పురుష పరిరక్షణ సంఘం! | Sakshi
Sakshi News home page

పురుష పరిరక్షణ సంఘం!

Published Tue, May 13 2014 11:47 PM

పురుష పరిరక్షణ సంఘం! - Sakshi

 పురుషుడికీ...ఒక హృదయం ఉంది. దానికో బాధ ఉంది. పురుషుడికీ...రెండు కళ్లు ఉన్నాయి. వాటి వెనుక అంతులేని కన్నీళ్లు ఉన్నాయి... ఇలా ఆమె ఆలోచించిందో లేదోగానీ పురుషుల హక్కుల కోసం నడుం బిగించింది. పురుషుడి హృదయంలో కొండలా నిలబడ్డ బాధను తీర్చడానికి, అతడి కన్నీళ్లను తుడవడానికి ఆమె ముందుకు వచ్చింది. పురుషుల హక్కుల కోసం పని చేస్తున్న ఆమె పేరు... ఇందూ సుభాష్.
 
 ఒకరోజు ఏం జరిగిందటే...
 లక్నోలోని ఆమె ఇంటి దగ్గర గొడవ గొడవగా ఉంది.
 రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.
 ‘‘చాలా మంచి వ్యక్తి. ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉంది’’
 ‘‘భార్యాభర్తల మధ్య చిన్న గొడవట. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా వాళ్ల మామగారు పోలీసు కేసు పెట్టాడు. వరకట్న వేధింపుల చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానం తట్టుకోలేక...ఇలా చేసి ఉంటాడు.’’

 ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడల్లా...‘పురుషులు అనగా ఇలాంటి వారు’ అనే అభిప్రాయం నుంచి ఇందు బయటికి వచ్చింది. పురుషుల సానుభూతి కూడా పెరిగింది. 2007లో ఆమె సోదరుడు కూడా సరిగ్గా ఇలాంటి కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషుల హక్కుల కోసం పాటు పడాలని ఆమె అప్పుడు గట్టిగా అనుకుంది.

అనేక వైపుల నుంచి అనేక రకాల విమర్శలు వచ్చాయి.
 ‘‘స్త్రీ అయి ఉండి పురుషుల హక్కుల కోసం పనిచేయడమేమిటి?’’ అని కొందరు స్త్రీవాదులు విరుచుకుపడ్డారు.
 ‘‘ఆడవాళ్ల దయాదాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. మా బాధేదో మేము పడతాం. మా పోరాటమేదో మేము చేస్తాం’’ అని మీసం తిప్పారు వీరశూర పురుషులు.

 విమర్శలనేవి లెక్క చేయకుండా రంగంలోకి దిగిన డా. ఇందూ సుభాష్ లింగపక్షపాతంతో కూడిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంది. మొదట్లో భిన్నాభిప్రాయాలు వినిపించినా ఇప్పుడు మాత్రం ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొంతమంది మహిళలు కూడా ఇందు వాదనతో ఏకీభవించడం విశేషం.

 ‘‘చట్టం దుర్వినియోగం కావడం వల్ల పురుషుల జీవితాలు నాశనమవుతున్నాయి. వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’’ అని ఆవేదన చెందుతున్న ఇందు వుమెన్స్ స్టడీస్‌లో పిహెచ్‌డి చేశారు.
 
 ‘‘చట్టాలన్నీ స్త్రీల రక్షణ కోసమే ఉన్నాయి. స్త్రీల భద్రత కోసం చేసిన కొన్ని చట్టాలు పురుషుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి’’ అని కూడా ఆమె అంటున్నారు. అత్యాచార నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టాలు ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయనీ, దుర్వినియోగంలో పోలీసులు కీలకమవుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.

 చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఆమె ఆయుధం. లక్నోలోని జానకీపుర ప్రాంతంలోని స్వచ్ఛంద కార్యకర్తలు ఆమె సైన్యం. పురుషుల క్షేమం కోసం ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడంతో పాటు నిరసనప్రదర్శనలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తుంటారు. బాధిత మగవాళ్లు ఆమెను ఆప్యాయంగా ‘అక్క’ అని పిలుచుకుంటారు.

  ‘పతి పరివార్ కల్యాణ్ సమితి’ (పికెఎస్)పేరుతో స్వచ్ఛందసంస్థను స్థాపించిన ఇందూ- వందలాది పురుషులకు అండగా నిలిచామనీ, అమాయకులకు శిక్ష పడకుండా తప్పించి, అపార్థాలతో, చిన్న చిన్న తగాదాలతో విడిపోయిన దంపతులను ఏకం చేశామనీ చెబుతున్నారు.
 
  రకరకాల బాధలు ఎదుర్కొంటున్న పురుషుల నుంచి రోజూ ఆమెకు కనీసం పది ఫోన్ కాల్స్ వస్తాయి. విభేదాలతో దూరం పెరిగిన భార్యాభర్తల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తుంది పికెఎస్. కోర్టులకు బయట 40 శాతం కేసులను ఆమె పరిష్కరించారు. ఇటీవల పీకెయస్ ఆధ్వర్యంలో ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ ఏర్పాటు చేయాలంటూ పురుషులు లక్నో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
 ‘పతి పరివార్ కల్యాణ్ సమితి’ని దేశమంతటా విస్తరింపచేయాలని ఆలోచనలో ఉన్న ఇందూ సుభాష్ పురుషుల హక్కుల కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహించాలనుకుంటోంది. మగవారికి శుభవార్తే!
 
 
  ‘పతి పరివార్ కల్యాణ్ సమితి’ (పికెఎస్)పేరుతో స్వచ్ఛందసంస్థను స్థాపించిన ఇందూ- వందలాది పురుషులకు అండగా నిలిచామనీ, అమాయకులకు శిక్ష పడకుండా తప్పించి, అపార్థాలతో, చిన్న చిన్న తగాదాలతో విడిపోయిన దంపతులను ఏకం చేశామనీ చెబుతున్నారు.

Advertisement
Advertisement