మన కళ్లకు కనపడదా? | Sakshi
Sakshi News home page

మన కళ్లకు కనపడదా?

Published Fri, Oct 30 2015 12:07 AM

మన కళ్లకు  కనపడదా? - Sakshi

కడుపులో మొదలైన చిచ్చు  కాటికి పోయేదాకా ఆగడంలేదు  బాగా పోరాడితే  భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయి  కానీ భూమ్మీద పడ్డ ఆడపిల్లకి గుండెకోత తప్పడంలేదు  పండంటి జీవితాలను  పుండు పుండు చేస్తున్నారు  ముళ్లకంపలో పారేస్తారు..  చెత్తకుప్పలో వదిలేస్తారు..  ఇంట్లో.. స్కూల్లో .. బజార్లో కాటేస్తారు!  ఏం తప్పు చేసింది ఈ తల్లి? ఎందుకు ఈ విషపుగాట్లు?  తప్పు తప్పు!  తప్పు చేసింది తల్లికాదు  ఆ కడుపునే పుట్టిన మగాడు!  ఈ దాష్టీకాల గురించి ఎంత రాసినా...  వాళ్ల రాత మాత్రం మారడంలేదు!  మనలో గాంధీ మేల్కోవాలి..  మరో ఉద్యమం రావాలి..!  మనం కళ్లు తెరవాలి...  మన మనసు కదలాలి!
     
ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడవగలుగుతుందో ఆ రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్న గాంధీ ఆలోచనలకు రూపంగా నిలిచిందే కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్! మనలో స్పందన కోసం స్ఫూర్తిగా ఆ సంస్థ గురించి తెలుసుకుందాం...
 
భారమని...

ఓ రాత్రి.. సమయం పదకొండు! స్థలం.. నల్గొండ బస్టాండ్. నాలుగేళ్ల పిల్ల గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోంది. ఒంటి మీద దెబ్బలున్నాయి. పలుచగా ఉన్న జనం ఆ పసిదాని చుట్టూ ముగారు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా, మీ అమ్మానాన్న పేరేంటి? అని ఎంత అడిగినా వెక్కివెక్కి ఏడ్వడమే తప్ప జవాబు చెప్పడం రావట్లేదు. ఏం చేయాలో పాలుపోని జనం అక్కడి పోలీసులకు కబురు చేశారు. పోలీసులు వచ్చి పాపను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళితే అక్కడా ఆ పిల్ల నోటి నుంచి ఏ వివరమూ రాలేదు. తెల్లవారి ఎంక్వయిరీలో తెలిసిన సత్యం ఏంటంటే.. ఆ ‘ఆడపిల’్లను వదిలించుకోవడానికి తల్లిదండ్రులు ఈడ వదిలేసి వెళ్లారని. తన పేరును కూడా మర్చిపోయేంత భయంలోఉన్న ఆ పాపకు మహిత అని పోలీసులే నామకరణం చేశారు.

రుణం తీర్చమని..
అజిత (పేరు మార్చాం)కు పన్నెండేళ్లు! ఏడవ తరగతిలో ఉంది. రంగారెడ్డిజిల్లాలోని ఓ మండలకేంద్రం ఆమె స్వస్థలం. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అజిత పిన్నమ్మను మారు మనువాడాడు తండ్రి. పిన్నమ్మ అయితే పిల్లకు తల్లిలేని లోటు తీరుస్తుందని! కానీ అలా జరగలేదు. అప్పులపాలై ఉన్న రెండు ఎకరాల భూమినీ అమ్ముకున్నాడు తండ్రి. వ్యవసాయ కూలీగా మిగిలాడు. కాలం లేక కూలి పనీ సాగలేదు. రుణ భారం మోయలేనంత అయింది. అప్పుడే దగ్గరి బంధువు నుంచి అజిత తండ్రికి ఓ కబురందింది. ఆయన కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేస్తే ఆ అప్పంతా తీరుస్తానని. 32 ఏళ్ల వాడికి పన్నెండేళ్ల నా కూతురు కావల్సి వచ్చిందా అని ఆవేశపడ్డాడు. ‘పదిహేనేళ్ల తేడా ఉండి, ఓ బిడ్డ తండ్రిని నేను చేసుకోలేదా?
 అతనిదైతే ఇంకా మొదటి పెళ్లే కదా?’ అని ఎకసెక్కం చేసింది అజిత పిన్నమ్మ. ‘అప్పులతో అందరం ఆత్మహత్య చేసుకునేకంటే బిడ్డను వాడిచేతిలో పెట్టి అప్పుతీర్చడం నయం కదా! ఇప్పుడా పిల్ల చదివి ఊళ్లు ఏలేదుందా? రాజ్యాలు ఏలేదుందా? ఎంత చదివించినా కట్నమిచ్చే కదా పెళ్లి చేయాలి. ఆ కట్నమేదో ఎదురొస్తుంటే నాలుగు అక్షింతలు వేయడానికేమయింది?’ అంటూ భర్త మనసు మార్చే ప్రయత్నం చేసింది. సఫలం కూడా అయింది. పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. విషయం తెలిసినప్పటి నుంచి అజిత ఇంట్లో యుద్ధం చేస్తూనే ఉంది.. ‘నాకు పెళ్లొద్దు. చదువుకుంటాను’ అని. కానీ ఎవరూ వినలేదు. కన్నందుకు ఈ పెళ్లి చేసుకొని రుణం తీర్చాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించారు. పిల్ల గడపదాటకుండా కట్టడి చేశారు. పెళ్లి ముందు రోజురాత్రి ఆ బంధనాలు తెంచుకుని ఇంట్లోంచి పారిపోయింది అజిత. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తనవాళ్లకు కనిపించకుండానైతే వెళ్లాలి. ఈ పెళ్లి తప్పించుకోవాలి. ఈ ఆలోచనలతోనే సాగుతోంది. ఆ ఊరిపొలిమేర దాటేలోపే పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్నారు. బాల్య వివాహం నేరమని తల్లిదండ్రులను హెచ్చరించి ఆ ప్రయతాన్ని ఆపించారు. అయినా అజిత తల్లిదండ్రులతో ఉండనంది.

వావి వరుసల ఇంగితం పోయి..
అన్విత (పేరు మార్చాం)ది మెదక్‌జిల్లాలోని ఓ పల్లెటూరు. వయసు పదిహేను. తొమ్మిదో తరగతిలో ఉంది. చదువులో ఫస్ట్. ఆటపాటల్లో బెస్ట్. డాక్టర్ కావాలని కోరిక. అంతే పట్టుదల. తండ్రి పచ్చి తాగుబోతు. తల్లి వ్యవసాయ కూలీ. అన్న దుబాయ్‌లో ఉంటాడు. పొలం పనుల నుంచి తల్లి ఇంటికొచ్చే సరికి పొద్దు పోయేది. ఒకరోజు.. విపరీతమైన జ్వరంతో మధ్యాహ్నమే బడి నుంచి ఇంటికి వచ్చేసి ఒళ్లు తెలియకుండా పడుకుండి పోయింది అన్విత. ఎప్పుడొచ్చాడో తండ్రి విపరీతంగా తాగి.. కూతురనే ఇంగితం కూడా మర్చిపోయి అత్యాచారం చేశాడు. ఆ బిడ్డ శరీరమే కాదు మెదడూ గాయపడింది. ఆ గాయం నుంచి శరీరం త్వరగా కోలుకున్నా మనసు ఇంకా కోలుకోలేదు. నాడి పట్టుకొని పేషంట్ల ఆరోగ్యం చూడాలని కలలుకన్న ఆ బంగారుతల్లి ఎండు పుల్లలు పట్టుకొని గాల్లో గీతలు గీస్తోంది.. పిచ్చి చూపులు చూస్తోంది!
 
నేనున్నాంటూ..

 అయితే ఇప్పుడు మహితకు అమ్మ ఒడి, అజితకు జీవన పాఠం నేర్పుతున్న బడి, అన్వితకు సాంత్వననిస్తున్న గుడి.. ఒకటి ఉంది. దాని పేరు హైదరాబాద్‌లోని కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. అయినవాళ్ల దగ్గర, కాని వాళ్ల దగ్గర దగా పడ్డ ఆడబిడ్డలెందరినో అక్కున చేర్చుకొని ఆత్మబలాన్నిచ్చి తలెత్తుకునేలా చేస్తోంది ఈ ఆశ్రమం. దీని ప్రస్థానం మొదలై ఇప్పటికీ 70 ఏళ్లు. మహాత్మాగాంధీ ఆలోచనలకు రూపం ఇది. గాంధీజీ చేయిపట్టుకొని దక్షిణాఫ్రికా వెళ్లిన కస్తూర్బా అక్కడ భాష రాక, పెద్ద చదువులేక, ఆరోగ్యంపట్ల అవగాహనా కొరవడి చాలా ఇబ్బందులు పడ్డదట. ఈ విషయాన్ని గ్రహించిన గాంధీజీ దేశంలోని గ్రామీణ ప్రాంత మహిళల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని, వాటి ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అనుకున్నారు. అది నిర్ణయంగా మారి కార్యరూపం దాల్చింది 1945లో. కస్తూర్బా మరణించిన తర్వాత. దేశంలోని 22 ప్రాంతాల్లో గ్రామీణ మహిళల విద్య, వైద్యం, స్వాలంబన లక్ష్యంతో
 ‘కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. ‘అదేం చిత్రమో ఇప్పటికీ ఇదే సమస్యల మీదా పోరాడాల్సి వస్తోంది’ అంటారు ట్రస్ట్ ప్రతినిధి పద్మావతి. బాల్యవివాహాలు, అత్యాచారం, డొమెస్టిక్ వయొలెన్స్‌ల వల్ల బాధితులైన వారికి ఆశ్రయం ఇస్తూనే కుటుంబ తగాదాల వల్ల, క్షణికావేశంలో హత్యలు చేసి జైలు పాలైన తల్లిదండ్రుల వల్ల అనాథలైన పిల్లలకూ ఇల్లవుతోంది కస్తూర్బాగాంధీ ట్రస్ట్. మతిస్థిమితం కోల్పోయిన అనాథ మహిళలనూ చేర్చుకుంటోంది. ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న ఆడపిల్లలకూ భరోసానిస్తోంది.
 
ఆత్మగౌరవంతో నిలబెడుతోంది

కస్తూర్బా ట్రస్ట్ ఈ అనాథలకు అమ్మానాన్న అయి ఆత్మీయతను పంచడమే కాక గురువుగా మారి పాఠాలనూ నేర్పుతోంది. పిల్లలకు బడిలో చదువును, ఆశ్రమంలో లైఫ్ స్కిల్స్‌నూ బోధిస్తోంది. ప్రత్యేకంగా కంప్యూటర్‌కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టి అప్ టు డేట్ నాలెడ్జ్‌ను అందిస్తోంది. అంతేకాదు ఈ ఆశ్రమంలో చక్కటి లైబ్రరీ కూడ ఉంది. 20 ఏళ్లు దాటిన వాళ్ల కోసం ఒకేషనల్ ట్రైనింగ్ ఉంది. టైలరింగ్, హ్యాండీ క్రాఫ్ట్స్, జ్యూట్ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడం వంటివి నేర్పిస్తోంది. ఇలా శిక్షణ తీసుకొని తయారు చేసిన ప్రొడక్ట్స్‌కి మార్కెట్ కూడా కల్పించి ఈ మహిళలకు ఆదాయం చూపిస్తోంది. అలా వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో ధైర్యంగా తలెత్తుకు తిరిగే నిలబడే శక్తినిస్తోంది.
 
సీజనల్ ప్రొడక్ట్స్
 ఇవే కాక వినాయక చవితి, దీపావళి వంటి పండగ సందర్భాల్లో మట్టితో వినాయకుడి ప్రతిమలు, ప్రమిదలు వంటివి తయారు చేయడం నేర్పిస్తోంది ఆశ్రమం. దీనివల్ల సమాజానికి పర్యావరణ ప్రియమైన మెసేజ్‌ను అందించడమే కాక ఆశ్రమంలోని మహిళలకు అదనపు ఆదాయమూ చూపిస్తోంది.
 - సాక్షి ఫ్యామిలీ
 
మీరేం చేయొచ్చు?
గాంధీజీ నాటి ఆశయాన్ని ఏమాత్రం మరవక కాలం తెచ్చిన మార్పులకనుగుణంగా  తన పరిధిని పెంచుకుంటూ  ఎందరో ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్! ప్రాచుర్యం కన్నా ప్రమాణానికి విలువకడుతోంది! ఈ కొండంత సేవలో గోరంత భాగస్వామ్యం మీరూ పంచుకోవచ్చు.నా అన్నవాళ్లు లేక బేలగా ఉన్న ఈ ఆడబిడ్డల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచే నాలుగు మాటలు మాట్లాడొచ్చువివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలు వాళ్ల   విజయరహస్యాలను వీళ్లతో పంచుకొని కొత్త స్ఫూర్తిని నింపొచ్చులెక్కల ఎక్స్‌పర్ట్ వచ్చి లాజిక్‌సెన్స్ మీద లెసన్స్ ఇవ్వచ్చు ఇంగ్లీష్ ఇంపార్టెన్స్‌ను వివరించొచ్చు
     
వైద్యులు తమ వాలంటరీ సర్వీస్‌కు ఈ ట్రస్ట్‌ను క్యాంప్‌గా చేసుకోవచ్చు  ఎన్నో సంస్థలు వీళ్లకు ఉపాధి అవకాశాలూ కల్పించవచ్చుఆర్థిక సహాయమూ అందించవచ్చు: కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌లోని మహిళల స్వాలంబనకు మీరు చేయూతనివ్వాలనుకుంటే ఈ నంబర్‌లో సంప్రదించగలరు.. 9391011282

Advertisement
Advertisement