టూకీగా ప్రపంచ చరిత్ర 47 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 47

Published Sat, Feb 28 2015 12:05 AM

టూకీగా ప్రపంచ చరిత్ర   47

నాగరికత
 

దొరికిన ముద్రికా పరికరాల్లో ఎక్కువభాగం ‘స్టీటైట్’ అనే సబ్బు రాయితో తయారైనవి. వాటి మీది సంకేతాలను డిసెఫర్ చేసేందుకు ఇంతదాకా చేసిన ప్రయత్నాలు వమ్ముకావడంతో, వాటి అంతరార్థం చేతికి చిక్కడం లేదు. వాటి నడక కుడినుండి ఎడమకు సాగుతుందని మాత్రమే ఇప్పటికి  తెలుసుకోదగిన సమాచారం. అసలు అది లిపే కాదనే అభిప్రాయం కూడా వినపడుతున్నా, అంకెలూ అక్షరాలూ లేకుండా వేల సంవత్సరాల పర్యంతం విదేశీ వ్యాపారం వీలుపడదు కాబట్టి, ఏదోవొక వ్రాత సింధూ నాగరికులకు ఉండే తీరాలనేది బలమైన వాదన. వ్రాతకు ఉపరితలంగా వాళ్ళు ఏతరహా సరకును వినియోగించారో ఆధారాలు లేవు. తాళపత్రం వంటి సున్నితమైన సరుకునే వాడివుంటే ఇకమీదట కూడా ఆనవాళ్ళు దొరక్కపోవచ్చు.

మెసొపొటేమియన్లు ‘మెలూహా’గా వ్యవహరించిన ప్రాంతం సింధూ పీఠభూమేనని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచిన వాణిజ్యం గురించి మనకు తెలుస్తున్న సమాచారమంతా మెసొపొటేమియా రికార్డులో దొరికిందే. సింధూ ఎగుమతుల్లో ప్రధానమైనవిగా మనకు తెలుస్తున్నది - రంగురాళ్ళతో తయారైన అలంకార సామగ్రి, చముర్లు, ఏనుగు దంతం, నూలుబట్టలూ, కలప. చముర్లలో అవిసెనూనె, నువ్వుల నూనె ప్రధానమైనవి. నువ్వుల నూనెకు మెసొపొటేమియన్లు వాడిన ‘ఎళు’ అనే మాట, దక్షిణభారతంలోని తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో అదే పదార్థానికి అదే మాట ఇప్పటికీ నిలిచి వుండడం గమనార్హం. పలురకాల కలప దిగుమతుల్లో కర్జూరపు మొద్దులు ఉన్నట్టు నమోదుకావడం చోద్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే, కర్జూరం అక్కడి పంటేగాని ఇక్కడి పంట కాదు. ఈ ప్రాంతంలో ఉండేవి ఈతచెట్లు, తాటిచెట్లు. ఈత మొద్దులను కలపగా వాడరు కాబట్టి, బహుశా అవి తాటిమొద్దులై ఉండొచ్చు. శంకుగవ్వలూ, దంతం, సిరామిక్ మట్టితో తయారైన గాజులు అక్కడి స్త్రీలకు అపురూపమైన అలంకరణ సామగ్రి. ఆ సంప్రదాయం పశ్చిమాసియాలో ఇప్పటికీ స్థిరంగా నిలిచిపోయేందుకు కారణం సింధూ నాగరికులే.

మొదట్లో ఈ సరుకుల రవాణా పర్వతలోయల గుండా భూమార్గంలో ఇరాన్ మీదుగా మెసొపొటేమియా చేరేది. కొంతకాలం తరువాత భూమార్గం పూర్తిగా వదిలేసి సింధూవాసులు సముద్రమార్గం ఎంచుకున్నారు. నౌకల ద్వారా ఒకేసారి పెద్దమోతాదులో సరుకులను తీసుకుపోగల వీలు, దళారుల బెడద తప్పి స్వయంగా వ్యాపారం నడుపుకోవడంలోని ప్రయోజనం, రాజకీయ కల్లోలాల మూలంగా ఏర్పడే ఆటంకాలు లేకపోవడం వంటి సదుపాయాలు వాళ్లను సముద్రయానానికి ప్రోత్సహించింది. ఇప్పటి సింధురాష్ట్రంలోని మక్రాన్, కచ్ ప్రాంతంలోని పబూమత్, సౌరాష్ట్రలోని కుంటసి, లోథాల్ పట్టణాలు ప్రధానమైన ఓడరేవులుగా ఉండేవి. ఇక్కడ బయలుదేరే నౌకలకు మొదటి మజిలీ ఒమాన్‌లోని మగాన్ రేవుపట్టణం. తరువాతిది బహ్రైన్ దీవిలోని క్వాలాయెట్ అల్ బహ్రైన్ పట్టణం.

ఇంత భారీ ఎగుమతులకు దీటుగా సింధూ నాగరికులు దిగుమతి చేసుకున్న సరుకులేవో సంపూర్ణంగా తెలియడంలేదు. ఇక్కడ దొరకనివల్లా లోహాలూ, ఖర్జూరాలూ, నాణ్యమైన ఉన్నిబట్టలు. అంత విలువైన ఎగుమతులకు ఈ కొద్దిపాటి దిగుమతులు దీటు కావు. గవ్వలూ, తాబేళ్ళూ, ఎండుచేపలు దిగుమతుల్లో ఉన్నట్టు ఆధారాలున్నాయి. సుదీర్ఘమైన సముద్రతీరం ఇక్కడే ఉండగా వాటి అవసరం ఎందుకొచ్చిందో తెలీదు. బహుశా, ఈ తీరంలో దొరకని ప్రత్యేక తరహా చేపలూ గవ్వలూ తెచ్చుకోనుండొచ్చు.

క్రీ.పూ. 18వ శతాబ్దం నుండి ఈ రెండు ప్రాంతాల మధ్య జరిగిన వ్యాపారం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇరాన్, ఈజిప్టు, అనటోలియాల పోటీని తట్టుకోలేక ఎగుమతులు మందగించడంతో, విదేశీ వ్యాపారమే జీవనాధారంగా ఎదిగిన హరప్పా, మొహెంజదారో వంటి నగరాలు ప్రాభవాన్ని కోల్పో యాయి. బ్రతుకుదెరువుకోసం అక్కడి పౌరులు నగరాలను వదిలేసి, వ్యవసాయం దిశగా వృత్తిని మార్చుకున్నట్టు కనిపిస్తుంది.

రచన: ఎం.వి.రమణారెడ్డి

Advertisement
Advertisement