గోదావరి మమకారం | Sakshi
Sakshi News home page

గోదావరి మమకారం

Published Mon, Jul 13 2015 11:25 PM

గోదావరి మమకారం

కంద-బచ్చలి...
పనస-ఆవ...
అరటి దూట-పెసర...
అరటి పవ్వు-కొబ్బరి...
తాటిపండు-బెల్లం...
రేర్ కాంబినేషన్లు!
వేరెక్కడా దొరకని గోదావరి రుచులు.
పుష్కరస్నానంతో శరీరం ప్రక్షాళన అయినట్లే...
పుష్కరప్రాంత రుచులతో మనసు పులకరిస్తుంది.
మరో పుష్కరం వరకు ఈ మధురానుభూతులు గుర్తుండిపోతాయి.
మీరు గోదావరి వారైతే ఈ వంటలతో ఆతిథ్యం ఇవ్వండి.
మీరు గోదావరికి వచ్చిన వారైతే...
వీటిల్లో ఏ ఒక్క వంటకాన్నీ మిస్ కాకండి.

 
 పనస పొట్టు ఆవపెట్టిన కూర  కావలసినవి:
 పనస పొట్టు - 2 కప్పులు; అల్లం తురుము - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 8; చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు (కొద్దిగా చింతపండును బాగా నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి కొద్దిగా వేడి చేసి పక్కనుంచాలి)ఆవ కోసం... ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 2 (తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా నూరితే ఆవ సిద్ధమవుతుంది) పోపు కోసం... సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; నూనె - 4 టీ స్పూన్లు; ఇంగువ - రెండు చిటికెలు
 
తయారీ:   ముందుగా బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కొద్దిగా వేయించిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు, పచి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి  పనసపొట్టు, పసుపు వేసి బాగా కలిపి పావు కప్పు నీళ్లు పోసి మూత ఉంచాలి  కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసేసి ఉడకనివ్వాలి  మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి  ఉప్పు వేసి కలపాలి  చింతపండు గుజ్జు, ఆవ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
 
 కంద బచ్చలి తీపి కూర
 కావలసినవి: కంద - 200గ్రా.; బచ్చలి కూర - 1 కట్ట; చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి - 3; బెల్లం తురుము - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - తగినంత
 పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు

 తయారీ:  ముందుగా కందను శుభ్రంగా కడిగి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి  బచ్చలికూరను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి  పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి  కంద ముక్కలు, బచ్చలి తరుగు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టాలి  బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం తురుము, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి  కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
 
 అరటిదూట పెసరపప్పు చలవ కూర
 కావలసినవి: అరటిదూట - ఒక ముక్క (మార్కెట్లో ముక్కలు అమ్ముతారు); పెసర పప్పు - పావు కప్పు; పచ్చి మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత
 తయారీ: ముందుగా అరటిదూటను శుభ్రం చేయాలి  ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, అరటి దూటను సన్నగా తరగి ముక్కలను ఉప్పు నీళ్లలో వేయాలి. (లేదంటే నల్లబడిపోతాయి)  పెసరపప్పును సుమారు అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి  పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి మరోమారు వేయించి ముందుగా అరటి దూట ముక్కలు వేసి బాగా కలపాలి  పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి.  కొద్దిగా ఉడుకు పట్టాక ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మరికాసేపు ఉంచి మెత్తగా ఉడికిన తర్వాత దించేయాలి  (ఇది ఒంటికి చలవ చేయడమే కాకుండా, మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది).
 
అరటిపువ్వు కొబ్బరి కమ్మటి పచ్చడి
 కావలసినవి: అరటిపువ్వు - చిన్నది (1); కొబ్బరి ముక్కలు - కప్పు; సెనగ పప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 10; చింతపండు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; ఇంగువ - రెండు చిటికెలు

 తయారీ: ముందుగా అరటిపువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టి తీసి, నీళ్లలో బాగా కడిగి గట్టిగా పిండేసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించి తీసేయాలి  అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి బాగా వేయించి తీసేయాలి  మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా పట్టాక, కొబ్బరి ముక్కలు వేసి బాగా తిప్పాలి  వేయించి ఉంచుకున్న అరటిపువ్వు వేసి మరోమారు మెత్తగా తిప్పాలి  ఉప్పు, పసుపు, చింతపండు వేసి మరోమారు మెత్తగా తిప్పాలి  వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యితో ఈ పచ్చడి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Advertisement
Advertisement