రోమాంచిత కళావిలాసం | Sakshi
Sakshi News home page

రోమాంచిత కళావిలాసం

Published Fri, Dec 25 2015 12:19 AM

రోమాంచిత  కళావిలాసం

విభ్రాంతి కలిగించేటంత గొప్ప కళాఖండాలను చూసేటప్పుడు కళాపోషకులైన సందర్శకులు రోమాంచితులు కావడం విశేషమేమీ కాదు. సాక్షాత్తూ రోమాలతోనే కళాఖండాలు రూపొందిస్తే..? అవి కూడా జీవకళ తొణికసలాడుతూ కనిపిస్తే..? కళాపోషకులు, కళాభిమానులే కానక్కర్లేదు... ఎలాంటి వారికైనా రోమాంచితమైన అనుభూతే తప్పక కలుగుతుంది. చైనీస్ కళాకారుడు లీ హైలింగ్ చూపరులకు అలాంటి అనుభూతినే కలిగిస్తున్నాడు. చైనా నడిబొడ్డున ఉన్న హెనాన్ రాష్ట్రంలోని లింగ్‌బావోలో ఉంటాడితడు. ఇక్కడే పుట్టి పెరిగాడు. వృత్తిరీత్యా క్షరకుడు. ప్రవృత్తిరీత్యా కళాకారుడు. తొలినాళ్లలో అందరిలాగే పెన్సిళ్లు, రంగులు, కుంచెలతోనే కుస్తీ పట్టేవాడు. అందులో వెరైటీ ఏదీ లేదనిపించింది. వృత్తిలో భాగంగా రోజూ కత్తెరకు పని చెప్పాక కళ్లముందే పడి ఉండే కేశరాశులను చూశాక ఇతగాడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే తడవుగా అమలులో పెట్టేశాడు.

కేశరాశులతోనే కళాఖండాల సృజన ప్రారంభించాడు. చార్‌కోల్ పెన్సిల్‌తో తీర్చిదిద్దినంత సజీవంగా రూపుదిద్దుకున్నాయి లీ తీర్చిదిద్దిన కేశచిత్రాలు. వీటి తయారీకి ఇతగాడు కనీసం ఎలాంటి జిగురు పదార్థాన్నీ వాడడు. కోరుకున్న రూపంలో కేశాలన్నింటినీ, కేన్వాస్‌పై చక్కగా తీర్చిదిద్దుతాడు. అంతే! సజీవమైన పోర్ట్రైట్‌లు తయారవుతాయి. కొద్దిగా గాలివీస్తే చాలు ఇవి చెదిరిపోతాయి. అందుకే, చిత్రం పూర్తయిన వెంటనే ఫొటోతీసి, భద్రపరచుకుంటాడు. వాటిని సోషల్ మీడియా వెబ్‌సైట్లలో షేర్ చేస్తుంటాడు. వాటికి లెక్కలేనన్ని లైకులు... కామెంట్లుగా అసంఖ్యాకమైన ‘ఆహా’శ్చర్యాలు.
 
 సమ్‌థింగ్ స్పెషల్

Advertisement
Advertisement