అందమైన మూడు ముళ్లు | Sakshi
Sakshi News home page

అందమైన మూడు ముళ్లు

Published Sun, May 1 2016 10:44 PM

అందమైన మూడు ముళ్లు

మంచి ఆనవాయితీ
ఆధునిక కాలం పెళ్లిళ్లు మరింత అర్థవంతమవుతున్నాయి. వెనుకబాటుతనాన్ని వదులుకుంటున్నాయి. అందుకు దేశంలో జరిగిన ఈ మూడు ఉదంతాలే మూడు ముళ్లుగా నిలుస్తున్నాయి.

 
‘పెళ్లికి ఏం నగలు కావాలి.. ఎన్ని చీరలు కొనాలి?’అని కాబోయే అత్తమామలు అడిగితే ఎవరైనా ఎగిరిగంతేసి తమకు ఏమేమి కావాలో చాంతాడంత జాబితా చదువుతారు. కాని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పర్యావరణ ప్రేమికురాలు మాత్రం ‘నాకు అవేవీ వద్దు, ఓ పదివేల మొక్కలు కొని ఇస్తే చాలు అంది.
 
మొక్కే కానుక...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని కిసిపురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల సైన్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంకా భదోరియాకి బాల్యం నుంచి పర్యావరణమన్నా, పచ్చదనమన్నా పిచ్చప్రేమ. ప్రకృతి పదికాలాలపాటు పచ్చగా పరిఢవిల్లాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా, కాలుష్యం కోరల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నా అడవులను పెంచటమే ఉత్తమ మార్గం అని విశ్వసించింది. ఇక్కడి ప్రజలు వివిధ అవసరాల కోసం విచ్చలవిడిగా చెట్లను కొట్టేస్తుండటం వల్ల భూములు బీళ్లుపడి నిస్సారంగా మారిపోతున్నాయని, వర్షాభావ పరిస్థితులు అలుముకుంటున్నాయని, మరికొంతకాలంపాటు ఇలాగే కొనసాగితే తమ గ్రామం కూడా బీడుపడిపోతుందని భయపడింది.

ఈ పరిస్థితిని నివారించడం కోసమే ఆమె తన పెళ్లి సందర్భంగా ఓ పదివేల మొక్కలను కొనిమ్మని కోరింది. కాబోయే కోడలి వింతకోరికకు ముందు ఆశ్చర్యపడ్డా తర్వాత చాలా ఆనందపడ్డారు అత్తమామలు. ఇక పెళ్లికొడుకు రవి చౌహాన్ అయితే తన కాబోయే భార్య పర్యావరణ ప్రేమకు మురిసిపోయాడు. ఆమె కావాలని కోరిన మొక్కల్లో ఓ అయిదువేల మొక్కలు ఆమె పుట్టింట్లోనూ, మరో ఐదువేల మొక్కల్ని తమ పొలంలోనూ నాటించి నవ వధువు ముచ్చట తీర్చాడు పెళ్లికొడుకు.
 
గురువుకు వందనం
ఇలాంటి కొత్త ఆలోచనల పెళ్లి కూతురే నిషాద్‌బాను కూడా. గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషాద్‌బానుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తన పెళ్లి సందర్భంగా  వివాహ వేదికను రకరకాల పూలతో, విద్యుద్దీపాలతో అలంకరించడం, పెళ్లి విందుకోసం వివిధ రకాల పదార్థాలను వండించడం తదితర వృధా ఖర్చుకు బదులుగా ఓ అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంది నిషాద్. అదేమంటే తనచేత ఓనమాలు దిద్దించినవారి నుంచి, కళాశాలలో ఉన్నతవిద్య బోధించిన వారివరకు గురువులందరినీ గుర్తుపెట్టుకుని, సన్మానించాలనుకుంది.
 
ఓ రైతుకుటుంబంలో పుట్టిన నిషాద్‌బాను ఎంసిఎ చదివాక అదే గ్రామానికి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రమీజ్ మహమ్మద్‌ను పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే పెళ్లి కొడుకును ముందుగానే కలిసి అందరిలా కాకుండా అందరికీ చిరకాలం గుర్తుండిపోయేలా వినూత్న రీతిలో పెళ్లి చేసుకుందామని ఒప్పించింది. చదువును ప్రేమించే బాను తలిదండ్రులు కూడా అందుకు ఆనందంగా అంగీకరించి, పదిలక్షల రూపాయలు ఇచ్చి, నీకు నచ్చినట్లుగా చేయమంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు.

తలిదండ్రులిచ్చిన డబ్బుకు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు బహమతిగా ఇచ్చిన మొత్తాన్ని కూడా జత చేసి కేజీ నుంచి, పీజీ వరకు తనకు చదువు చెప్పిన గురువులలో 75మంది విశ్రాంత ఉపాధ్యాయులను పేరుపేరునా పెళ్లికి పిలిచి, కడుపునిండా విందుభోజనం పెట్టి, జ్ఞాపిక, శాలువా, కొంత నగదు ఇచ్చి, వారికి భక్తిశ్రద్ధలతో గురుద క్షిణ చెల్లించింది. వృద్ధాప్యం వల్ల లేదా ఇతర కారణాల వల్ల పెళ్లికి రాలేకపోయిన గురువుల వద్దకు భర్తను వెంటబెట్టుకుని స్వయంగా వెళ్లి మరీ సన్మానించి వచ్చింది. బాను పెళ్లికి వచ్చిన వారిలో చాలామంది అవివాహితులు తాము కూడా తమ పెళ్లికి ఇలానే చేస్తామని ఆమెకు మాట ఇవ్వడం గమనార్హం.
 
బాల్య వివాహమా..
అయితే టెంట్లు అద్దెకిచ్చేది లేదు రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దురాచారం అంతమవుతుంది. ఈ మాటే ఆలోచించిన రాజస్థాన్‌లోని దాదాపు 47,000 మంది టెంట్ డీలర్లు బాల్యవివాహాలకయితే టెంట్లు, వంట సామగ్రి అద్దెకివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి టెంట్లు, వంటసామగ్రి తదితరాలను అద్దెకు కావాలని వచ్చే వారి దగ్గర వధూవరుల బర్త్ సర్టిఫికెట్లను పరిశీలించి, వారు మేజర్లని నిర్థారణ అయితే కానీ వారి ఇంట టెంట్లు వేసేదిలేదని వారు నిర్ణయం తీసుకున్నారు.

అంతటితో ఆగకుండా ఒకవేళ తమ పరిశీలనలో అది బాల్యవివాహమని తేలితే గుట్టుచప్పుడు కాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మా ఆడపిల్లల మంచి భవిష్యత్తుకు మా నిరాకరణే ఒక కానుక అని వీరు అంటున్నారు. ఏప్రిల్ ఆఖరివారం ఉంచి మే మొదటివారం వరకు రాజస్థాన్‌లో పెళ్లిళ్ల సీజన్ అట. ఈ సీజన్‌లోనే బాల్యవివాహాలు జరిగే అవకాశం మెండుగా ఉందట. తమ లాభాలను సైతం కాదనుకుని, బాల్యవివాహాలను కనీసం ఈ విధంగానైనా ఆపాలని వీరంతా కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.

Advertisement
Advertisement