జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ...నవమాసాలలాలన | Sakshi
Sakshi News home page

జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ...నవమాసాలలాలన

Published Sun, Oct 27 2013 10:56 PM

five therapies in 'joy of pregnancy'

బిడ్డల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు. బిడ్డను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి నిచ్చెనలుగా మారతారు. బిడ్డకు ఆకలేసినపుడు తల్లి కంచంలో అన్నంలా మారిపోతే, బిడ్డకు భయమేసినపుడు రక్షణ కవచంలా చుట్టుకుంటాయి తండ్రి చేతులు. ఇవన్నీ బిడ్డ ఈ లోకాన్ని చూసిన తరువాత జరిగే పనులు. నిజానికి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే తల్లిదండ్రుల పేరెంటింగ్ ప్రారంభమైపోతుంది. కడుపులో ఉన్న బిడ్డతో అనుబంధం కోసం తల్లి తహతహలాడితే, ఆ తల్లికి, బిడ్డకి ‘నేనున్నాననే’ భరోసాని, ఆత్మీయ స్పర్శని అందిస్తారు తండ్రి. అలా తల్లిదండ్రుల పేరెంటింగ్ బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది. అలాంటిదే ‘జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’.  బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే బిడ్డతో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని థెరపీలు ఉపయోగపడతాయంటారు నిపుణులు. ఇంతకీ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే..! తొమ్మిది నెలలు, ఐదు థెరపీలు... క్లుప్తంగా చెప్పాలంటే ఇదే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మరి ఆ థెరపీలు అందుకు సంబంధించిన వివరాలేంటో మీరే చదవండి...
 
 జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ థెరపీలో భాగంగా అందించే థెరపీల్లో మ్యూజిక్ థెరపీ మొదటిది. గర్భస్థ శిశువులో ఐదోనెల నుండే వినికిడి శక్తి ప్రారంభమవుతుందని చెబుతారు వైద్యులు. ప్రహ్లాదుడు, అభిమన్యుడు వంటి వారు తల్లి గర్భం నుండే పురాణ గాథలను వినడం, పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసుకోవడాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. బయటి శబ్దాలను గర్భంలోని శిశువు వింటూ ఉంటాడు కాబట్టి తల్లి కూడా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. సంగీతం నుండి వచ్చే శబ్ద తరంగాలు మనిషి మెదడుపై ప్రభావం చూపుతాయి, అందులోనూ కడుపులో ఉన్న బిడ్డపై ఈ ప్రభావం మరింత ఎక్కువ. అందుకే గర్భిణులు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ ఉండాలి. ఈ సంగీతంలో కూడా ఉదయంవేళల్లో స్లో చాంటింగ్స్ (శ్లోకాలు, మంత్రాలు వంటివి), మధ్యాహ్న వేళల్లో మెలోడీ పాటలు, సాయంత్రం వేళ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ (వాయిద్య సంగీతం), రాత్రివేళ చాలా తక్కువ శబ్దంతో కూడిన వాద్య సంగీతాలను వినాల్సి ఉంటుంది.
 
 డ్రాయింగ్ థెరపీ...
 
 గర్భంతో ఉన్న సమయంలో మహిళల హార్మోనల్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంటుంది. వీటన్నింటిని ఏదో ఒకపనిలో ఛానలైజ్ చేయకపోతే గర్భిణిలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గర్భిణిలో కనుక నెగిటివ్‌ఆలోచనలు వస్తే ఆ ప్రభావం బిడ్డపై తీవ్రంగా ఉంటుంది. అందుకే హార్మోనల్ వ్యవస్థను సరైన దారిలో పెట్టడానికి వారి దృష్టినంతా ఒక దగ్గర ఉంచి ఏదో ఒక పనిలో నిమగ్నం కావాల్సిందిగా నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో భాగంగా... వారి ఆలోచనలను డ్రాయింగ్‌పై పెట్టడం ఉత్తమ మార్గమమని చెబుతున్నారు నిపుణులు.
 
 స్మెల్ థెరపీ...
 
 గర్భంలో ఉన్న బిడ్డ తన తల్లి చేసే ప్రతి చర్యకు తాను కూడా అనుభూతి పొందుతుంది. అందుకే గర్భిణులు తమ అలవాట్లలో చాలా వాటిని గర్భస్థశిశువు కోసం మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే గర్భంతో ఉన్నప్పుడు అనేక రకాల వాసనలకు కూడా వారు దూరం కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు గర్భంతో ఉన్నప్పుడు చాలామంది వంటగదిలో నుండి వచ్చే పోపు వాసనలను తట్టుకోలేరు. అంతకుముందు అలవాటైన వాసనలు ఆ తరువాత ఇబ్బంది పెట్టడానికి కారణం, అవి బిడ్డకు పడకపోవడమే. అందుకే బిడ్డకు ఎలాంటి వాసనలు ఇష్టమో తెలుసుకోవడానికి, వాటిని బిడ్డ ఆస్వాదించడానికి ఉపయోగపడేదే స్మెల్‌థెరపీ. గర్భంలో ఉన్న బిడ్డ ఆరోనెల నుండే తల్లి ద్వారా వాసనలను అనుభవించగలుగుతుంది. అందుకే ఆ సమయంలో గులాబీలు, చేమంతులు వంటి విభిన్న రకాల పుష్పాలను చేతిలో వేసుకొని కాస్తంత నలిపి, వాటి వాసనను పీలుస్తూ ఉండమని చెబుతుంది స్మెల్‌థెరపీ. ఇలా ప్రతిరోజూ ఐదు నుండి పదినిమిషాల పాటు చేయాలి. ఇక సహజమైన పరిమళాలను వెదజల్లే అరోమా ఆయిల్స్‌ని ఇంట్లో ఉపయోగించడం కూడా మంచిదే. ఘాటైన పరిమళాలు, వాసనలకు గర్భిణితో పాటు ఇంట్లోని సభ్యులు కూడా దూరంగా ఉండడం స్మెల్‌థెరపీలో భాగమే.
 
 టేస్ట్ థెరపీ...
 
 గర్భిణిగా ఉన్న సమయంలో తల్లి తీసుకునే ఆహారం కూడా బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అలాగే తల్లి తీసుకునే ఆహారంలోని రుచులను గర్భంలోని బిడ్డ కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది. అందుకే టేస్ట్ థెరపీలో భాగంగా రుచుల్లో స్పష్టమైన తేడా కనిపించే కూరగాయలు, పండ్లను (కాకర తరువాత టొమాటో, ఆపిల్ తరువాత ఆరెంజ్ తరహాలో) రుచిచూడమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు... బిడ్డ ఆ రుచులను ఆస్వాదిస్తోందనే విషయాన్ని గమనంలో ఉంచుకొని మరీ ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. తాము ఏ పండును, కూరగాయను తింటున్నామో, అది ఎలాంటి రుచిని కలిగి ఉందో కూడా చిన్నగా చెబుతూ ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే గర్భంలో ఉండే బిడ్డ వివిధ రుచులను ఆస్వాదించడానికి, తద్వారా చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
 
 టచ్ థెరపీ
 
 గర్భంలో ఉన్న బిడ్డ ఆరో నెల నుండే స్పర్శ (టచ్)ను తెలుసుకోగలుగుతుంది. ముఖ్యంగా తల్లి స్పర్శను బిడ్డ ఎంతగానో అనుభూతి చెందుతుంది. అందుకే ప్రతిరోజు ఐదునుండి పదినిమిషాల సమయం పాటు కాబోయే తల్లి తన గర్భంపై చేతిని ఉంచి ఆరోజు ఇంట్లో జరిగిన విషయాలు, లేదంటే మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని నెమ్మదిగా చెప్పాలి. ఇక తండ్రి స్పర్శను కూడా బిడ్డ అనుభూతి చెందడానికి తండ్రి కూడా రోజులో కనీసం ఒకసారైనా గర్భాన్ని తాకి కాసేపు మాట్లాడాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
 
 మెడికేషన్ కాదు... మెడిటేషన్ అవసరం
 
 ప్రస్తుతం చాలామంది గర్భంతో ఉన్నామని తెలిసినప్పటి నుండి మందుల వాడకాన్ని ప్రారంభించేస్తున్నారు. అయితే బిడ్డ ఎదుగుదల సరిగా ఉండడానికి, ఈ థెరపీలు తల్లీబిడ్డలపై సరిగ్గా ప్రభావం చూపడానికి మెడిటేషన్ (ధ్యానం) చాలా ముఖ్యమని చెబుతున్నారు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్రైనర్ జెస్సీ నాయుడు.
 
 ప్రస్తుతం చాలామంది గర్భస్థ శిశువుతో ఎలాంటి అనుబంధాన్ని పెంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగానే గర్భిణిగా ఉన్న సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నింటికీ ఈ థెరపీలు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. తన బిడ్డ అందరిలోనూ ప్రత్యేకమైనదని, తన బిడ్డను ప్రపంచానికి ఓ బహుమతిగా ఇస్తున్నానని తల్లి భావించాలి. అపుడే గర్భిణిగా ఉన్న సమయంలో ఎదురయ్యే సమస్యల ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉండదు. తల్లి ఆలోచనల్లో ఇలాంటి మార్పును తీసుకురావడం ద్వారా తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యాన్ని కాపాడడం ఈ థెరపీల ముఖ్య ఉద్దేశం.
 - షహనాజ్ కడియం,
 సాక్షి స్టాఫ్ రిపోర్టర్, బెంగళూరు

 
 అమ్మకడుపులో ఉన్నప్పుడే...
 నేను రెండు నెలల వయసులో ఉన్నప్పటినుంచే మా అమ్మపాటకి ‘ఊ’ కొట్టేవాడినట. నేను కడుపులో ఉన్నప్పుడు కూడా అమ్మ పాటలు పాడుతూ ఉండేదట. అమ్మ వంటపని, ఇంటిపని చేసుకుంటూ ఆ పాటలు పాడుతూ ఉంటే అంతకుముందు విన్న పాటల్లాగే అనిపించి అలా ఊ కొట్టేవాడినని అమ్మ చెప్పేది. అలా నేను అమ్మ కడుపులో ఉన్నప్పటినుంచి పాటలు వినడం వల్లనే నాకు సంగీత జ్ఞానం అబ్బిందని నా నమ్మకం.
 - డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు
 

Advertisement
Advertisement