కుటిలం... కడు జటిలం | Sakshi
Sakshi News home page

కుటిలం... కడు జటిలం

Published Sun, Oct 11 2015 12:53 AM

కుటిలం... కడు జటిలం

సోల్ / కపటం
 

‘నరుడు మదిలో దొంగ... నాల్క బూతుల బుంగ... కడుగజాలదు గంగ’ అన్నాడు ఆరుద్ర. ఇది కాలాతీత సత్యం. మానవుల్లో మెజారిటీ వర్గానిది ఇదే స్వభావం. పైన కనిపించేది ఒకటి, లోన ఉండేది మరొకటి. ప్రపంచంలో నాగరికత మొదలైన నాటి నుంచే మనుషుల్లో కపట స్వభావం మొదలై ఉంటుంది. నాగరికత నవీనతను సంతరించుకుంటున్న కొద్దీ ఇది మరింత విస్తరిస్తూ వస్తోంది. కొద్దిమంది రుజువర్తనులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో కపట స్వభావం ఉండనే ఉంటుంది. పెద్దమనుషులు ఈ స్వభావాన్ని ముద్దుగా ‘లౌక్యం’ అంటారు. అలా చెప్పుకుంటూ కల్తీలేని తమ కపట స్వభావాన్ని ‘లౌక్యం’గా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, కల్లకపటాలెరుగని అమాయక జీవులను, అన్నీ తెలిసినా ముక్కుసూటిగా ముందుకుపోయే మనుషులను చూసి ఇలాంటి పెద్దమనుషులు తెగ జాలిపడిపోతుంటారు కూడా.
 
‘పంచతంత్రం’ పెద్దపులి
కపట స్వభావుల కుట్రలు, కుతంత్రాలు రాచరిక కాలంలోనూ ఉండేవి. కపట స్వభావులైన మేధావి మంత్రులు, ధూర్త సేనానుల కారణంగా గద్దెకు ముప్పు ఏర్పడిన సందర్భాలూ లేకపోలేదు. అయితే, ఆ సత్తెకాలంలో పామర జనులు అమాయకంగానే ఉండేవాళ్లు. కల్లకపటాల కల్తీకి కొంత దూరంగానే ఉండేవాళ్లు. కపట నాటకాలన్నీ పాలక వర్గాల్లోనే ఎక్కువగా జరిగేవి. మనుషుల్లోని కపట స్వభావంపై రాజులకు తగినంత అవగాహన, అలాంటి స్వభావాన్ని కట్టడి చేయగల సామర్థ్యం ఉంటే తప్ప సజావుగా రాజ్యం చేయలేరని అప్పట్లోనే కొందరు మహానుభావులు గ్రహించారు. రాజ్య సుస్థిరత కోసం, శాంతిభద్రతల కోసం భావి రాజులకు ఇలాంటి విషయాల్లో శిక్షణ కూడా ఇచ్చేవారు. విష్ణుశర్మ అనే పెద్దాయన రాజకుమారులకు చెప్పిన ‘పంచతంత్రం’ ఇలాంటి శిక్షణలో భాగమే. విష్ణుశర్మ చెప్పిన ‘పంచతంత్రం’లోని పెద్దపులి... ‘పాంథుడా ఇటు రమ్ము’ అంటూ బాటసారికి బంగారు కడియాన్ని ఎరచూపిన సన్నివేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ కథలోని పెద్దపులి కల్తీలేని కపటానికి తిరుగులేని ఉదాహరణ.
 
డెమోక్రసీలో హిపోక్రసీ
ఇప్పుడంతా ప్రజాస్వామిక యుగం. ఈ యుగం అంతా ప్రజలదే. వాస్తవికతలు ఎలా ఉన్నా, సాంకేతికంగా పాలకులూ వాళ్లే, పాలితులూ వాళ్లే. ప్రజాస్వామిక కపట నాటకాలన్నింటికీ ప్రజలు సూత్రధారులు కాకపోయినా, వాటిలో అనివార్య పాత్రధారులు. ఎంతైనా, డెమోక్రసీలో హిపోక్రసీదే రాజ్యం. అందువల్ల పాలకుల కపట స్వభావాన్ని ప్రజలు కూడా కొద్దో గొప్పో వంట పట్టించుకుని, ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఓట్లు వేయడానికి బీరూ బిర్యానీలతో పాటు నోట్లు కూడా నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ప్రజలే ఈ రీతిలో ముదిరిపోతే ప్రజా ప్రతినిధులుగా మనల్నేలుతున్న నాయకులు మాత్రం తక్కువ తింటారా? వాళ్లకు గల ఆకాశహర్మ్యాల విలువలను కూడా లెక్కల్లో అట్టడుగు అంకెల్లోనే చూపిస్తారు. నిరాడంబరతపై ప్రవచనాలు ఇస్తూనే, దేస్సేవ స్కీములో భాగంగా కోట్లాది రూపాయల ప్రత్యేక వాహనాలను, సాయుధ భద్రతా వలయాన్నీ సమకూర్చుకుంటారు. ప్రజల క్షేమాన్ని ఆలోచించే ఖర్చుకు వెనుకాడకుండా అధికారిక భవంతులకు వాస్తు మార్పులు చేయిస్తుంటారు.
 
‘కపట’పురాణం
పురాణేతిహాసాల్లోనూ మనుషుల్లోని కపట స్వభావానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నాటి రాజతంత్రంలోనూ, రణతంత్రంలోనూ కుతంత్రాల పాత్ర కూడా ఉండేది. జగద్గురువుగా జేజేలందుకున్న శ్రీకృష్ణుడిని కపటనాటక సూత్రధారిగా నిందిస్తారు కొందరు. పాండవులను గెలిపించడం కోసం శ్రీకృష్ణుడు వేసిన ఎత్తులను, జిత్తులను తప్పుపడతారు వారు. అయితే, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారి అని, ఆయన లీలలన్నీ ధర్మసంస్థాపన కోసమేనని ముముక్షువులైన మహానుభావులు కొనియాడుతారు. ఉద్దేశం ఏదైనా, ఆయన అనుసరించిన మార్గం సరికాదని తప్పుపడతారు ముక్కుసూటి వాదులు. కృష్ణుడి సంగతి సరే, కౌరవుల పక్షాన ఉన్న శకుని కపట స్వభావానికి ఎవర్‌గ్రీన్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తాడు. లక్క ఇంటి దహనం, మాయాద్యూతం వంటి ఘట్టాల వెనుక శకుని మంత్రాంగమే కీలకం. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన చెల్లెలు గాంధారిని కట్టబెట్టిన భీష్ముడిపై పగతో కురువంశ వినాశనం కోసమే శకుని ఇదంతా చేశాడని, అందుకే కౌరవుల పంచన చేరి, అడుగడుగునా వాళ్లను రెచ్చగొట్టి కురుక్షేత్ర యుద్ధానికి పురిగొల్పాడని కూడా ప్రతీతి.
 
చరిత్ర పుటల్లో...
మౌర్యరాజ్య స్థాపనకు ముందు మగధను ఏలిన నందుల వద్ద మంత్రిగా పనిచేసిన రాక్షసామాత్యుడు కుతంత్రాల్లో ఆరితేరిన వాడు. అతగాడి అండ చూసుకునే మూర్ఖులైన నందులు అహంకారంతో విర్రవీగి చెలరేగారు. అర్థశాస్త్ర విశారదుడైన చాణక్యుడిని పరాభవించారు. తోక తొక్కిన తాచులా పగబట్టిన చాణక్యుడు శపథం పట్టి మరీ నందులను నాశనం చేశాడు. తన శిష్యుడైన చంద్రగుప్తుడిని గద్దెపెకైక్కించి, మౌర్యరాజ్య స్థాపనకు నాంది పలికాడు. రాక్షసామాత్యుడి అండలో ఉన్న నందుల నాశనానికి చాణక్యుడు కూడా కపట మార్గాన్నే అనుసరించాడు. కుటిల నీతినే పాటించి, కౌటిల్యుడిగా ప్రసిద్ధికెక్కాడు. లక్ష్యం మంచిదైనప్పుడు మార్గం ఎలాంటిదైనా ఫర్వాలేదనేది కౌటిల్యుడి మతం. ఇక ఆధునిక చరిత్రలో మేకియవెలీ అనే మహానుభావుడు రాజనీతిలో కాపట్యాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. ద్రోణుడికి ఏకలవ్యుడిలా ఆధునిక యుగంలోని రాజకీయాల్లో రాణిస్తున్న మహానుభావులందరూ మేకియవెలీ దొరగారికి అంతేవాసులే! బయటకు వాళ్లు ఎన్ని నీతిచంద్రికలను వల్లిస్తున్నా, లోలోపల మాత్రం ‘కపటం శరణం గచ్ఛామి’ అనేదే వారి నినాదం.
 - సాక్షి ఫ్యామిలీ
 

Advertisement
Advertisement