ఇంటర్నెట్ ఫ్రీ..ఎప్పుడైనా! ఎక్కడైనా!! | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ ఫ్రీ..ఎప్పుడైనా! ఎక్కడైనా!!

Published Sat, Dec 21 2013 12:01 AM

ఇంటర్నెట్ ఫ్రీ..ఎప్పుడైనా! ఎక్కడైనా!! - Sakshi

జస్ట్ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు... ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంటర్నెట్‌ను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు లేదా టెక్ట్స్‌మెసేజీల కన్నా చౌకగానే నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో పరిమిత నెట్ ఆఫర్ ఉన్నా... అసలు నెట్ కనెక్షనే లేకపోయినా ఎంచక్కా నెట్‌లో వాలిపోవచ్చు. ఇందుకు చేయవల్సిందల్లా... బీ-బౌండ్ ఆండ్రాయిడ్ ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడమే!
 
రైళ్లు, బస్సులు, కార్లలో వెళుతున్నప్పుడు లేదా హోటళ్లు, కేఫ్‌ల వంటి చోట్ల, ఇళ్లలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. తరచూ ప్రయాణాలు చేసేవారికి కొన్నిచోట్ల కనెక్టివిటీ మరింత కష్టమవుతుంది. హోటళ్లు, కేఫ్‌ల వంటి పలు చోట్ల అందుబాటులో ఉండే వై-ఫై ద్వారా నెట్ బ్రౌజింగ్ చేసుకున్నా... చార్జీలు ఎక్కువగానే పడుతుంటాయి. అయితే ‘బీ-బౌండ్’ ఆండ్రాయిడ్ ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇలాంటి సందర్భాల్లో నెట్‌ను ఫ్రీగా లేదా చాలా చౌకగానే వాడుకునేందుకు వీలవుతుంది. ఇందుకు డేటా కనెక్షన్ కూడా అవసరం ఉండ దు. డేటా కనెక్షన్ ఉన్నవారు ఈ ఆప్‌తో ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

డేటా కనెక్టివిటీ లేకపోతే, నామమాత్రపు చార్జీలతో నెట్ వాడుకోవచ్చు. లో బ్యాండ్‌విడ్త్ ద్వారానే ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందేలా క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఆప్‌ను రూపొందించారు. బీ-బౌండ్ ఆప్ డేటాను క్లౌడ్ సర్వర్లపై స్టోర్ చేస్తుంది. ఆ డేటాను 2జీ నెట్‌వర్క్ ద్వారా యూజర్లకు అందజేస్తుంది. ఉదాహరణకు మీరున్నచోట వై-ఫై, ఎడ్జ్ లేదా 3జీ నెట్‌వర్క్ లేదనుకోండి. ఈ ఆప్ అక్కడ 2జీ నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌గా ఉపయోగించుకుని వెబ్‌కు, మీ స్మార్ట్‌ఫోన్‌కు మధ్య సమాచార మార్పిడి ని సాధ్యం చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ కవరేజీ మెరుగుపడుతుంది. దీనికి అదనపు పరికరాలు, సాంకేతిక హంగులవీ అవసరం లేకపోవడం కూడా సౌలభ్యాన్ని పెంచుతోంది. ఈ ఆప్‌లో అనేకరకాలుగా ఉపయోగపడే పలు ఫీచర్లు ఉన్నాయి.  
 
బీ-మెయిల్
 
 వై-ఫై, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లు లేకున్నా స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ-మెయిల్స్ పంపేందుకు, రిసీవ్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనితో ఈ-మెయిల్స్‌ను అటాచ్‌మెంట్‌లతో ఫార్వర్డ్ చేసేందుకూ అవకాశం ఉంటుంది.  
 
 బీ-వెదర్


 వాతావరణానికి సంబంధించిన వివరాలను ఈ ఫీచర్‌తో తెలుసుకోవచ్చు. ఉన్న చోట లేదా నిర్దేశిత ప్రాంతంలో, రాబోయే నాలుగు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతోందో ఈ ఫీచర్‌తో చెక్ చేసుకోవచ్చు.
 
 బీ-ఎస్‌వోఎస్


 అనుకోకుండా ఎవరూ లేని ఓ ప్రాంతంలో రోడ్డుపై వాహనం ఆగిపోయింది. నెట్‌వర్క్ కనెక్టివిటీ కూడా ఉండదు. అప్పుడేం చేయాలో తెలియక ఆందోళనకు గురికాక తప్పదు. అయితే బీ-ఎస్‌వోఎస్ ఉంటే అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న అన్ని అత్యవసర ఫోన్ నెంబర్లనూ తెలుసుకోవచ్చు. నెట్‌వర్క్ కనెక్షన్ లేకున్నా ఆ నెంబర్లకు ఫోన్‌చేసి సాయం కోరవచ్చు. ఆపదలో చిక్కుకున్నప్పుడు బీ-ఎస్‌వోఎస్ సాయంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు వెంటనే సమాచారం పంపొచ్చు. మీరెక్కడున్నారో, తక్షణం ఎలాంటి సాయం కావాలో తెలియజేస్తూ మెసేజ్ లేదా ట్వీట్ లేదా ఈ-మెయిల్‌ను పంపవచ్చు.
 
 బీ-కరెన్సీ


 ఈ ఆప్‌తో ఏ దేశపు కరెన్సీనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. రోజూ కరెన్సీ విలువలు మారిపోతుంటాయి కాబట్టి ఇది ఆ మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ అవుతుంది. ఆ రోజు ఉన్న మారకం విలువతోనే కరెన్సీని కన్వర్ట్ చేస్తుంది.
 
 బీ-ట్రాన్స్‌లేట్


 ఈ ఫీచర్ సాయంతో ఏ టెక్ట్స్‌నైనా ముఖ్యమైన అనేక భాషల్లోకి అనువదించి చూసుకోవ చ్చు. దూర ప్రయాణాలు, పర్యటనల సమయంలో, భాష తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
 
 బీ-ఫైండ్


 కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడికి సమీపంలో రెస్టారెంట్లు ఎక్కడున్నాయి? బ్యాంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ఇంకా అత్యవసరమైన అనేక చిరునామాలనూ ఈ ఫీచర్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. మనం చేరుకోవలసిన చోటు ఎటువైపు ఉందో చూపే దిక్సూచి ఉండటం దీని ప్రత్యేకత.
 
 బీ-స్టాక్


 ఈ ఫీచర్‌తో ముఖ్యమైన స్టాక్ మార్కెట్ల తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. షేర్‌మార్కెట్ల సమాచారం అత్యవసరం అయినవారు షేర్లు, ట్రేడింగ్, ఇతర వాణిజ్యపరమైన సమాచారాన్ని దీనితో తెలుసుకోవచ్చు.  
 
 బీ-ఫ్లైట్


 తరచూ విమానంలో ప్రయాణించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. విమాన సర్వీసులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉన్నచోటు నుంచి విమానాశ్రయం చేరుకునే వరకూ అనేకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది.
 
 వీటితోపాటు బీ-న్యూస్, బీ-పాత్, బీ-సెర్చ్ ఆప్షన్లు కూడా ఈ ఆప్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మొబైల్ ఇంటర్నెట్‌ను సులభతరం చేసే ఈ ఆప్ వల్ల డేటా డెడ్ జోన్లు, రోమింగ్ జోన్లలో డేటా యాక్సెస్ కష్టాలు, చార్జీల భారం వంటివి తప్పుతాయి. ఈ ఆప్‌ను ఉపయోగించాలంటే... బీ-మైల్స్ రూపంలో ప్రీపెయిడ్ పద్ధతిలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డేటా కనెక్టివిటీ ఉన్న యూజర్లకు ఇది ఉచితం. కనెక్షన్ లేనివారికి మాత్రం ఒక ప్రామాణిక టెక్ట్స్ మెసేజ్‌కి ఒక బీ-మైల్ ఖర్చవుతుంది. ప్రస్తుతం 80 బీ-మైల్స్‌కు 4.30 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆప్ కావాలనుకుంటే  http://www.be-bound.com లింకులోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 - హన్మిరెడ్డి యెద్దుల
 

Advertisement
Advertisement