ఎడిసన్ ఉప్పు ఫార్ములా! | Sakshi
Sakshi News home page

ఎడిసన్ ఉప్పు ఫార్ములా!

Published Sun, Mar 2 2014 11:03 PM

ఎడిసన్ ఉప్పు ఫార్ములా!

సమస్యను కొత్త కోణంలో చూడండి విద్యుత్ బల్బుతోపాటు ఎన్నో వస్తువులను కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన అమెరికా పరిశోధకుడు థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా భిన్నంగా ఉండేది. తన పరిశోధనలకు అవసరమైన సహాయకులను ఎడిసన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తూ ఉండేవారు. మొదట సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత.. తనకు తగిన అభ్యర్థి అనిపిస్తే అతడిని భోజనానికి తీసుకెళ్లేవారు. ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉండేది. భోజనం వచ్చిన తర్వాత ఎడిసన్ కొంత తీసుకొని నోట్లో వేసుకొనేవారు.

ఈ ఆహారంలో ఉప్పు సరిపోలేదనుకుంటా! అంటూ అభ్యర్థిని నిశితంగా పరిశీలించేవారు. అప్పుడు సదరు అభ్యర్థి కూడా కొంత భోజనాన్ని రుచి చూసి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెబితే అతడు ఎంపికైనట్లే. కానీ రుచి చూడకుండానే ఉప్పును కలుపుకుంటే.. ఇంటి ముఖం పట్టాల్సిందే. మనుషుల మనస్తత్వం ఎడిసన్‌కు బాగా తెలుసు. మానవులు సాధారణంగా ఇతరులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా అంశంపై తమకు తగిన అనుభవం, పరిజ్ఞానం లేకపోయినా దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాన్నే అనుసరిస్తుంటారు.

తమకు ఎదురైన సమస్యను కొత్త కోణంలో చూడడం, దాని పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం ఎక్కువ మందికి అలవాటు లేని పని. మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోతే.. ఇక దాన్ని ఎప్పటికీ వదులుకోరు. ఇతరుల ఆలోచనలను అనుసరించకుండా సొంతంగా ఆలోచించే వ్యక్తుల కోసం ఎడిసన్ గాలిస్తూ ఉండేవారు.
 
ప్రయత్నమే మూలాధారం

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు రావాలంటే చాలా కష్టం.. అని మీ స్నేహితులు మీకు చెప్పే ఉంటారు. దాంతో మీరు అది నిజమేననుకుంటారు. మీ ఆలోచనలు అలాగే మారిపోతాయి. ఐఐటీలో సీటు మనకెక్కడ వస్తుందిలే అని తీర్మానించుకుంటారు. ‘సీటు తెచ్చుకోవడం నా వల్ల కాదు’ అనే దృక్పథం మీలో బలంగా ఏర్పడుతుంది. ఐఐటీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కూడా సంకోచిస్తారు. ఇతరులెవరో సాధించలేదు కాబట్టి మీరు కూడా సాధించలేరని అనుకుంటారు. అలా అనుకోవడం తెలివైన లక్షణం కాదు.

ఐఐటీలో సీటు తెచ్చుకోవడం కష్టమే కావొచ్చు.. కానీ ప్రతిఏటా వందలాది మంది సీటు సాధిస్తున్నారు కదా! వారు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు  ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిభ, మేధస్సు ఉండగానే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది చేసి చూపుతారు. జీవితంలో కోరుకున్న మార్పు రావాలంటే ప్రయత్నమే మూలాధారం.
 
 సొంత ఆలోచనలతో ముందుకు

 ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇతరుల ఆలోచనా దృక్పథం మీకు పనికి రావొచ్చు, రాకపోవచ్చు. మీరు చేయగలిగే, చేయలేని.. మీకు సాధ్యమయ్యే, సాధ్యం కాని పనిని ఇంకెవరో నిర్ణయించే పరిస్థితి తెచ్చుకోవద్దు. పరిశ్రమల యాజమాన్యాలు, బిజినెస్ స్కూల్స్, మొత్తం ప్రపంచం.. ఇప్పుడు సొంత ఆలోచనలతో ముందుకెళ్లే అభ్యర్థుల కోసమే వెతుకుతున్నాయి.
 
 అపజయాలే విజయానికి సోపానాలు

 మీకు ప్రేరణ కల్పించే గొప్ప వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారా? ఎడిసన్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆయన బాల్యంలో పెద్ద ప్రతిభ ఉన్న విద్యార్థి కాదు. పైగా చెవుడు కూడా ఉంది. పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎడిసన్ తన ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో వస్తువులను కనిపెట్టారు. వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్లారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. ప్రతి ఓటమి నుంచి ఓ విలువైన పాఠం నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పారు. ఎడిసన్ కీర్తి కిరీటంలో ఎన్నో పేటెంట్లు ఉన్నాయి. అలుపెరుగక శ్రమించే తత్వంతోనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. మీ కృషికి సొంత ఆలోచనలను జోడించండి. రుచి చూడకుండానే భోజనంలో ఉప్పు వేసుకోకండి!!
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 

Advertisement

తప్పక చదవండి

Advertisement