మా నాయనే! బంగారం!! | Sakshi
Sakshi News home page

మా నాయనే! బంగారం!!

Published Tue, Dec 6 2016 11:38 PM

gold is a hot topic in india

బంగారం ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. తులం బంగారమైనా మనకు కొండంత బంగారమే.కానీ వీళ్లు చూడండి... బంగారు కొండల్నే పిండిగొట్టి తెచ్చినట్టుగా బంగారాన్ని రేకులుగా, కేకులుగా, పూతరేకులుగా, పొరలు పొరలుగా మలిచి ఎన్ని శింగారాలు పోయారో!!
 
గోల్డ్ డంబెల్స్: జపాన్‌లో 2006లో ఈ గోల్డెన్ డంబెల్స్ తయారయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ డంబెల్స్‌ను టోక్యో హోటల్‌లో ప్రదర్శనకు పెట్టారు. కిలో నుంచి మూడు కిలోల వరకు బరువున్న ఈ డంబెల్స్‌ను 15 నుంచి 43 లక్షల రూపాయల  మధ్య విక్రయించారు. టనాకా అనే కంపెనీ వీటిని డిజైన్ చేసింది.

 
గోల్డ్ క్యాలెండర్: ఇది 2009 నాటి క్యాలెండర్. దీనిని టనాకా జ్యుయలరీ కంపెనీ తయారు చేయించింది. 2008లో ఈ క్యాలెండర్‌ను అమ్మకానికి పెడితే కోటీ 94 లక్షల రూపాయలకు ఎవరో ఎగరేసుకుపోయారు.



 
గోల్డ్ టాయ్‌లెట్: హాంకాంగ్‌లోని ఒక సంపన్నుడు.. తన కోసం చేయించుకున్న ఈ బంగారు టాయ్‌లెట్‌ని చూసే భాగ్యాన్ని 2005లో బయటి ప్రపంచానికి కలిగించాడు. విలువ సుమారు 28 కోట్ల రూపాయలు.


 
గోల్డ్ లెన్స్: లెన్స్ అంటే కాంటాక్ట్ లెన్స్. ఇండియాలోని ప్రముఖ కళ్లద్దాల విక్రేత చంద్రశేఖర్ చవాన్ 2011లో ఐదు గ్రాముల బరువుతో ఈ బంగారు లెన్స్‌ను రూపొందించారు. పదిన్నర లక్షల రూపాయలకు వీటిని విక్రయించారు.

 
గోల్డ్ హార్స్: ఈ కంచు గుర్రం విగ్రహం మీద పూత అంతా బంగారమే. 2014 అశ్వనామ సంవత్సరం కావడంతో జపాన్‌లోని టనాక జ్యుయలరీస్ వారు దీనిని డిజైన్ చేసి అప్పట్లో కోటి రూపాయలకు అమ్మారు.



 
గోల్డ్ పిల్స్: కొన్నేళ్ల క్రితం జండూ ఫార్మస్యూటికల్స్ వాళ్లు బంగారు పూత పూసి, శృంగార ఉద్దీపనాలుగా బ్రిటన్‌లో విక్రయించిన నక్స్ వామికా ఔషధ గుళికలు ఇవి. బ్రిటన్‌లో ఆసియా సంతతి పురుషులు వీటిని అప్పట్లో ఎగబడి కొన్నారట!


గోల్డ్ టాయ్‌లెట్ పేపర్
24 క్యారెట్‌ల బంగారు పొరలతో ఈ లగ్జరీ టాయ్‌లెట్ పేపర్ తయారైంది. 2014లో జర్మనీలోని ఓ టిష్యూ డిజైన్ వర్క్‌షాప్ దీనిని రూపొందించింది. ఒక్కో రోల్ ధర రూ. 17 వేలు.

 
గోల్డ్ షూ: సుమారు కిలో బరువున్న ఈ గోల్డ్ షూను చైనాలోని షెన్యాంగ్ పట్టణంలోని ఒక చెప్పుల దుకాణం ఇటీవల ప్రదర్శనకు పెట్టింది. ఈ సింగిల్ షూ ఖరీదు 27 లక్షల రూపాయలు.


 
గోల్డ్ సండే: సండే అంటే ఒక రకం ఐస్ క్రీమ్. పండ్ల ముక్కలు, ఎండు పప్పులు, స్వీట్ సాస్ చల్లి చేసే ఐస్‌క్రీమ్. వీటితో పాటు 24 క్యారెట్‌ల బంగారాన్ని కూడా పూత రేకుగా పైన అంటించి 2007లో ఈ గోల్డ్ సండేని న్యూయార్క్‌లోని ‘సెరెండిపిటి 3’ అనే రెస్టారెంట్ తయారు చేసింది . దీనికి ‘ఫ్రోజెన్ ఔట్ చాకొలెట్’ అనే పేరు పెట్టి 17 లక్షల రూపాయలకు అమ్మింది! అదే ఏడాది ఈ బంగారు చాక్‌లెట్ క్రీమ్.. అత్యంత ఖరీదైన స్వీట్‌గా గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది!

Advertisement
Advertisement