ఎర్త్ టు ఎర్త్ యాషెస్ టు యాషెస్ డస్ట్ టు డస్ట్ | Sakshi
Sakshi News home page

ఎర్త్ టు ఎర్త్ యాషెస్ టు యాషెస్ డస్ట్ టు డస్ట్

Published Sun, Aug 30 2015 11:10 PM

ఎర్త్ టు ఎర్త్  యాషెస్ టు యాషెస్  డస్ట్ టు డస్ట్ - Sakshi

మార్సీ బార్డర్స్ ఎవరో సెప్టెంబర్ 11, 2001కి ముందు ఎవరికీ తెలియదు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట శిఖరాలను కుప్పకూల్చినప్పుడు శకలాల దుమ్ము ఆమెను కప్పేసింది. ధూళి నిండిన ఆమె ఫోటో ప్రపంచమంతా ఫ్లాష్ అయింది. అప్పటి నుంచీ ఆమెను డస్ట్ లేడీ అంటున్నారు.ఆమె శకలాల ధూళి వల్ల క్యాన్సర్ వచ్చి గత వారమే చనిపోయింది. ఉగ్రవాద భూతం చచ్చిన వాళ్లను ఎలాగో చంపేసింది. చావని వాళ్లను కూడా ఎలా చంపుతుందో డస్ట్ లేడీ విషాదాంతం చెబుతుంది.
 
వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు) పుట్టినప్పుడు వామనుడిలా అమెరికాలోనే ఉండేది. ఇప్పుడది త్రివిక్రముడై మూడో పాదం ఎక్కడ మోపాలి అని ప్రశ్నిస్తోంది. పిడికిట్లో పట్టే సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా గుప్పెట్లో ఉన్నట్టే. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రేయసిలా కళ్లలో కళ్లు పెట్టి చూసే డెస్క్ టాప్, ఒళ్లో గువ్వలా ఒదిగి కూచునే లాప్ టాప్, పుస్తకమంత ఉండి ప్రపంచమంతా మోసే టాబ్లెట్లు, అరచేతిలో అఖిల విశ్వాన్ని చూసే మొబైల్స్ మనకు క్షణాల్లో చెప్పేస్తున్నాయి. అక్కడ్నుంచి, ఇక్కడ్నుంచి, ఎక్కడెక్కడ్నుంచో
 మీ కోసం పోగేసిన కాసిని నెట్టింటి కబుర్లు... ఇవిగో...
 
 సల్మాన్ ఖాన్ సే  షాదీ కరూంగీ!
 సోమీ అలీ, సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కతినా కైఫ్‌లు చేయలేని పనిని చేసేస్తానంటోంది ఈ మూడేళ్ల పాప. ఎక్కడిదో తెలియదు కానీ ఈ పిడుగులాంటి పిల్ల సల్మాన్ సే షాదీ కరూంగీ అంటోంది. షాదీ అంటే హ్యాపీ బర్త్ డే లాంటిదని కూడా మనబోంట్లకు విడమర్చి చెబుతోంది. ఈ బుల్లిపాప మన చుల్ బుల్ పాండేకి గిలిగింత పెట్టేసింది. అంతే! ఆయన లవ్లీ సింగ్‌గా మారిపోయాడు. సల్మాన్ ఖాన్ ఈ పిడుగు పంపిన విడియో పాలిట ‘షేర్’ ఖాన్‌గా మారిపోయాడు. వేల లైక్‌లతో గోలగోలగా ఉన్న ఈ విడియోను https://www.youtube.com/watch? v=S1GTnIAgNu0చూడండి.
 
జస్లీన్ వర్సెస్ సరబ్ జీత్

సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తితో కూరగాయలూ తరగొచ్చు. తలలూ తరగొచ్చు. ఢిల్లీకి జస్లీన్ కౌర్‌కి ఈ విషయం బాగానే తెలిసి వచ్చింది. వీధిలో గిల్లి కజ్జాని మొబైల్ ఫోన్ మసాలా, ఫేస్ బుక్ తాలింపూ దట్టించి సరబ్ జీత్ అనే కుర్రాడిని కూర వండేసింది. సరబ్ జీత్ తన వాదనను వినిపించేలోగానే టీవీ ఛానెళ్లు ఆయనకి శిక్ష వేసేశాయి. కానీ మరుసటి రోజే కథలో ట్విస్ట్ వచ్చేసింది. అసలు జస్లీనే సరబ్ జీత్‌ని తిట్టిందని, కుర్రాడు అంత తప్పేమీ చేయలేదని బయటపడింది. నిన్నటిదాకా ఆమె వీరనారి అన్న నరంలేని నాలుకలు ఒక్క క్షణంలో మాట మార్చేశాయి. దీంతో జస్లీన్ ఏకంగా ఫేస్ బుక్ అకౌంట్‌నే క్లోజ్ చేసేసుకోవాల్సి వచ్చింది.
 
ఛమ్కీ గిమ్కీ పెట్టేస్కోనీ ... షాదీ గీదీ చేసేస్కోనీ ....
పెళ్లంటే నూరేళ్ల పంటే కాదు. వెయ్యింతల వెరైటీగా కూడా ఉండాలనుకుంటారు చాలామంది. అనూహ్య ప్రదేశాల్లో అద్భుత వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్లకి ఆస్ట్రేలియాకి చెందిన జూన్ బగ్ అనే వెడ్డింగ్ ప్లానర్ గొప్ప గొప్ప అయిడియాలు ఇస్తోంది. ఆ జూన్ బగ్ ప్రతి ఏటా స్టన్నింగ్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఫోటో కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది అవార్డు విన్నింగ్ వెడ్డింగ్ ప్రదేశాల ఫొటోలు రిలీజయ్యాయి. ఇప్పటికే 3.51 లక్షల మంది చూశారు. http://junebugweddings.com/పై క్లిక్ చేసి చూడండి. చూస్తే ఖాయంగా మళ్లీ పెళ్లి చేసేసుకోవాలనిపిస్తోంది.
 
ఇది ఇంద్రాణి వారం

పోయిన వారం రాధేమా వారం అయితే ఈ వారం ఇంద్రాణీ ముఖర్జీ వారం. ఇంద్రాణికి మూడుసార్లు పెళ్లయింది. షీనా ఇంద్రాణికి కూతురు. కానీ పీటర్ ఆమెకి తండ్రి కాడు. మిఖైల్ షీనాకి సోదరుడు. కానీ సంజీవ్ ఖన్నా అతనికి తండ్రి కాడు. షీనా ఇంద్రాణికి చెల్లెలు కూడా. కానీ రాహుల్ ఇంద్రాణి మొదటి భర్తకి కుమారుడు కాడు. రాహుల్ మిఖైల్‌కి సోదరుడు కాడు. కానీ షీనాతో లవ్‌లో ఉన్నాడు. విధి సంజీవ్ ఖన్నా కూతురు. కానీ రాహుల్ ఆమెకి అన్న కాదు. షీనా పదిహేనేళ్లకే ఇంద్రాణికి పుట్టింది. ఇంతకీ దాస్ వయసెంత? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసీ చెప్పకపోతే మీ తల వెయ్యి వక్కలవుతుంది.

Advertisement
Advertisement