెళ్లానో, దేనికోసం అంతటి హింసనూ అనుభవించానో దానికి ఫలితం లేకుండా పోయింది. మా వాళ్లకు నేను చేసిందేమీ లేదు. మా కష్టాలు తీరిందీ లేదు. అదే పేదరికం. అదే ఆకలి. కనీసం ఇంతకుముందులా కూలిపని చేసుకుందామన్నా నలిగిపోయిన నా దేహం సహకరించడం లేదు. అప్పు పుట్టిన పూట భోజనం. లేని పూట పస్తు. ఎన్నో పూటలు నా భర్త, పిల్లలు నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంటే... నేను నా కన్నీళ్లు తాగుతూ బతుకీడుస్తున్నాను. అంతకంటే ఏం చేయగలను!!
 - జయ, తూ.గో. జిల్లా (గోప్యత కోసం పేర్లు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి

Advertisement
Advertisement