కాలమే సాక్షి... దేవుడు ప్రేమిస్తాడు! | Sakshi
Sakshi News home page

కాలమే సాక్షి... దేవుడు ప్రేమిస్తాడు!

Published Sat, Dec 31 2016 11:43 PM

కాలమే సాక్షి... దేవుడు ప్రేమిస్తాడు!

నయా ఔర్‌ నేక్‌

కాలం అమూల్యమైనది. అది ఎవరి కోసమూ ఆగదు. పరుగు దాని నైజం. నిరంతరం అది పరుగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే తప్ప మజిలీలు లేవు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్త వత్సరాలు వస్తూ ఉంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ‘ఉగాది’తో కొత్తసంవత్సరం ప్రారంభమైనట్లుగానే, ఇస్లామీయ కేలండరు ప్రకారం, హి. శ. మొదటి మాసం ‘ముహర్రమ్‌’తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే క్రీస్తుశకంలో ఆంగ్ల సంవత్సరం జనవరితో ఆరంభమవుతుంది. గతానికి వీడ్కోలు పలికి, కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోను కావడం సహజం. సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. అయితే, ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధకార్యాలకు పాల్పడడం ధార్మికంగానే కాక సామాజికంగా, నైతికంగానూ నేరమే. దీనికి దేవుని ముందు జవాబు చెప్పుకోవాలి.

అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యథార్థాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలాకాకుండా గడించిన కాలాన్ని గాలి కొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్థంపర్థం లేని కార్యకలాపాలతో కొత్త కాలాన్ని ప్రారంభిస్తే, ప్రయోజనం శూన్యం. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు – అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసిపోవలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.

గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యత్‌ కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కానీ మందు, చిందు – ఇతరత్రా అసభ్య, నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్త సంవత్సర ప్రారంభాన ఆత్మపరిశీలన చేసుకోవాలి.

మంచిపనులు చేసి ఉంటే ఈ కొత్త సంవత్సరంలో అవి ఇంకా ఇంకా ఎక్కువగా చెయ్యాలన్న దృఢసంకల్పం చేసుకోవాలి. ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందుతూ, ఇక ముందు వాటన్నిటినీ కచ్చితంగా విసర్జిస్తామని ప్రతిన బూనాలి. ఇక నుండి ఓ నూతన, మంచి (నయా ఔర్‌ నేక్‌) శకానికి నాంది అన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. చేసిన పాపాల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో వాటి జోలికి పోనని ప్రతిన బూనినవారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి పాపాల్ని క్షమిస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమో ఎవరికీ తెలియదు. కనుక హద్దుల్ని అతిక్రమించకుండా, విలువలతో కూడిన జీవితం గడపడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో..  
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement