పున్నారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా? | Sakshi
Sakshi News home page

పున్నారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?

Published Tue, Sep 25 2018 7:05 AM

government not support the Punna Rao family? - Sakshi

30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొనిæ ఆత్మహత్య పాలైన ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కోపూరి పున్నారావు(50) ఇంట్లోనే పురుగులమందు తాగి సత్తెనపల్లిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 మే 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నది.

ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని.. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అప్పట్లో మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో అప్పు రూ. 5 లక్షలకు పెరిగింది. తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు భూమి గకూడా  లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభు త్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు.
– ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు

Advertisement
Advertisement