శ్రేష్ఠమైన దానం | Sakshi
Sakshi News home page

శ్రేష్ఠమైన దానం

Published Thu, Nov 20 2014 11:19 PM

శ్రేష్ఠమైన దానం

సిద్ధార్ధ రాకుమారుడు రాజ్యం వదిలి, దాదాపు ఆరేళ్లు ధ్యానం చేసి, జ్ఞానోదయం పొంది, బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన సంవత్సరానికి తిరిగి తన కపిలవస్తు రాజ్యానికి వచ్చాడు. అప్పటికే బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొడుకు ఒక భిక్షువుగా వచ్చాడని ఆయన తల్లిదండ్రులు కొంత బాధపడ్డా, కుమారునికి మంచి వస్త్రాన్ని బహూకరించాలని అనుకున్నారు. బుద్ధుని తల్లి గౌతమి తాను స్వయంగా అందమైన వస్త్రాన్ని నేసి కుమారుని దగ్గరకు తీసుకు వెళ్లింది.

‘‘నాయనా.. ఇది నా కానుక. తీసుకో’’ అంది. అందుకు బుద్ధుడు, ‘‘అమ్మా.. నీ వాత్సల్యానికి సంతోషం. ఈ వస్త్రాన్ని మా బౌద్ధ సంఘానికి బహూకరించు’’ అన్నాడు.

‘‘లేదు నాయనా. ఇది నీ కోసమే అల్లాను. నీవు నీ సంఘానికి నాయకుడవు. గొప్పవాడవు. పైగా నా బిడ్డవు’’ అంది గౌతమి.
 ‘‘నిజమే. కానీ అమ్మా.. ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే మరింత గొప్పది. ఉన్నతుడైన ఒక వ్యక్తి కంటే చెడ్డవారితో ఉన్నప్పటికీ ఆ సంఘమే గొప్పది. సంఘమే ఉన్నతమైనది. వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది. వ్యక్తి కంటే సంఘానికి చేసే దానమే శ్రేష్ఠమైన దానం’’ అన్నాడు.

బుద్ధుని మాటలు విని గౌతమి ఆ నూతన వస్త్రాన్ని సంఘానికి దానం చేసింది.
 - బొర్రా గోవర్ధన్

Advertisement

తప్పక చదవండి

Advertisement