రా... డిష్‌ | Sakshi
Sakshi News home page

రా... డిష్‌

Published Sat, Feb 11 2017 4:05 AM

రా... డిష్‌

ముల్లంగిని ఇంగ్లిష్‌లో ‘రాడిష్‌’ అంటారు.
చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది గానీ మంచి ఘాటు.
ఎవరూ ప్రేమించడానికి రెడీగా ఉండరు. ముల్లంగి కూర చేతిలో పట్టుకొని
అమ్మలు కుస్తీలు పట్టాల్సిందే తప్ప పిల్లలు గుటక మింగరు...
కానీ, ఈ ఘాటు వైట్‌ వండర్‌ని సరిగ్గా వండితే
అందరూ .. రా .. రా... రా... డిష్‌ అంటారు.


కూటు
కావల్సినవి: ముల్లంగి – 1 (తురమాలి), ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, పెసరపప్పు – అర కప్పు, నూనె – టీ స్పూన్‌

గ్రైండింగ్‌కి: పచ్చికొబ్బరి తురుము – కప్పు, జీలకర్ర – టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బియ్యప్పిండి – టేబుల్‌స్పూన్‌
పోపుకోసం: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఎండుమిర్చి – 1 (ముక్కలు చేయాలి), ఇంగువ – చిటికెడు

తయారీ: ∙పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టాలి. ∙గ్రైండింగ్‌ కోసం తీసుకున్న పదార్ధాలన్నీ మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి. ∙పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. దీంట్లో పెసరపప్పు వేసి కలపాలి. పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. పోపుకోసం విడిగా మరో కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, పోపు దినుసులు వేసి కలపాలి. ఈ పోపు మిశ్రమాన్ని కూటులో వేసి కలపాలి.

శాండ్‌విచ్‌
కావల్సినవి: బ్రెడ్‌ స్లైసులు – 4, ముల్లంగి– 1 (చిన్నది), క్యాప్సికమ్‌ – సగం ముక్క, నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్‌మసాలా – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి – 1 (తరగాలి), ఛీజ్‌ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, వెన్న – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత

తయారీ: ∙ముల్లంగిని శుభ్రం చేసి, సన్నగా తరగాలి. దీనిని గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, మిరియాలపొడి, చాట్‌ మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ∙బ్రెడ్‌ స్లైస్‌లకు బటర్‌ రాయాలి. దీనిపైన ముల్లంగి మిశ్రమం ఉంచి, ఆ పైన సన్నగా కట్‌ చేసిన 3–4 క్యాప్సికమ్‌ ముక్కలను ఉంచాలి. ఆ పైన ఛీజ్‌ తురుము వేయాలి. పైన మరో బ్రెడ్‌ స్లైస్‌ ఉంచాలి. గ్రిల్‌ లేదా పెనం మీద ఈ బ్రెడ్‌ స్లైస్‌ ఉంచి, రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చి తీయాలి. పదునైన కత్తితో త్రికోణాకృతిలో కట్‌ చేసి, టొమాటో, పుదీనా చట్నీతో వెంటనే సర్వ్‌ చేయాలి.


పరాటా పరాటా
కావల్సినవి:  గోధుమపిండి – 2 కప్పులు, ముల్లంగి తురుము – కప్పు, ముల్లంగి ఆకుల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – 1 (తరగాలి), గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాలపొడి – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత

నోట్‌: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు.

తయారీ: ∙ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి. ∙ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో  ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దను కవర్‌ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ∙ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్‌ చేయాలి. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత  రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి. స్టఫ్డ్‌ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం.

పెరుగు పచ్చడి
కావల్సినవి: ముల్లంగి తరుగు – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – తగినంత

పోపుకోసం: నూనె – టేబుల్‌ స్పూన్, పచ్చిమిర్చి – 2 (తరగాలి), ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – టీ స్పూన్‌

తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి, ముల్లంగి తరుగు వేసి వేయించాలి. మంచి గోధుమరంగు వచ్చేవరకు వేయించి దీంట్లో 2–3 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ∙ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. దీంట్లో ముల్లంగి మిశ్రమం వేసి కలపాలి. అన్నం, పరాటాలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.

సాంబార్‌
కావల్సినవి: ముల్లంగి – 2 (పైన తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), టొమాటో – 1 (ముక్కలుగా తరగాలి), చింతపండు – నిమ్మకాయంత పరిమాణం, కందిపప్పు – కప్పు (మెత్తగా ఉడికించి, పక్కన ఉంచాలి), సాంబార్‌ పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత

పోపుకోసం: నువ్వుల నూనె – టేబుల్‌ స్పూన్, ఆవాలు – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌

తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేయాలి. తర్వాత దీంట్లో టొమాటో, ముల్లంగి ముక్కలు, పసుపు, ఉప్పు, సాంబార్‌ పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించాక దీంట్లో చింతపండు రసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా దీంట్లో మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమం వేసి కలపాలి. తర్వాత ఇంగువ వేసి మంట తీసేయాలి. చివరగా కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు.
 

Advertisement
Advertisement