గుక్కపట్టి ఏడ్చినపుడు పాప నీలం రంగులోకి... | Sakshi
Sakshi News home page

గుక్కపట్టి ఏడ్చినపుడు పాప నీలం రంగులోకి...

Published Thu, Oct 12 2017 11:55 PM

family health counciling

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా పాపకు 10 నెలలు. ఒక్కోసారి అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడ్చినప్పుడు పాప ముఖం నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – సరస్వతి, కర్నూలు

మీ పాప సమస్యను ‘బ్రెత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుంటుంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్‌ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఇందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు.

ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుండటాన్ని చూడవచ్చు. బ్రెత్‌ హోల్డింగ్‌ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్‌ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్‌ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్‌ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్‌ ఇవ్వడం ఉపయోగకరం. పిల్లలూ, పేరెంట్స్‌ మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఇది కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో తెలుసుకోవడం కోసమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైతే మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించండి.

పాప తల ఫ్లాట్‌గా ఉంది...
మా పాప వయసు 13 నెలలు. తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపు సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. మాకు ఆందోళనగా ఉంది. పరిష్కారం చెప్పండి.
– భవాని, విజయవా

మీ పాపకు పొజిషనల్‌ సెఫాలీ అనే కండిషన్‌ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్‌డ్‌ హెడ్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో  పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని  సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్‌ అంటారు. ఇది కాస్తంత తీవ్రమైన సమస్య. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషియన్‌కు చూపించి... ఇది పొజిషనల్‌ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్‌గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నోట్లో పొక్కులు ఎందుకు?
మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈ మధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది. వాడి సమస్యకు పరిష్కారం చెప్పండి.  
–  సుందరి, ఖమ్మం

మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్‌ అల్సర్స్‌ లేదా యాఫ్తస్‌ స్టొమటైటిస్‌ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్‌ థ్రోట్‌)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్‌ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్‌ మెంబ్రేన్‌)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్‌ వస్తాయి. ఇవి రావడానికి  ఫలానా అంశమే కారణమని  నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్‌) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్‌ బి12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, జింక్‌ లోపాలతోనూ రావచ్చు. అత్యధిక సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి  కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన (ఫెటిగ్‌) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి

కొన్ని చర్యలు...
►నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్‌ చేయడం ∙నోరు ఒరుసుకుపోయేందుకు దోహదపడే ఆహారపదార్థాలు (అబ్రేసివ్‌ ఫుడ్స్‌) తీసకోకపోవడం ∙నోటి పరిశుభ్రత (ఓరల్‌ హైజీన్‌) పాటించడం వంటివి చేయాలి.

పరిష్కారాలు : ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్‌ అనస్థిటిక్‌ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్‌ నైట్రేట్‌ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్‌ యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. సమస్య మాటిమాటికీ వస్తున్నట్లయితే నాన్‌ ఆల్కహాలిక్‌ మౌత్‌వాష్, తక్కువ లో కాన్సంట్రేటెడ్‌ మౌత్‌ వాష్‌ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది.
ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్‌ ఓరల్‌ హైజీన్‌) పాటించడంతో పాటు అతడికి విటమిన్‌ బి12, జింక్‌ సప్లిమెంట్స్‌ ఇవ్వండి. లోకల్‌ అనస్థిటిక్‌ జెల్స్‌ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

బాబుకు తరచూ జ్వరం
మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి చాలా సార్లు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి.   – నిత్య, హైదరాబాద్‌
చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్‌ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్‌ వేరియేషన్స్‌) ఇన్ఫెక్షన్స్‌ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్‌ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్‌ ఫీవర్‌ సిండ్రోమ్‌ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలతోపాటు దీర్ఘకాలికమైన జబ్బులకు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమోనని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు... అందునా మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి,
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Advertisement
Advertisement