నా  ఎడతెరిపి లేని  దగ్గుకు  కారణాలు? 

7 Sep, 2018 00:30 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

కార్డియాలజీ కౌన్సెలింగ్స్‌

నా వయసు 47 ఏళ్లు. ఈమధ్య రెండు మూడు నెలల నుంచి విపరీతమైన దగ్గు విడవకుండా వస్తోంది. డాక్టర్‌కు చూపించుకుంటే దగ్గు మందులు, అలర్జీ మందులు ఇచ్చారు. కొద్దిరోజులు ఉపశమనం కనిపించినా మళ్లీ దగ్గు యధావిధిగా తిరగబెడుతోంది. విపరీమైన అలసట, పక్కటెముకల్లో నొప్పితో బాధపడుతున్నాను. ఇంట్లో పరిశుభ్రత పాటిస్తాం. వంటల్లో మసాలాలు కూడా ఎక్కువగా వాడతాం. ఇలా ఎడతెరిపి లేకుండా దగ్గు ఎందుకు వస్తోంది? దీనికి చికిత్స ఏమిటో వివరంగా చెప్పండి.  – కె. వసుంధర, మందమర్రి
మీకు వచ్చిన దగ్గును దీర్ఘకాలిక దగ్గు (క్రానిక్‌ కాఫ్‌) గా చెప్పవచ్చు. వయోజనుల్లో ఎనిమిది వారాల... ఆ పైన కూడా తగ్గకుండా దగ్గు వస్తోంటే దాన్ని క్రానిక్‌ కాఫ్‌గా పరిగణిస్తారు. విడవకుండా వచ్చే ఈ దగ్గు వ్యక్తిని నిద్రకు సైతం దూరం చేస్తుంది. తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది. దీర్ఘకాలిక దగ్గు వల్ల కొన్నిసార్లు వాంతులు, మత్తుకమ్మినట్టు ఉండటం జరుగుతుంది. దగ్గీ దగ్గీ పక్కటెముకల్లో పగుళ్లూ ఏర్పడవచ్చు. ఈ రకమైన దగ్గుకు నిర్దిష్టంగా కారణం చెప్పడం సాధ్యం కానప్పటికీ కొన్ని పరిస్థితులు దీనికి  దోహదం చేయవచ్చు.  ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. దగ్గుకు కారణమైన పరిస్థితులను తొలగిస్తే దీర్ఘకాలిక దగ్గు కూడా దానంతట అదే అదృశ్యమైపోతుంది. అయితే ఎండోకారై్డటిస్‌ (గుండెకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్‌) వల్ల వచ్చే దగ్గు నెలల తరబడి విడవకుండా ఉండి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితికి దారితీయవచ్చు. 

ఎండోకారై్డటిస్‌ అనేది గుండె లోపలి పొర (ఎండోకార్డియం)కు ఇన్ఫెక్షన్‌ సోకవడం వల్ల వచ్చే వ్యాధి. దీనిలో ప్రధానంగా కనిపించే మొదటి లక్షణం విడవకుండా వచ్చే దగ్గు.  నోరు, ఇతర శరీర భాగాలలోని బ్యాక్టీరియా... రక్తంతో పాటు వెళ్లి గుండెపొరకు ఇన్ఫెక్షన్‌ కలగజేస్తాయి. గుండెలో అప్పటికే దెబ్బతిని ఉన్న భాగాలను ఈ బ్యాక్టీరియా ఎంచుకొని ప్రభావితం చేస్తాయి. ఎండోకారై్డటిస్‌ను గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చాలా సందర్భాల్లో మందులతోనూ, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా దీనికి చికిత్స చేస్తారు. ఆరోగ్యకరమైన గుండె గలవారికి ఈ వ్యాధిసోకడం చాలా అరుదు. గుండెకవాటాలు చెడిపోయిన, కృత్రిమ కవాటాలు అమర్చినవారిలో, గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఎండోకారై్డటిస్‌ ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలపు దగ్గు ఉండి విపరీతమైన అలసట, మూత్రంలో రక్తం పడటం, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. విడువకుండా వేధించే దగ్గుకు దారితీసే సాధారణ కారణాల ఆధారంగా డాక్టర్లు చికిత్స ప్రారంభిస్తారు. ఆపైన దీర్ఘకాలపు దగ్గుకు అసలు కారణాలైన వ్యాధులను నిర్ధారణ చేసేందుకు పరీక్షలు చేయిస్తారు. అవసరమైతే కార్డియాలజిస్టుకు సిఫార్సు చేస్తారు.మీ విషయానికి వస్తే మీరు కూడా మరోసారి డాక్టర్‌కు చూపించుకోండి. మీ దగ్గుకు కారణం ఎండోకారై్డటిస్‌ అవునో, కాదో నిర్ధారణ చేసి, దాన్ని బట్టి మీకు అవసరమైన చికిత్స అందిస్తారు. 

డయలేటెడ్‌  కార్డియో మయోపతి అంటే ఏమిటి? 
నా వయసు 56 ఏళ్లు. గడచిన ఏడెనిమిది నెలల నుంచి విపరీతమైన అలసట కలుగుతోంది. ఒక్కోసారి శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. పదిహేను రోజుల కిందట హఠాత్తుగా స్పృహ తప్పిపోయాను. డాక్టరుకు చూపిస్తే పరీక్షలు చేయించారు. డయలేటెడ్‌ కార్డియోమయోపతి అని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – బి. ఈశ్వరరావు, దేవరకొండ 
కార్డియోమయోపతి అన్నది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు వ్యక్తం కావు. కొంతకాలం తర్వాత తీవ్రమైన అలసట, శ్వాస అందకపోవడం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియోమయోపతిని గుర్తించి చికిత్స చేయించడం ఆలçస్యమైతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. కొంతమందిలో అకాల మరణానికి కారణం అవుతుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానమైనది డయలేటెడ్‌ కార్డియోమయోపతియే. కార్డియోమయోపతి వ్యాధుల్లో 95 శాతం ఈ రకానికి చెందినవే. దీనిలో ఎడమ జఠరిక (వెంట్రికల్‌) వ్యాకోచిస్తుంది. గుండె బలహీనపడి వెంట్రికల్‌లోని రక్తాన్ని ముందుకు పంపించలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వెంట్రికల్‌ గోడలు చాలా పలుచబడిపోతాయి. బాగా సాగి సంచిలా తయారైన వెంట్రికిల్‌ తగినంత రక్తాన్ని పంప్‌ చేయలేదు. చాలా సందర్భాల్లో డయలేటెడ్‌ కార్డియోమయోపతి నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ చేయడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతాయి. శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, పొట్ట–చీలమండల వాపు, విపరీతమైన అలసట, గుండెదడ ఈ డయలేటెడ్‌ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. ఇవన్నీ గుండె విఫలమవుతోందనడానికి ముఖ్య లక్షణాలు. 

పలు కారణాల వల్ల డయలేటెడ్‌ కార్డియోమయోపతి  రావడానికి అవకాశం ఉంది. వైరస్‌ల కారణంగా ఇన్ఫెక్షన్, అదుపు తప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండెకవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. వీటితో పాటు గర్భవతులు కొందరిలో కూడా డయలేటెడ్‌ కార్డియోమయోపతి కనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో జన్యువుల మార్పు లేదా మ్యుటేషన్‌ కారణంగా వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్‌ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఈ వ్యాధి నిర్ధారణకు డాక్టర్లు సిఫార్సు చేసే పరీక్ష ఈసీజీ. గుండె విద్యుత్‌  స్పందనలు నమోదు చేసే ఈ పరీక్ష గుండె రక్తాన్ని పంప్‌ చేయగలుగుతున్న తీరును గుర్తిస్తుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి ఎమ్మారై, ఎక్సర్‌సైజ్‌ టెస్టులను కూడా చేయిస్తారు. డయలేటెడ్‌ కార్డియోమయోపతి చికిత్సలో  ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేయడం, తీవ్ర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తతీసుకోవడం పైనే కేంద్రీకృతం చేస్తారు. అయితే డయలేటెడ్‌ కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (ఎరిథిమియాస్‌), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండె స్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపు చేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ను అమరుస్తారు. మరికొంతమందిలో గుండె కొట్టుకోవడంలోని అసాధారణ స్థితిని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌) పరికరాన్ని అమర్చాల్సి వస్తుంది.
డాక్టర్‌ పంకజ్‌ జరీవాలా, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ 
కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ,  హైదరాబాద్‌
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు