రేపటికి ముందడుగు | Sakshi
Sakshi News home page

రేపటికి ముందడుగు

Published Sun, Oct 11 2015 12:24 AM

రేపటికి ముందడుగు

ఒక్క ఫోన్...  బోలెడు లాభాలు
 
జేబులో స్మార్ట్‌ఫోన్ ఉందా? అదెంత పవర్‌ఫుల్లో మీకు తెలుసా? ఓ చిన్న కంప్యూటర్‌కు ఏమీ తీసిపోదు. మరి దాంతో మనం ఏం చేస్తున్నాం? కేవలం బంధు మిత్రులతో మాట్లాడుకునేందుకు, ఆడియో, వీడియోలు షేర్ చేసుకునేందుకు వాడుకుని వదిలేస్తున్నాం. ఇంతకంటే ఏం చేయగలం? అన్నదేనా మీ ప్రశ్న. అబ్బో... బోలెడు పనులు చేయవచ్చు. అంతెందుకు... కొన్ని గాడ్జెట్లను తగిలించుకున్నారనుకోండి... మీ ఇంట్లోనే ఓ హైటెక్ ల్యాబ్ ఉన్నట్లే. అదెలాగో చూడండి మరి!

 కేన్సర్‌ని గుర్తించే డీ3 సిస్టమ్
 కేన్సర్ మహమ్మారిపై మసాచూసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఎక్కుపెట్టిన తాజా అస్త్రం ఈ డిజిటల్ డైఫ్రాక్షన్ డయాగ్నసిస్ (డీ3) సిస్టమ్. వైద్య సౌకర్యాలు సక్రమంగా లేని ప్రాంతాల్లో కూడా సులువుగా వాడుకునేలా దీన్ని తయారు చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన మైక్రోబీడ్స్‌ను కలిపి రక్తం, లేదా కణజాల నమూనాలను పరీక్షిస్తే అందులో కేన్సర్ కారక మూలకాలు ఉన్నదీ లేనిదీ స్పష్టమవుతుంది. పెలైట్ టెస్ట్‌లలో పాప్‌స్మియర్స్‌లో అసాధారణంగా కనిపించిన వాటితోపాటు లింఫోమా మార్కర్లు, హ్యూమన్ పాపిలోమా వైరస్ డీఎన్‌ఏల ఈ పరికరం ద్వారా గుర్తించగలిగారు.

ఇదొక్కటే కాదు... స్మార్ట్‌ఫోన్‌కు తగిలించుకుంటే రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను చెప్పేందుకు, చెవిలోపలి ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకూ కొన్ని గాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. దాదాపు రెండు వేలు ఖరీదు చేసే యూమెడ్ పరికరం ఇంకో అడుగు ముందుకేసి మలేరియా వ్యాధి నిర్ధారణతోపాటు వాతావరణంలోని కాలుష్యాలను కూడా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాదాపు అన్ని రకాల ఫోన్లతోనూ పనిచేసే ఈ పరికరంలో రక్తం, మూత్రం లేదా నీటి నమూనాలను టెస్టింగ్‌స్టిప్‌పై ఉంచి టెస్ట్ బటన్‌ను ఒత్తితే చాలు. యూమెడ్‌లని సాఫ్ట్‌వేర్ వ్యాధి నిర్ధారణ కాలుష్యాల మోతాదులను లెక్కించేస్తుంది.
 
కరెంటు చెట్టు
చెట్టులా ఉందే... పైన సోలార్ ప్యానెళ్లేనా? మీ సందేహాలు రెండూ కరెక్టే. అందుకే ఇది ‘ఈ-ట్రీ’ అయింది. ఇజ్రాయెల్ సంస్థ ఒకటి సిద్ధం చేసింది. దీన్ని. మలమల మాడ్చే ఎండల్లో కాసింత నీడనివ్వడం ఒక్కటే దీని ప్రయోజనం కాదు. దాంతోపాటు పైన ఏర్పాటు చేసిన సోలార్‌ప్యానెళ్లు కరెంట్ ఎలాగూ ఇస్తాయి. దీంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకునే సౌకర్యం, చల్లటి నీళ్లు అందించే చలివేంద్రం... ఉచిత వైఫై... పబ్లిక్ వీడియో కాలింగ్ బూత్... అన్నీ ఈ-ట్రీ వద్దే అందుతాయి.! ఎడారి నగరం దుబాయిలోనూ ఇలాంటి సోలార్ ట్రీలను ఏర్పాటు చేశారు. ఈ-ట్రీలోని అన్ని సౌకర్యాలతోపాటు వాణిజ్య ప్రకటనలు, వినోదాల కోసం భారీ సైజు టెలివిజన్ అదనంగా ఉంటుంది.
 
 డ్రోన్ అడవిలో వంద కోట్ల మొక్కలు!
 30 లక్షల హెక్టార్లు... ప్రపంచవ్యాప్తంగా ఏటా తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం సైజు ఇది. భూమ్మీద పచ్చదనం కనుమరుగైతే ఏమవుతుందో మనకు తెలియంది కాదు. అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. వ్యాధులు విజృంభిస్తాయి. సముద్ర మట్టాలు పెరిగిపోయి తీరంలోని మహా నగరాలు మునిగిపోతాయి. మరి తరుణోపాయం? చాలా సింపుల్. వీలైనన్ని మొక్కలు నాటడమే. ఆ మాత్రం మాకూ తెలుసుగానీ... ఎలా? అంటున్నారా? బయో కార్బన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని సూచిస్తున్నారు. టెక్ ప్రపంచంలో లేటెస్ట్ ఎంట్రీ... అవేనండి మానవ రహిత విమానాలు.. క్లుప్తంగా డ్రోన్‌లను వాడుకుంటే సరి అంటోంది యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ. నాసా ఇంజినీర్ లారెన్ ఫ్లెచర్ ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ఏడాదికి కనీసం వంద కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం రెండు దశల్లో సాగుతుంది. ముందుగా మొక్కలు నాటాల్సిన ప్రదేశం తాలూకూ ఎత్తుపల్లాలు.. ఇతర వివరాలను డ్రోన్‌ల సాయంతో వివరంగా చిత్రీకరిస్తారు. ఈ క్రమంలోనే మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తారు. కూడా. ఆ తరువాత అసలు పని మొదలవుతుంది. ఎరువులు, పోషకాలతో కూడిన ప్రత్యేక పదార్థంలో అప్పుడే మొలకెత్తిన విత్తనాలను ఉంచి... చిన్న చిన్న గుళికల రూపంలోకి మారుస్తారు. ఈ గుళికలను డ్రోన్ అడుగు భాగంలో ఏర్పాటు చేస్తారు. అప్పటికే సర్వే చేసిన ప్రాంతంలో భూమికి పది అడుగుల ఎత్తులో తిరుగుతూ డ్రోన్ కొంచెం ఒత్తిడితో కలిపి విత్తనాలను భూమిలోకి షూట్ చేస్తుంది. అంతే. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటగలగడం వీటికున్న ఒక ప్రత్యేకత. మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించగలగడం మరో విశేషం. ఏటా కోతకు గురవుతున్న అటవీ ప్రాంతం స్థానంలో కొత్తగా కోటానుకోట్ల మొక్కలను నాటగలిగితే భూమి పదికాలాల పాటు పచ్చగా ఉంటుందని అంటోంది బయో కార్బన్ ఇంజినీరింగ్. మొత్తానికి భలే ఐడియా కదూ...!
 
 రోబో నలభీముడు

 ఇదో కుక్! అమెరికాలోని సెరెనిటీ కంపెనీ అభివృద్ధి చేసింది. పేరు కుకీ. పప్పు... కాయగూరలు, ఉప్పు, కారం అన్నీ అందిస్తే చాలు.. మీకిష్టమైన వంటకాన్ని వండివార్చేస్తుంది. పోపు దినుసులు ఏవి ఎప్పుడేయాలో మొదలుకొని రుచికి తగినంత ఉప్పు ఎంతుండాలో కూడా ఇదే నిర్ణయిస్తుంది. అన్నీ తగుపాళ్లలో వేస్తూ వంట సిద్ధం చేస్తుంది. దాదాపు రెండు వేల రెసిపీల లైబ్రరీలోంచి మీక్కావలసిన దాన్ని ఎంచుకోవడమొక్కటే మీరు చేయాల్సింది. ఇంకో విషయం... ‘‘వంట పూర్తయిందండోయ్... భోజనానికి దయచేయండి’’ అంటూ మీ స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ కూడా పంపుతుందీ కుకీ!
 
 త్రీడీ... చాలా హ్యాండీ!

 ప్రమాదవశాత్తూ కాళ్లూ చేతులు పోగొట్టుకున్న వారికి ఈ వార్త నిజంగా శుభవార్తే. ఎందుకంటే ప్రపంచంలోనే మొదటిసారి ఓ కంపెనీ అత్యంత చౌకైన, సమర్థమైన రోబోటిక్ అవయవాన్ని తయారు చేసింది మరి. ఫొటోలో కనిపిస్తున్నది యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్ బయోనిక్స్ సంస్థ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన కృత్రిమ చేయి. కేవలం రెండు వందల డాలర్లు మాత్రమే ఖరీదు చేసే ఈ రోబో హ్యాండ్ మామూలు చేతికి ఏమాత్రం తీసిపోదు. అత్యాధునిక సెన్సర్లు, మోటర్లు ఏర్పాటు చేశారు దీంట్లో. అంతేకాదు. ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ పద్ధతిలో చేపట్టిన ప్రాజెక్టు. అంటే... ఈ రోబో చేతికి సంబంధించిన డిజైన్లు, తయారీ విధానాన్ని ఎవరైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చునన్నమాట.
 
 లైట్ ఉంటే కరెంట్ ఉంటుంది!
 ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో మీకు తెలుసా? దీన్ని రెక్టెన్నా అంటారు. రెక్టిఫయర్ డయోడ్, యాంటెన్నాలు కలిస్తే తయారైందన్నమాట. అయితే ఏంటి? అంటున్నారా? ఇది వెలుతురును నేరుగా డీసీ కరెంట్‌గా మార్చేస్తుంది. ఇందుకోసం దీంట్లో అతిసూక్ష్మమైన కార్బన్ నానోట్యూబ్‌లను ఉపయోగించారు. వీటిని అత్యంత చౌకైన, సమర్థమైన సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేసేందుకు వాడుకోవచ్చునని, సమీప భవిష్యత్తులోనే ఇవి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.
 

Advertisement
Advertisement