దోస్తీ కా బాద్‌షా | Sakshi
Sakshi News home page

దోస్తీ కా బాద్‌షా

Published Fri, Jul 10 2015 11:19 PM

దోస్తీ కా బాద్‌షా

ఇది రంజాన్ మాసం.
పవిత్రమైన మాసం.
దేవుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించే మాసం.
మానవత్వానికి ప్రతిరూపమైన మాసం.
ఈ మాసంలో నిష్టగా ఉండేవాడే సచ్చా ముసల్మాన్.
ప్రతిమాసం ఈ మాసంలో ఉన్నట్లే ఉండేవాడు... అచ్చా ముసల్మాన్.
అహ్మద్ బాషా... మంచితనానికి బాద్‌షా!
లోక కల్యాణం కోసం ఆ ఆంజనేయుడు సంజీవినిని మోసాడంటారు.
స్నేహధర్మాన్ని నిలబెట్టడం కోసం బాషా ఈ ఆంజనేయుడినే మోస్తున్నాడు.
తండ్రీకొడుకులు, అన్నదమ్ములే విడిపోతున్న ఈ సమాజంలో...
స్నేహితుణ్ణి కష్టసుఖాల్లో సమానంగా ఆలింగనం చేసుకుంటున్న
అహ్మద్ బాషాను చూస్తుంటే అప్పుడే రంజాన్ వచ్చేసిందా అనిపిస్తుంది!
అహ్మద్, ఆంజనేయులకు... దోస్తీ ముబారక్.
 

యథాలాపంగా కాదు గానీ, కాస్త మనసుపెట్టి వీళ్లిద్దరినీ గమనిస్తే ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’, ‘యే దోస్తీ.. హమ్ నహీ ఛోడేంగే..’ వంటి పాటలు అసంకల్పితంగానే గుర్తుకొస్తాయి. వాళ్లను చూసినప్పుడు అలాంటి పాటలు గుర్తుకు రాకపోతే మాత్రం మనం ఎక్కడో ఆలోచిస్తున్నట్టు లెక్క!

ఎందుకంటే, పొడిపొడి పలకరింతల స్నేహాలు.. అవసరార్థ స్నేహాలు.. అనవసరపు స్నేహాలు.. అనివార్య స్నేహాలు.. కాకా స్నేహాలు.. బాకా స్నేహాలు.. ముఖపరిచయ మాత్రపు స్నేహాలు.. ముఖస్తుతి స్నేహాలు.. మొహమాటపు స్నేహాలు.. విందు స్నేహాలు.. మందు స్నేహాలు.. రాజకీయ స్నేహాలు వంటి కల్తీ స్నేహాలే ‘స్నేహం’గా చలామణీ అవుతున్న లోకంలో వాళ్లిద్దరూ స్ఫటికంలాంటి సిసలైన స్నేహంలోని స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నారు మరి!

ఎవరా స్నేహితులు.. ఏమా కథ.. అంటారా..? అక్కడికే వద్దాం.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఉంటారు వాళ్లు. పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువలాంటి ఊరు అది. ఇద్దరిదీ అదే ఊరు. ఏడేళ్లుగా కొనసాగుతోంది వాళ్ల స్నేహం. అలాగని వాళ్లిద్దరూ చిన్ననాటి క్లాస్‌మేట్స్ కాదు. ఇద్దరికీ ఎలాంటి బంధుత్వమూ లేదు. ఇద్దరివీ వేర్వేరు మతాలు, వేర్వేరు నేపథ్యాలు. అయితే ఇవేవీ వారి స్నేహానికి అడ్డురాలేదు.
 పెద్దమసీదు తోట ప్రాంతంలో అహ్మద్ బాషా కుటుంబం ఉంటోంది. బాషా ఇంటికి కాస్త దగ్గర్లోనే ఆంజనేయులు ఇల్లు ఉంది. ఆంజనేయులు వికలాంగుడు. పుట్టిన కొన్ని నెలలకే పోలియో బారిన పడ్డాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. బాషా ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణించడంతో కుటుంబ భారం మీద పడి, చదువు ఆగిపోయింది. తండ్రి మరణించాక, కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు బేల్దారి పనులకు వెళ్లడం ప్రారంభించాడు బాషా. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసిన తర్వాత, సాయంత్రం వేళ తన స్నేహితులతో కలసి తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక అరుగుపై కూర్చొని పిచ్చాపాటీ కబుర్లతో కాలక్షేపం చేసేవాడు. వాళ్లు రోజూ కబుర్లు చెప్పుకొనే సమయంలో ఆంజనేయులు తన ఇంటి అరుగుపై ఒంటరిగా కూర్చొని వాళ్లను గమనించేవాడు. ఒకరోజు బాషా స్నేహితులు రాలేదు. అదే సమయంలో ఒంటరిగా కూర్చున్న ఆంజనేయులును గమనించాడు బాషా. ఇద్దరికీ మాటలు కలిశాయి. ఏ ముహూర్తాన వాళ్ల మధ్య మాటలు కలిశాయో గానీ, అనతికాలంలోనే వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులుగా మారారు.

వికలాంగుడైన ఆంజనేయులు మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని గమనించిన బాషాకు అతడిపై అభిమానం పెరిగింది. అప్పటి వరకు తనతో రోజూ కబుర్లతో కాలక్షేపం చేసే స్నేహితులను వదులుకొని ఆంజనేయులుతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఏడేళ్లవుతున్నా, వాళ్లిద్దరి మధ్య ఒక్కసారి కూడా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదంటే, వాళ్ల మధ్య అనుబంధం ఎంతగా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. తమ స్నేహంపై వాళ్లిద్దరూ ఒకరి గురించి మరొకరు పంచుకునే అనుభూతులు కూడా వాళ్ల స్నేహంలాగే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉంటాయి.
 - పచ్చా ఎ.కిషోర్‌బాబు, సాక్షి, ఒంగోలు టౌన్
 ఫొటోలు:  ఎం.ప్రసాద్, ఒంగోలు
 
 ఆస్పత్రికి తీసుకువెళ్లాడు
 మా నాన్న పోయాక మానసికంగా కుంగిపోయాను. కొంచెం తేరుకున్నాక మెల్లగా పనుల్లోకి వెళ్లేవాడిని. ఒకసారి ఆరోగ్యం బాగులేక ఐదురోజులు మంచానపడ్డాను. అలా బాధపడుతున్న నన్ను ఆంజనేయులు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తన మూడు చక్రాల సైకిల్‌పైనే పొదిలి ఆస్పత్రికి తీసుకు వెళ్లి నా పేరు మీద చీటీ రాయించాడు. వైద్యం పొందే వరకు నన్ను విడిచి పెట్టలేదు. నేను పనుల్లోకి వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర అమ్మకు ఏ అవసరమైనా వెంటనే సాయం చేసేవాడు. మా స్నేహాన్ని చెడగొట్టడానికి కూడా కొందరు ప్రయత్నించారు. వికలాంగుడితో స్నేహమేంటని గేలిచేశారు. అయితే, వాళ్లే నాకు దూరమయ్యారు.
 - అహ్మద్ బాషా
 
 దేవుడిచ్చిన స్నేహితుడు
 బాషా నాకు దేవుడిచ్చిన స్నేహితుడు. ఎవరో ఒకరు సాయం చేయనిదే ముందుకు కదల్లేని స్థితిలో ఉన్న నన్ను అనుక్షణం కనిపెట్టుకొని ఉంటాడు. ఉదయాన్నే నిద్ర లేచాక నా మూడు చక్రాల సైకిల్‌పై కూర్చుంటే, బస్టాండ్ వరకు నెట్టుకుంటూ తీసుకువెళతాడు. బస్టాండులో ఇద్దరం చాయ్ తాగి తిరిగి ఇంటికి వస్తాం. ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చి, కదల్లేని స్థితిలో ఉంటే, బాషా నన్ను రెండు చేతులతో ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. బాషా లేకుంటే ఆంజనేయులు అనేవాడు ఉండడు.
 - ఆంజనేయులు
 

Advertisement
Advertisement